పాఠక మహాశయులకు నమస్కారములు. డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తున్నాను. అసలు విషయం ఏమిటంటే చదువుకున్నవారు చాలా సంస్కారవంతులని నా అభిప్రాయం. ఎవ్వరిని గురించి కాదుగాని జనరల్ వ్రాస్తున్నాను. అందరూ ఇలా అని కూడా కాదు. కొంతమంది కొంత వెరైటీగా ఉంటారు. ఎక్కడా ఎవ్వరూ దొరకలేదు అని, వెతుక్కుంటూ, వెతుక్కుంటూ మన దగ్గరికే వచ్చి మనల్ని తగులుకుంటారు చాలా చిత్రంగా.
ఈ మధ్య ఒక Get together function కి మా కుటుంబముతో తెలిసివారి ఇంటికి వెళ్లాను. అక్కడ ఫంక్షన్ కి చాలామంది వచ్చారు, అనేక రకముల వయస్సులవాళ్లు. ఒక పక్కగా కూర్చొని నేను అందర్నీ గమనిస్తూ, మధ్య మధ్యలో ఇతరులతో మాట్లాడుతున్నాను. ఇంతలో ఒక 70 సంవత్సరాల వయస్సావిడ నా పక్కన కుర్చిలాక్కుంటూ వచ్చి కూర్చొన్నది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అని మాటలు కలిపింది. సారి అండి నాకు గుర్తురావటం లేదు అన్నాను. ఆవిడ నా మాటలు అంత వినిపించుకున్నట్లు లేదు. నేనెంతో పరిచయం అన్నట్లు గల గలా M.A. పాస్ అయ్యానండి.. 50 సం|| క్రిందట. అప్పుడూ ఉన్న Standard ఇప్పుడేది. ఏవో కలగా పులంగా వచ్చిరాని Butter English మాట్లాడుతున్నారు. బోలెడు తప్పులతో Grammatical Mistakes మాట్లాడుతున్నారు అన్నది. ఇక్కడ మా అబ్బాయి కోడలు, మనమరాలుతో ఉంటున్నాను అమెరికాలో అన్నది. అస్సలు నేను లేనిదే ఏ పని జరగదండి. వాళ్లు ముగ్గురు పొద్దున్నె వెళ్లిపోతారు. అంతా నేనే చూసుకుంటాను అన్నది. పర్వతాలు తాను ఒక్కత్తె ఎత్తేస్తాను అన్న టైప్ లో బిల్డప్ ఇచ్చింది. షాపింగ్ దగ్గర నుంచి, పేమెంట్స్ నుంచి అంతా నేను చేసుకోవాలి, చూసుకోవాలి అన్నది. నాకు అనిపించింది, చదువున్నావిడ అంటోంది, మరి ఇదేమిటి అని అసలు కాలం ఎవరు ఉన్నా లేకపోయినా ఏది ఆగదు. జరిగేది జరుగుతూనే ఉంటుంది. “కారే రాజుల్ రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే వారేరీ సిరిమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ అన్న పద్యం గుర్తుకు వచ్చింది. మహా మహా వాళ్లు రాజుల్, చక్రవర్తుల్, ministers మహాత్మాగాంధి , ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధి, లాంటివారే కాలంతోపాటు వెళ్లిపోయారు. భగవంతుని కోసం భరతుడు తల్లిని వదిలేస్తే, ప్రహ్లాదుడు తండ్రిని వదిలేస్తే, విభీషణుడు అదే భగవంతుడి కోసం అన్నను వదిలేశాడు. కాలచక్రం ముందర సామాన్యులము మనమెంత అనిపించింది. ఆవిడ ధోరణి ఏమీ ఆపట్లేదు, తగ్గటము లేదు.
