మనసా నీవే లేకుంటే నేనేమయ్యేదాన్నో!
ఔను! నీవులేకుంటే నేనసలేమయ్యేదాన్నో!
శైశవదశలో అసలేం తెలియదుగానీ
బాలారిష్టాల్ని దాటాక గానీ నీ ఉనికి తెలిసి రాలేదు
ప్రాయపు మదిజోరు అంబరాన్ని తాకాలని ఉవ్విళ్ళూరగా
తగదు సుమారు! అంటూ సున్నితంగా నీవు
మందలించడం నాకింకా గుర్తే!
జీవన వైకుంఠపాళీలో ఒక్క నిచ్చెననెక్కినంతనే
పొంగిపోయిన నా ముఖపోకడల్ని చూసి
వలదు పక్కనే పాము పాతాళంలోకి లాగుతుందని
సుతిమెత్తగా నీవు హెచ్చరించడం నాకింకా గుర్తే!
బతుకు సమరంలో పల్టీలు కొట్టడం మొదలెట్టి
బెంబేలెత్తి దిగాలుపడ్డ నన్నుచూసి
వెరపు భీరువు లక్షణమంటూ
ఆప్యాయంగా వెన్నుతట్టడం నాకింకా గుర్తే!
షరామామూలైన ఓటములతో నిస్తేజమైన నన్ను
అనునయంగా సాంత్వన పరుస్తూ
అపజయంలోనే విజయరహస్యం దాగుంటుందని
స్థిరచిత్తంతో నీవు ప్రేరేపించడం నాకింకా గుర్తే!
ఇన్ని నేర్పిన ఓ మనసా మరి నిజంగా
నీవే లేకుంటే నేనసలేమయ్యేదాన్నో!