మన మహిళామణులు

తండ్రికి తగిన తనయ! పాజిటివ్ దృక్పథం తో సాగే శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి గారు!

బెంగుళూరులో లో నివాసం.నిరాడంబరం ఆప్యాయత ఆమె నైజం..
డా .రాజేశ్వరీ దివాకర్ల బెంగళూరు విశ్వ విద్యాలయం తెలుగు విభాగంలో “ఆంధ్రమున ప్రబంధ రూపము నొందిన సంస్కృత నాటకములు “అన్న అంశంపై Ph.D పదవిని పొందారు. అటుపై  కర్నాటక ప్రభుత్వం కాలేజు శిక్షణా విభాగం,కళా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా అధ్యక్షులుగా సేవలనందించారు.
కవిత్వము,పరిశోధన. విమర్శ వ్యాస రచన అనువాదరంగాలలో కృషిని కావించిన వీరు పలు జాతీయ అంతర్జాతీయ కవిత్వ సమావేశాలలో చర్చా గోష్టులలో పాల్గొన్నారు. బెంగళూరు ఆకాశవాణి కేంద్రంలో ప్రసంగాలు,కావించారు. వీరు రాసిన చిన్న కథలు కథలు అంతర్జాల వేదికలలో ప్రసారం అయ్యాయి ప్రవృత్తి సాహిత్యం లో నిరంతర కార్య మగ్నులైన వీరు విశ్రాంతి జీవితాన్ని సృజనాత్మక రచనలతో సార్ధకం చెసుకుంటున్నారు.


రాజేశ్వరి గారి కవిత్వం కుటుంబము బాంధవ్యాల నేపథ్యం తో అల్లుకుంటుంది. కవిత్వాన్ని రాసే సందర్భం లో విశేషణాలను జోడించక తమను తాము నిలదీసుకుంటారు.
వీరు రాసిన భూమి తడిపిన ఆకాశం కవిత్వ సంపుటి లో “గోడ “అన్న కవితలో “కాలానికి భాషలన్నీ తెలుసు/అందరినీ ఆహ్వానిస్తుంది/ విమానం లోని గగన సఖి లా /అవసరాలను గమనిస్తుంది/ ప్రతి ఒక్కరికి తోడువస్తుంది/ అంతా విధి నిర్వహణం అన్నట్టు/మనను దిగవిడచి/ తాను నడచి పోతుంది. “అంటూ సరళంగా కాలాన్ని వ్యాఖ్యానిస్తారు
రాజేశ్వరి గారి పరిశోధనా సిద్ధాంత గ్రంథం బృహత్తరమైనది. వీరు సంస్కృతం లోని అయిదు ప్రసిద్ధ నాటకాలు, కేయూరబాహుచరిత్ర, క్రీడాభి రామము,శృంగార శాకుంతలము, ప్రబోధ చంద్రోదయము,అనర్ఘ రాఘవము, ప్రసన్న రాఘవనాట్యప్రబంధములు గా తెలుగులో ప్రబంధ (కావ్య) రూపాలుగా మారిన ప్రక్రియాభేధాన్ని గూర్చి వివరించారు.
రాజేశ్వరి గారు ప్రచురించిన ఆధునిక కర్నాటక సాహిత్య-చరిత్ర సంస్కృతి ” తదితర పరిశోధకులకు ఉపయుక్తమైన గ్రంథం.
వీరు పరిశోధక విద్యార్థులకు మార్గ దర్శకులుగా వ్యవహరించారు.
రాజేశ్వరి గారు ఉపన్యాసకులుగా బోధనా వృత్తిలో కొనసాగి విశ్రాంతిని పొందారు
రాజేశ్వరి గారు కన్నడ భాషనుండి కావించిన అక్కమహాదేవి,ఊరువాడ ,కువెంపు పుస్తక అనువాదాలు సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు. వీరు తెలుగునుండి కావించిన కన్నడ అనువాదం “కాలవన్ను నిద్రిసలు బిడెను” కు మూలం తెలుగు కవిత్వ సంపుటి”కాలాన్ని నిద్రపోనివ్వను”కూడా సాహిత్య అకాడమీప్రచురణ.
రాజేశ్వరిగారు కావించిన “వచనాలు” కన్నడభాషనుండి తెలుగు అనువాదాన్ని బెంగ
ళూరు బసవసమితి వారు ప్రకటించారు. వీరప్ప మొయిలీ గారి “రామాయణ మహాన్వేషణ గ్రంథం తెలుగు అనువాదంలో సహకరించారు.
బెంగళూరు లోని తెలుగు సాంస్కృతిక సంఘాలలో క్రియాశీల పాత్రను పోషించిన వీరు కార్యక్రమ వ్యాఖ్యాతగా పేరు గాంచారు.
రాజేశ్వరి గారి తండ్రిగారు కళా ప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని గారు. ఇక మెట్టినింటి వారు చుక్కా వారు. వీరిభర్త శ్రీ చుక్కా వెంకటయ్య గారు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థలో విజ్ఞాన వేత్తగా వృత్తినిర్వహించారు. వారు ప్రసిద్ధ విద్యావేత్త చుక్కా రామయ్యగారి సోదరులు. వీరికి ఇద్దరు కుమార్తెలు చుక్కా శారద,చంద్ర స్మిత.
విశ్రాంతి జీవితాన్ని రచనాశీలంతో నిరామయం గా గడపడమే తమ ధ్యేయం అంటారు రాజేశ్వరి గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి బాలచిత్రం

మన ఆరోగ్యం