మానసిక సంసిద్ధత కొరవడితే …

మాధవపెద్ది ఉష

మనిషి ఏ పని చేపట్టినా అందుకు ముందుగానే మానసికంగా సంసిద్దులు కావడం ఎంతైనా అవసరం. దీనినే ఇంగ్లీషులో మెంటల్ ప్రిపరేషన్ అంటాం. ఈ మెంటల్ ప్రిపరేషన్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దలదాకా అందరికి అవసరమే.

ముందుగా చిన్న పిల్లల్ల విషయమే తీసుకుందాం. ఉదాహరణకు || కుటుంబంలో తల్లి రెండవసారి గర్భం ధరిస్తే తమ మొదటి సంతానానికి ఈ విషయాన్ని డెలివరీ కాకముందే ఎంతో సున్నితంగా తన కడుపులో ఒక పాపాయి పెరుగుతున్నదనీ త్వరలోనే నీకు చెల్లెల్లో, తమ్ముడో పుట్టబోతున్నారనీ ఆ పాపాయితో నీవు ఎంచక్కా ఆడుకోవచ్చనీ చెప్పి ముందుగానే వారిని మెంటల్ గా ప్రిపేరు చేయాలి. అలా చేసినందువల్ల చిన్న పాపాయి పుట్టగానే ఆ పెద్దపిల్లగానీ పిల్లవాడు గానీ అమ్మానాన్నల అటెన్షన్ తమ మీద నుంచి ఆ కొత్తగా పుట్టిన పాపాయి మీదకి మళ్లిందని ఈర్ష్యాసూయలకు లోను కాకుండా ఉంటారు.

అలాగే పిల్లలను బడిలో చేర్పించేటప్పుడూ కూడా వారిని కొద్దిరోజుల ముందు నుంచే మానసికంగా ప్రిపేరు చేయాలి. అంతేకాదు బడికివెళ్లడం వల్ల | కలిగే లాభాలను వారికి వివరించి చెప్పాలి. బడికి వెళ్తే ఎంచక్కా తమ తోటి పిల్లలు ఎంతోమందిని కలవవచ్చనీ, వారితో ఆడుకోవచ్చనీ అన్నిటికన్నా ముఖ్యంగా చదువుకోవచ్చనీ బాగా చదువుకుంటే పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించవచ్చనీ వారికి చెప్పి బడికి వెళ్లేందుకు వారిని సుముఖం చేయాలి.

ఇలా పిల్లలను డాక్టరు దగ్గరకు తీసుకువెళ్లేటప్పుడు కూడా ఈ మెంటల్ రేషన్ తో ఉపయోగపడుతుంది. ఊహ తెలిసిన పిల్లలకు సుస్తీ చేసినపుడు డాక్టరు దగ్గరకు వెళ్తున్నామనీ ఆయన చూసి జ్వరం తగ్గడానికి మందులు గానీ ఇస్తారనీ కొద్దిగా నొప్పి పుట్టినా కళ్లు మూసుకుని ఓర్చు కోవాలని నెమ్మదిగా చెప్పి వారిని అందుకు సంసిద్దం చేయలి. అలా చేయకపోతే తీరా డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఒక వేళ ఇంజక్షన్నుగానీ ఇవ్వవలసి వస్తే పిల్లలు బెదిరిపోయి ప్రతిఘటించే అవకాశం ఉంది.