ఇంతలో ఇంకక ఆవిడ వచ్చి కూర్చుంది మా దగ్గర. పరిచయాలు అయింతర్వాత ఆవిడ కూడా తాను Home Science College లో చదివి పిజి కూడా చేసిందట. ఈవిడ ధోరణి ఇంకొక రకముగా ఉన్నది. “మా వారి వైపు వాళ్లంటే నాకు చాలా భయం“ అండి అని మొదలుపెట్టి, మా అక్కలు అందరూ చాలా సౌమ్యులు అంటోంది, మరి భర్తవైపు వాళ్లు రాక్షసులన్నమాట. అసలు మనం ఎక్కడికి వచ్చాము, ఎందుకోసం వచ్చాము అన్న స్పృహ లేకుండా ఇలా నల్గురిలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడవచ్చా అన్న సంస్కారం లేకపోగా చదువుకున్నాము అనే ఒక విధమైన అహంకారము వీళ్లకి అనిపించింది. మనం వెళ్లిన చోట మనని గురించి పిలిచిన Hostలు వీళ్ళు చాలా “Nice” Persons అని వాళ్ల చేత అనిపించుకోవాలి కాని వీళ్లు ఉత్త “నస” మనుషులు అని అనిపించుకోకూడదు అని నాకు అనిపిస్తుంది. ఎంత చదివినా సంస్కారం కూడా నేర్చుకోగలగాలి. నలుగురిలో విలువలు పెంచుకోవడమో, ఉంచుకోవడమో, తుంచుకోవటమో మన చేతుల్లోనే ఉంది. మొండివాళ్లకు, అహంకారులకు చెప్పలేముగాని, పెద్దతనంలో మన పరువురు కాపాడుకోవటం పూర్తిగా మన చేతుల్లో ఉంది. అనవసరంగా జోక్యం చేసుకోకుండా మితభాషిగా ఉంటే బావుంటుంది. కాలం ఎంతో మారింది. ఇప్పటి New generation కి మనకన్నా టెక్నాలజీ బాగా తెలుసు అని ఒప్పుకోవాలి. అనవసరంగా కూతురింట అల్లుణ్ణి, కొడుకింట కోడలును కించపరచకూడదు. మనం మన పిల్లలతో ఎక్కికైనా వెళ్లినా, లేదా మన ఇంటికి (పిల్లల) వాళ్ల స్నేహితులు వచ్చినావాళ్లు, మన కోసం రాలేదు, పిల్లలు friends అన్న స్పృహతో మర్యాదకి బావున్నారా అని వాళ్లను పలకరించి పక్కకి తప్పుకునే కర్టసీ మనకుండాలి. వాళ్లు కూడా పెద్దవాళ్లమని మర్యాదకు మన ఆరోగ్యం బావుందా అంటే బావుంది అమ్మా అనాలి కాని, మనకున్న బిపి, షుగర్, మోకాళ్ల నెప్పులు, వళ్ల నెప్పులు అన్ని ఎక్కువ మాట్లాడి ఏకరువు పెట్టకూడదు. బాబోయ్ ఎందుకు అడిగాం అనీ గాభరాపడే ప్రమాదం ఉంది.
చివరి మాటగా మా తండ్రిగారు 87 సంవత్సరాలకు కాలం చేశారు. అంత వయస్సులో కూడా ఆయనకు “చాదస్తంగా” అస్సలు మాట్లాడి ఎరుగరు. ఆయన నుంచి నేను నేర్చుకని, ఆచరిస్తున్న గొప్పతనం ఆయన నుండి పొందాను, చూచి నేర్చుకున్నాను. ఇది ఎంతో నాకు ప్రయోజనంగా ఉంది. చదువుకున్నా, సంస్కారం లేని వాళ్లు ఉన్నారు. చదువుకోకపోయినా గొప్ప సంస్కారవంతులు ఉన్నారు. మనం ఎదుటివాళ్ల జీవితంలోకి తొంగి చూడటం, వారి జీవితాలు కెలకటం వంటివి చేయకుండా మన జీవితం మనం జీవిద్దాం. ఏమంటారు?