అర్థం కాదు ఎంత ఆలోచించినా….
ఆ చేతుల్లో మాధుర్యం ఎక్కడిదా అని?
అక్కడే …..
కథలన్నీ కంచికెళతాయి..
మబ్బు తెరలను దాటి చందమామ సైతం
ముంగిట్లో వాలుతుంది గారాలు పోతూ…
పద్యాలెన్నో పదాలుగా తడబడుతూ
పెదవుల అంచుల నుండి జారుతుంటాయి…
మనిషిలా బతికి, ఎదిగే క్రమం-
నీతులుగా వల్లెలు వేయబడతాయి….
అక్షరాలు పాటలుగా పల్లవిస్తాయి..
ప్రశ్నల రూపమై ప్రపంచ జ్ఞానం
మనసును చేరుతుంది..
అవి గోరుముద్దలు కావు..
అనుభవ సారాన్ని ప్రేమగా రంగరించి,
త్యాగాలను తావిగా పులిమి…
పదిల పరచుకున్న అనుభూతుల రుచులతో..
అలౌకిక పేగుబంధాన్ని పెంచుకున్న జ్ఞాపకాలు..
అక్కడే…
మరోతరానికి వారసత్వంగా,
మానవత్వానికి ప్రతీకగా,
భవిష్యత్ నిర్మాణం జరుగుతుంది
ఆశల వలయంలో,
నమ్మకపు పునాదులపై..!!