ఇక ఆడపిల్లలు రజస్వల అవబోయే ముందు ఆ విషయం గురించి వారికి వివరంగా చెప్పి వారిని మానసికంగా ప్రిపేరు చేయడం తల్లి బాధ్యత. లేకపోతే కొంతమంది ఆడపిల్లలు ఆ సమయంలో భయపడి షాక్కు గురి అయ్యే ప్రమాదం ఉంది. పరీక్షలు రాసిన కొంతమంది విద్యార్థులు తాము ఫెయిల్ అవుతామేమో నని లేక ఎమ్సేట్ ఐఐటి లాంటి ఎంట్రెన్స్ పరీక్షల్లో మంచి ర్యాంక్ రాదేమోనని భయంతో పరీక్షా ఫలితాలు రాకముందు నుంచే బిక్కుబిక్కు మంటూ రోజుల గడుపుతూ ఉంటారు. ఇటువంటి సందర్భాలోనే పిల్లలకు తల్లిదండ్రుల మోరల్ సపోర్ట్ ఎంతైనా అవసరం. ఫెయిల్ అయినా ర్యాంకు రాకపోయినా ఫర్వాలేదు. మళ్లీ వచ్చే సంవత్సరం మరింత కృషి చేసి పాస్ అవచ్చు. లేక ర్యాంక్ తెచ్చుకోవచ్చనీ ధైర్యం చెప్పి వారిని ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేయాలి. అలా చేయనిపక్షంలో పిల్లలు రిజల్టు వచ్చాక పాస్ కాకపోయినా అనుకున్న ర్యాంకు రాకపోయినా తీవ్ర మనస్తాపానికి గురై ఏ అఘాయిత్యానికైనా పాల్పడే అవకాశం ఉంది.

7నుంచీ 14 ఏళ్ల వయస్సులో పిల్లలు తల్లితండ్రులతో వెంట లేకుండా వైజ్ఞానిక యాత్రలకు, పిక్ నిక్ కూ మరియు విహార యాత్రలకు వెళ్తున్నప్పుడు మరీ ప్రత్యేకించి మగ పిల్లలకు ఆయా ప్రాంతాలలో ఎదురయ్యే ఇబ్బందులు గురించి వివరంగా చెప్పి వారిని మెంటల్గా ప్రిపేర్ చేసి పంపాలి. లేకుంటే ఉదాహరణకు చెరువుల్లోనూ, నీటి గుంటలలోనూ, నదులలోనూ దిగడం లేక ఈ కొట్టడం లాంటి వాటికి ప్రయత్నించి ప్రాణాపాయం కొనితెచ్చుకునే ప్రమాదం ఉంది.

ఇహ ఊహ తెలిసిన పిల్లలు జనసమూహం ఎక్కువగా ఉన్న శాలలో దురదృష్టవశాత్తు తప్పిపోవడం సంభవిస్తే భయపడి ఏడ్వ కూడదనీ సహాయక సిబ్బంది శిబిరాలకు వెళ్లిగానీ లేక వాటికి సంబంధించిన ఆఫీసులకి గానీ వెళ్లి తాము తప్పిపోయినట్లు రిపోర్టు చేయాలని ముందుగానే వారిని మెంటల్ ప్రిపేరు చేయాలి. అంతేకాదు పిల్లల జేబుల్లో వారి ఇంటి ఎడ్రసు మరియు అమ్మానాన్న ల పేర్లు రాసిన చీటి పెట్టి ఆ సంబంధించిత అధికారులకు ఆ చీటినీ చూపించమనీ చెప్పాలి.

నిత్యజీవితంలో చిన్న చిన్న విషయాలలో కూడా ఈ మానసిక సంసిద్ధతకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకి ఇంట్లోకి కొత్త వస్తువులు కొనబోతున్న విషయం భార్యకి కూడా చెప్పాలి అన్న ఆలోచన చాలామంది భర్తలకు ఉండదు. అలా సడెన్గా ఎదురు చూడని తీరులో భర్త కనుక కొత్తవస్తువులు కొని తెస్తే భార్య అప్సెట్ అయి అయ్యో ముందే నన్ను ఎందుకు అడగలేదండీ? ఈ వస్తువు మనకిప్పుడు అవసరం ఏం ఉందని దెబ్బలాటకు దిగే ప్రమాదం ఉంది.

మరికొంతమంది భర్తలు భార్యను ఆశ్చర్యపరుద్దామని ఉద్దేశ్యంతో భార్యకు తెలియకుండా ఏ చీరో లేక నగో కొని తీసుకువస్తుంటారు. తీరా తెచ్చాక ఆ చీరగానీ నగగానీ భార్యకు నచ్చకపోతే భర్త ఉత్సాహం, ప్రయాస! అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే భర్తలు భార్యలకు ఇలా తీసుకుందా మనుకుంటున్నాను అని ముందుగానే మెంటల్గా ప్రిపేరుచేసి వారి అభిరుచి మేరకు ఏ వస్తువైనా తీసుకువస్తే మంచిది.

