తరుణీయం

మీ ఇష్టం……..

వేముగంటి శుక్తిమతి

మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది. నిజం చెప్పాలంటే మన సమాజం అంతా వివాహ వ్యవస్థ మీదే డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నైతిక విలువలతో, సంస్కారంతో ఉండి ఆ ఫ్యామిలీలో పేరెంట్స్ పిల్లలకి వారికున్న విలువలను ఆపాదించి సభ్యతగా పెంచినట్లయితే అది ఆ తల్లిదండ్రులు సమాజానికి అందించిన గిఫ్ట్.
ఎవరి నోట విన్నా, ఏ పత్రిక చదివినా, ఏ ఉపన్యాసం విన్నా సమాజం చెడిపోతుందని, రోజురోజుకూ విలువలు నశిస్తున్నాయని వింటూనే ఉంటాం. కానీ మౌలిక కారణాలు మాత్రం వెతికే ప్రయత్నం చేయడంలో విఫలమై పోతున్నాం.
ముఖ్యంగా మన దేశానికి, మన సమాజానికి, మన వ్యవస్థకు ప్రపంచ దేశాలలో పవిత్రమైన గుర్తింపు ఉందంటే దానికి ముఖ్య కారణం వివాహ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ. కానీ రాను రాను ఈ రెండు వ్యవస్థలు బలహీన పడిపోతున్నాయి.
సాధారణంగా మన కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టింది మొదలు అడుగడుగునా పెళ్లి తో ముడి పెడతారు. ఉదాహరణకి కూతురు తల్లి చెప్పిన పని చేయకపోయినా, మాట వినకపోయినా ‘రేపు నీ అత్త వారి ఇంటికి వెళితే నీకేం నేర్ప లేదని నన్ను ఆడిపోసుకుంటారు.’ అంటుంది. ఈ రోజుల్లో అయితే పనితో పాటు చదువుకోకపోయినా ‘నిన్ను ఎవరు చేసుకుంటారనో అంటుంటారు.’ మధ్య తరగతి కుటుంబాలలో పిల్ల పుట్టింది మొదలు పెళ్లి కోసమే డబ్బులు ,బంగారం జమ చేయాలని ఆరాటపడుతుంటారు.
ఇక మగపిల్లవాడు అయితే ఇల్లు, ఆస్తి, ఉద్యోగం లేకపోతే పిల్లనెవరిస్తారని అంటూ నే ఉంటారు. అంటే తరతరాలుగా మన మనసుల్లో ఈ వివాహ వ్యవస్థ ప్రాధాన్యం జీర్ణించుకుపోయిందన్న మాట.
మరి అలాంటప్పుడు ఈ మధ్యకాలంలో దీని విలువ లు ఎందుకు బలహీన పడిపోయినాయి? కారణాలేమై ఉంటాయి?
నాకు తెలిసిన ఒక అమ్మాయి వివాహం జరిగి ఆరేళ్ల యింది. మరి ఈ ఆరేళ్లలో వారి వివాహబంధం ఎలా ఉందో మాత్రం తెలియదు. కానీ ఈమధ్య తెలిసిన విషయం ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించేశారని. ఈలోగా ఒక పాపక్కూడా తల్లి అయ్యింది. కారణాలు తెలుసుకుంటే పెళ్లప్పుడు నాజూగ్గా ఉన్నావని, మంచి కలర్ లో ఉన్నావని ఇప్పుడు మోటై పోయావని ఆ అమ్మాయి భర్త చెప్పే కారణం. అందుకనే నువ్వంటే నాకిష్టం లేదు. మీ ఇంటికి వెళ్ళిపో అంటూ రెండు మూడు సంవత్సరాలు పోరు పెట్టినా ఇంట్లో తల్లిదండ్రులకో, బంధువులకో,సమాజానికో భయపడి అడ్జస్ట్ అవుతూ కాలం గడిపిందట. కానీ రాను రాను భర్త హెరాస్మెంట్ ఎక్కువైపోయి లాభంలేదని బిడ్డని దక్కించుకుంటే చాలని ఆ నరకం నుండి బయట పడింది. ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు ఒకటో, రెండో, పదో కాక చాలా జరగటం చూస్తూనే ఉన్నాం.
