సామరస్యం కనుమరుగైపోయిన చోట
అందీ అందని ఒక కోణమేదో
సామాజికమైపోయింది
ఎల్లలెరుగని నీవు
వెన్నెలెరుగని నేలనవుతాననో
హృదయోల్లాస ఉదయంగానో
దృశ్య సమన్వయం చేస్తాననుకుంటూనే
నీదైన వారసత్వ ప్రతిబింబాలను కోరుతూ
ఇల్లు కావాలంటే
ఇల్లాలు రావాలంటావు
కలిమి లేముల నడక ఆగదు
బ్రతుకు దుస్సాహస పర్వతారోహణ అయినప్పుడు
భార్య రూపాన్ని
ఊతకర్ర చేసుకుంటావు
కోరికలు గుర్రాలై
భర్త అవతారమెత్తగానే ఏదో వికారం నీలో చేరుతుంది
అడగనంటూనే
అర్థ పరమార్థాల ప్రస్తావనలు తెస్తావు
పెళ్లి సంబంధాల ముందు కుప్పబోసినవన్నీ తెప్పలు చేస్తుంటావు
నీకు లేక కాదు
పేరాసల కూడిక
పెళ్ళాం లా ఓ పిల్ల కావాలంటావు
వరకట్న వలలో చిక్కిన
బక్కబతుకుల
తల్లిగారు వాళ్ళను పిప్పి చేసిన సంబరం నీదౌతుంది
చేతి గడియారం
సెల్లు ఫోన్ స్మార్ట్ గా నీ హస్తగతం అయ్యాక
బుల్లెట్టు బండో
కన్వీనియంట్ కారో
డిమాండ్ పాటలే ఇక
దోస్తుల ఎగదోతలో
చుట్టాల మాటల పోటీలో
అనునిత్య పల్లవులతుంటాయి
కన్నకూతురు కన్నీరు కావద్దని
వాళ్లేమో కానుకలవుతుంటారు
అడిగినవన్నీ ఎగిరొచ్చి వాలేసరికి
ఎటుదిరుగబుద్ధవుతుందో ఎవరికెరుక!
నీదైన వ్యసనాల లోకంలో నో
యూట్యూబ్ బొమ్మల్లో బొమ్మవయ్యో చరిస్తూ
నీ కంటి దోసిళ్ళతో ఆమె కలల ఆశల్ని తీసుకోక
తన కన్నవారి చూపులకూ దూరం పెంచేస్తావు
నీ గుండె మీద కునుకు తీయాల్సిన
భార్య ను
ఇన్నేసి గొంతమ్మ కోరికల తుట్టె వెంటేసుకొని
ఇంటోళ్ళతో కలిసి పేరాశను కట్టి
ఆమె గొంతు కోస్తావు
ఒద్దొద్దు … ఒద్దొద్దు…
గృహసీమ కు పరిమళాలన్నీ అద్దు
హద్దు లేని నీ మనసు
డబ్బు మూటతో మూయకు
నీ సంసార దేహానికి మూలాధార సంధి స్థానం ఆమె
ఆమె కన్న కలలు
నీ కన్నుల వెన్నెల
చలువ కాంతులు !
కట్నాల కొలిమిలో కాదు !!
_*_