అందమంటే ఇష్టం ఉండని వాళ్లు ఉండరు. అందం చేత ఆకర్షింపబడని వాళ్లుండరు. ముఖ్యంగా ఈ రోజుల్లో అందానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నాము. వయసు మీరినా యవ్వనంగా కనపడాలని, అందంగా కనిపించాలని తహతహ ముఖ్యంగా స్త్రీలలో చాలా కనిపిస్తుంది. ఫ్యామిలీస్ లో కూడా ఫిజికల్ అప్పియరెన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నీకంటే నీ తోటి కోడలు బాగుంటుందని, మీ ఆడపడుచు కంటే నువ్వు బాగుంటావ్ అని ఈ విధంగా ఒక కుటుంబీకుల మధ్యనే ఈ అందాల పోటీ. ఇదంతా ఆర్టిఫిషియల్ కాలం కదా. తులసి చెట్టు కంటే క్రోటన్స్ అందంగా ఉంటాయి కదా.
నిజమే. ఆనందంగా ఉండాలంటే అందమైన వాటిని ఎంచుకోవాలి. ఒక పువ్వైనా, వస్తువైనా, వస్త్రాలైనా, నగ లైనా అందంగా ఉంటే ఆకర్షణే. కానీ ఇది మాత్రం మనుషులకు వర్తించదు. ఎందుకంటే అందమైన వాళ్లకు అందమైన మనసు ఉండకపోవచ్చు. అది తెలుసుకున్నప్పుడు ఆ అందంగా మన చే ఆకర్షింపబడ్డ వ్యక్తి అసహ్యంగా, వెగటుగా కనిపిస్తారు.
ఒక ఎగరడానికి సిద్ధంగా ఉన్న విమానంలోకి ఒక ప్రయాణికురాలు అడుగు పెట్టి తన సీటు కోసం వెతుక్కుంటుంది. ఆ సీటు పక్కనే రెండు చేతులు లేని ఓ వ్యక్తి ఉండటం చూసి ఏదో జరగకూడనిది జరిగిపోయినట్టు అసహ్యంగా, అసహనంగా మొహం పెట్టి తన సీట్లో కూర్చొ కుండా ఎయిర్హోస్టెస్ ని పిలిచి నాకు వేరే ఎక్కడైనా సీట్ ఇప్పించగలరా? అని అడిగింది. ఆ ఎయిర్హోస్టెస్ విమాన మంతా కలియతిరిగి ఎక్కడా లేదని తిరిగి వచ్చి మా విమానంలో ప్రయాణించే వారి సౌకర్యం కోసం చివరిదాకా ప్రయత్నం చేయడం నా బాధ్యత, కెప్టెన్ తో మాట్లాడి చెబుతాను అనుకుంటూ వెళ్లి కాసేపట్లో తిరిగి వచ్చి తన సీట్లో కూర్చొ కుండా అలాగే నిలబడిన ఆ నాగరికమైన ఆడంబరమైన యువతితో విమానం మొత్తంలో ఫస్ట్ క్లాసు లో ఒక సీటు ఖాళీగా ఉంది. ఒక ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికున్ని ఒక ఫస్ట్ క్లాస్ లోకి పంపడం ఇదే మొదటిసారి అని అంటుంటే ఆ యువతి ఇంకా గర్వపడుతూ తనకోసమే నేమో అని అక్కడి నుండి కదలబోతుంటే నీకు కాదన్నట్టు చేతితో సైగ చేస్తూ ఆ వ్యక్తిని ఆ సీటు పై నుండి పైకి నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఆ యువతి ముఖం పాలిపోయింది. అప్పుడా వ్యక్తి “నేనొక మాజీ సైనికుడ్ని. భారత సరిహద్దుల్లో శత్రువులతో జరిగిన యుద్ధంలో నా రెండు చేతులు కోల్పోయాను. అందుకు నేను ఒక దేశభక్తుడిగా ఇప్పటిదాకా గర్వపడ్డాను. కానీ ఇలాంటి వారి కోసమా మా జీవితాలను పణంగా పెట్టి పోరాడింది అని ఇప్పుడు అనిపిస్తుంది.” అని ప్రయాణికులందరినీ ఉద్దేశించి చెప్పుతూ ఆ యువతి నుద్దేశించి “అమ్మా. బయటికి వచ్చేటప్పుడు నీ ముఖానికి రంగు పులుముకుని అందంగా కనిపించాలని పాకులాడే నీవు నీ హృదయానికి కూడా కాస్త మానవత్వాన్ని పులుముకొమ్మ”ని చెప్పి అక్కడి నుండి తన సీటు కేసి నడిచాడు. ఆ యువతి ముఖం అతి వికారంగా వెలవెలపోయింది.
అందాన్ని గురించి చెప్పాలంటే ఒకానొక అందాల పోటీలో ఒక యువతి గెలుపొంది కిరీటాన్ని పొందింది. ఒకసారి ఆ యువతి పోతున్న మార్గమధ్యంలో ఒక అంధుల పాఠశాల కనిపించింది. ఆమెకెందుకో ఆ పాఠశాలలో కి వెళ్ళాలనిపించింది. ఈ అంధులు అందాలను చూడలేని అభాగ్యుల కదా. అని ఆమె వారిపట్ల జాలితో ఆలోచించింది. తమ పాఠశాలలో కి వచ్చిన ఆ అతిథిని పిల్లలంతా ఆనందంగా వారి వద్ద ఉన్న పళ్ళు స్వీట్లు ఆప్యాయంగా ఇచ్చారు. కళ్ళు లేని వీరు, అందాలేవీ చూడలేని వీరు ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారని ఆమె ఆశ్చర్యంగా తనలో తాను ప్రశ్నించుకుంటూ ఎంతో సమయం అక్కడే గడిపి బాక్స్ తెరిచి అన్నం తినబోతున్న ఒక పదేళ్ల పాప దగ్గర కూర్చొని “మీరు లోకం లోని అందాలను చూడలేరు కదా. “అని ఇంకా ఏదో అడగబోతున్న సమయంలో ఆ అమ్మాయి తన చేతిలోని ముద్ద ఆమె నోట్లో పెట్టింది. ఆ యువతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందమంటే ఏమిటో అర్థమైంది. వెంటనే తన తలపై ఉన్న కిరీటాన్ని తీసి ఆ పాప తలపై అమర్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అందం ఎక్కడుందంటే ప్రపంచాన్ని అందంగా మార్చే వాళ్ళ వద్ద. అలాంటి వాళ్ళ ప్రజెన్స్ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడా ఒక చెడు మాట గాని, తమని తాము పొగుడుకోవడం, ఇతరులను విమర్శించడంగానీ లేక ఎన్నో విషయాలు వినే కొద్దీ వినాలన్పించే విధంగా అందంగా చెబుతూ, చుట్టూ వాతావరణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తుంటారు. మోటివేట్ చేస్తుంటారు. వాళ్లు అందంగా ఉండాల్సిన అవసరం లేదు. ఏజ్ తో పనిలేదు. అందుకే ఆనందంగా ఉండాలంటే అందమైన వాళ్లను ఎంచుకోవద్దు. ప్రపంచాన్ని అందంగా మార్చే వాళ్ళని ఎంచుకోవాలి. అప్పుడే అందం లో ఆనందం.