కానీ ఇక్కడ నాకు అనిపించిందిేమిటంటే ఇలాంటప్పుడు ఆ కొడుకు మీద తల్లి లేదా తండ్రి మిగిలిన కుటుంబ సభ్యుల బాధ్యత ఏం లేదా?. కొడుకు నడక నేర్చినప్పటినుండి పెళ్లి గురించి ఆలోచించి, పెళ్లి కోసమే చదివించి, పెళ్లి కోసమే సెటిల్ చేసి, ఇంకా పెళ్లి కుదరలేదని బాధపడి,మంచి ఫ్యామిలీ అమ్మాయి కావాలని వెతుక్కొని, అంగరంగ వైభోగంగా పెళ్లి చేసి ఇంతాచేసి ఆ పెళ్లి తర్వాత వాళ్లు సౌఖ్యంగా అన్యోన్యంగా ఉండాలని నిజంగా కోరుకుంటున్నారా? అందరూ కాకపోవచ్చు. కానీ ఎక్కువ సంఖ్యలో రోజురోజుకూ ఈ తంతు పెరగటం అబద్ధం కాదు. చిత్రమేంటంటే తప్పు వాళ్లదై య్యుండి ఆ అమ్మాయి మీద పచ్చి అబద్ధాల ప్రచారం. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద దుష్ప్రచారం. ఇది ఎంత పాపం .ఎంత ఘోరం. ఈ ప్రచారం చేసే వాళ్ళు, వినే వాళ్ళు, విన్నాక తమ వంతు నాలుగు ఐదు మాటలు జోడించి తిరిగి ప్రచారం చేసేది నిక్కచ్చిగా ఆడవాళ్లే. వాళ్లు చేసే ప్రచారాన్ని ఆపాలనే ఆలోచన లేకపోగా అదొక ఇష్యూ గా నలుగురు కలిసిన ప్రతి చోట గుసగుసలాడటం ఎంత అమానుషం. ఇదంతా ఇంతదూరం వెళ్ళటానికి కారణం ఆ అబ్బాయి తల్లి. మరి నీవు కూడా పెళ్లి నాడు ఉన్నట్టున్నావా? మార్పు నీలో లేదా అని కొడుకును నిలదీయొచ్చు కదా . నీకు కొడుకు ఎంత ముఖ్యమో తల్లిదండ్రినీ, వంశాన్నీ, ఊరువాడ లను వదిలేసి మీ ఇంటికి కోడలు గా వచ్చిన ఆ అమ్మాయి మాత్రం ముఖ్యం కాదా.??.. నా కోడలు నాకు కావాలి. నువ్వే వెళ్ళిపోవాలి. అని ఆ తల్లి నిజంగా అంటే ఆ కొడుకు ప్రవర్తన మారిపోదా. దానికి బదులు కొడుకు ను సపోర్టు చేస్తూ ఆ పరాయి ఆడపిల్లను నిందించే ఆడవాళ్ళు నిజంగా రాక్షసులే. వాళ్ల నోటికి మాటకు విలువ లేనట్టే.
మరో కుటుంబంలో కొడుకు పచ్చి తాగుబోతు. భార్య పిల్లల్ని వేపుకుతింటూ చితకబాదుతూ నరకంచూపిస్తుంటే కోడలు వల్లే తాగుతున్నాడనడం,సూటి పోటి మాటలతో ఇబ్బంది పెట్టడం, కుటుంబ సభ్యులంతా ఆమెను ఒక దోషిగా చూడటం ఎంతవరకు సమంజసం.