అలాగే ఇంట్లో గృహిణి తనకు ఒంట్లో బాగులేని రోజు ఇంటి సభ్యులకు ముఖ్యంగా భర్తకి ఆ విషయం చెప్పి ఆ కారణంతో ఈరోజు కూర గానీ మరే ఐటమ్ గానీ వండటం లేదనీ వారు ఉత్త పప్పు చారుతోనే సర్దుకుపోవాలనీ ముందే చెప్పాలి. అప్పుడే తీరా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా భోజనం వడ్డించాక “అన్నంలోకి ఇదేనా!” అని వారు అసంతృప్తికి గురి కాకుండా ఉంటారు.

అమెరికా లాంటి దేశాలలో అయితే ఈ మానసిక సంసిద్ధతకి ప్రాదాన్యత ఉంది. అందుకే అక్కడివారూ అపాయింట్మెంట్ లేకుండా అంటూ సడెనుగా చెప్పాపెట్టకుండా ఎవరింటికైనా వెళ్లడంగానీ చేయరు. అక్కడ ముఖ్యంగా ఫోను ద్వారా తెలియపరచకుండా ఎవరైనా కోపగించుకుంటారు.

అమెరికాలో ముఖ్యంగా వైద్య రంగంలో ఈ అంశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అక్కడి డాక్టర్లు పేషెంటు దగ్గర వారికి ఉన్న జబ్బు గురించిన ఏ విషయాన్ని వారి వద్ద దాచరు. వారికి చేయబోయే వైద్యం గురించి గానీ లేక ఆపరేషన్ గురించి గానీ ముందుగానే పేషెంట్ను ప్రిపేరు చేయడం అవసరం అని వారు భావిస్తారు. దీని ఉపయోగం ఏమిటంటే పేషెంట్ ముందుగానే తెలుసుకుని మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకునేందుకు వీలుంటుంది. ఇక్కడ ఇండియాలో లాగా పేషెంట్ చావుకి దరి దాపుల్లో ఉన్నా.. ” నువ్వు బ్రతుకుతావు!” అంటూ భ్రమలో ఉంచరు.

ఇప్పుడు మనదేశంలో కూడా కొన్ని కార్పోరేటు ఆసుపత్రుల్లో ఈ పద్ధతినే అవలంబిస్తున్నారు. పేషెంట్కి తన హెల్త్ కండీషను గురించి, అది ఎంత సీరియస్ అయినా గానీ తెలుసుకునే హక్కు ఉందని ఇప్పుడిప్పుడే మనదేశంలో కూడా గుర్తిస్తున్నారు. అంతేకాదు, చావుకి దరిదాపుల్లో ఉన్న పేషెంట్కు ముందే తెలిస్తే తమ శేష జీవితాన్ని వారు తమ ఇష్టానుసారంగా గడపడానికి వీలుంటుంది. అంతేకాకుండా వారు చావుని ధైర్యంగా ఎదుర్కోగలుగు తారు కూడా.

ఇలా చెప్పుకుంటూ పోతే మానసిక సంసిద్ధత వల్ల కలిగే లాభాలు ఎన్నో ఎన్నెన్నో! అందుకే ప్రతి ఒక్కరూ దీని ప్రాధాన్యతను గుర్తించి మానసిక సంసిద్ధతను అలవర్చుకోవాలని గ్రహించాలి.

Written by Madhavapeddi Usha

One Comment

Leave a Reply
  1. అన్ని విషయాల్లోనూ హెచ్చరిస్తూ, ముందుగా ఎలా సంసిద్ధం చేయాలో చాలా బాగా వివరించారు. మీరు రాసిన విషయాలు ఆచరించదగ్గవి. అభినందనలు ఉషా గారూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జీవిత చమత్కారం

కూర విశాల పాడిన పాట