కొంతమంది ఆడపిల్లలు ఇదే విధమైన సంస్కార విహీనమైన పెంపకం తో అత్తింట్లో కి అడుగిడి సంసారాన్ని, కుటుంబంలోని బాంధవ్యాలను అతలాకుతలం చేస్తున్నారు. ఇలాంటప్పుడుకూడా పిల్లలకు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ముఖ్యంగా తల్లిపై ఉంటుంది. ‘మా మాట వినరు. మేమేం చేస్తా’మని సమర్దించుకుంటారు. కాని తల్లి మాట వినని వారు ఎవరు ఉండరు. మాట వినటం అనేది కూడా చిన్నప్పటి నుండే నేర్పాలి. పెద్దవాళ్ల తప్పులను పిల్లలపై వెయ్యకుండా వాళ్ల మనస్తత్వాలను బట్టి, వారి అవగాహనను బట్టి వాళ్లకి మంచి చెప్తూనే ఉండాలి. ఇది చాలా పెద్ద బాధ్యత. ఇది తర తరాలకందించే మానవ విలువల సంపద. ఈ సంపదను ఎక్కడా ఆగిపోనీకుండా కొనసాగిస్తూ మన సనాతన కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ గౌరవప్రదంగా నిలబెట్టుకోవాలి. ఎంత ఎక్కువ మొత్తం సంపాదించినా ఈ సంపదకు సరికాదు. మనం చేసే పొరపాట్లను కాలం మారిందనో, జనరేషన్ మారిందనో, ఆధునికకాలమనో సమర్దించుకుంటే ఈ మార్పు మనకు ఇష్టం అనే అర్థం. కాలంలో మార్పు లేదు రోజుకు 24 గంటలే ,అప్పుడు ఇప్పుడూ. సంవత్సరానికి 365 రోజులే ఎప్పుడైనా. సూర్యచంద్రుల రాకపోకలు యధావిధే. ప్రకృతి సహజసిద్ధంగానే ఉంది. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూనే మూలాలను మర్చిపోయేది, డబ్బు వ్యామోహంలో పడి సంస్కృతీ సాంప్రదాయాలను కనుమరుగు చేసుకునేది మనమే. ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాము. పిల్లల్లో స్వార్థాన్ని పెంచుతున్నాను. సంస్కారాన్ని అందించాల్సిన చదువులు అది మర్చి డబ్బు సంపాదన వెంట పరుగులెత్తిస్తున్నాము. ఆడపిల్లకు పెళ్లి చేయగానే అత్తింట్లో సర్దుకొని ఉండమని చెప్పే బదులు అతి చిన్న కారణాలకు సర్దుకొని వచ్చేయమని చెప్తున్నారు. పెళ్లి అంటే రెండు కుటుంబాల బాంధవ్యం, సంబంధం అనే విషయాన్ని పూర్తిగా నిష్క్రమింపజేస్తూ స్త్రీ యే స్త్రీ కి శత్రువన్నట్లు చాలామంది సాటి స్త్రీమాతృత్వాన్ని, మాతృప్రేమను తమ కూతురు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే తుం చేయడానికి కారణమవుతున్నారు. ఈ దిగజారటానికి కారణం డబ్బు. దానితో ఎంజాయ్ మెంట్ వేట. మన చేతిలో ఉండాల్సిన డబ్బు చేతుల్లోకి మనం వెళ్లి పోతున్నాము. అది మనలోని సింపతీని, సెంటిమెంట్స్ ని, మానవత్వాన్ని, మమతలను అన్నింటినీ ధ్వంసం చేసేస్తుంది. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే ముందు ముందు చెప్పేవారు ఉండరు. వినేవారు ఉండరు. అందుకే మన ధర్మాలను. మర్యాదలను, సాంప్రదాయాలను ముందు తరాలకు అందేలా ప్రయత్నిస్తూ మన పిల్లలకు కూడా ఆ బాధ్యతను అప్పగించటం మన కర్తవ్యం. ఆలోచించండి…. అనవసరం అనుకుంటే వదిలేయండి… మీ ఇష్టం…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అభిప్రాయ వీచిక

తల్లి సాత్వికురాలైనా పిల్లలు ఆవేశపరులౌతున్నారు ఎందుకు…?