హితుడు

            వనపర్తి పద్మ

“గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండు ఉండేవి. ఒక గూటిలోన రామచిలుక ఉంది, ఒక గూటిలోన కోయిల ఉంది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది అయిన రెంటికీ జత కుదిరింది” ఈ పాట ప్రతి ఉదయం “ఆత్మీయ నిలయం”లో సుప్రభాతంలా వినపడ్తూనే ఉంటుంది. అక్కడ ఉండే వారందరూ బంధువులు కారు ఎక్కడెక్కడి నుండో వచ్చారు. కొందరు కన్నా బిడ్డలు వదిలిచ్చుకున్నవారు. మరికొందరు కూడు, గూడు లేనివారు. అందరూ అక్కడ ఒకరికి ఒకరు ఆత్మీయులే అక్కడ అందరి మతం మానవత్వమే ఒకరికి ఒకరుగా వయో బేధం లింగ వివక్ష లేని నిలయం. ఆరోగ్య ప్రధమైన ఆలయం అనవచ్చు. ఆత్మీయ నిలయంకు అంకురార్పణ చేసింది రామయ్య, అతనికి ఒక కుమారుడు, బాగా చదువుకొని విదేశాల్లో స్థిర పడ్డాడు. కొంత కాలం క్రితమే రామయ్య భార్య సీతమ్మ దేవుడి దగ్గరకు పోయింది. రామయ్యకు  రంగయ్య ప్రాణ స్నేహితుడు. రంగయ్య నిలువెత్తు ఫోటో ఆత్మీయ నిలయంలో అడుగు పెట్టగానే ఎదురుగా కనిపిస్తుంది. రంగయ్య ఇష్ట దైవం శ్రీ కృష్ణుడు ఆ విగ్రహం కూడా పూల తోట మధ్యలో మనకు కనిపిస్తుంది. పచ్చని చెట్లు, పండ్లు, కూరగాయలతో పూల పరిమళాలు వెదజల్లుతూ నిత్య వసంతంగా ఆత్మీయ అనురాగాలతో ఆనంద నిలయంగా కళకళగా ఉంటుంది.
అర్థరాత్రి అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు. గేటు బయట కట్టిన గంట అదే పనిగా మొగుతుంది. ఎవరో ఆశ్రమం కోసం వచ్చారనుకొని రామయ్య వెళ్ళి గేటు తీసాడు అంతే, ఓ అరవై సంవత్సరాల వయసున్న వ్యక్తి తూలుతు కనిపించాడు. రామయ్య పడిపోకుండా ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఆపలేకపోయాడు. ఆలింగనం చేసుకున్నాడు పోదిమి పట్టుకున్నట్లుగా ఆ స్పర్శ ….. ఆ స్పర్శ రామయ్యలో ఏదో భావోద్వేగాన్ని కల్గించింది. మనసు తనువు పులకించింది. నెమ్మదిగా లోపలికి తీసుకువచ్చి వేడి నీటితో స్నానం చేయించి మంచి బట్టలు వేసి, ఆహారం తినిపించి, మంచంపై పడుకోబెట్టాడు. ఆ వ్యక్తిని పోల్చుకోలేనంతగా మారిపోయాడు కాని శరీర పరిష్వంగణలో చిన్ననాటి ప్రాణ స్నేహం చెదరలేదు. అతడే రంగయ్య, రామయ్య ప్రాణ బంధం. రంగయ్య నిద్రలోకి జారుకున్నాడు. రామయ్య పక్కనే కూర్చొని ఆలోచనలోకి జారుకున్నాడు. ”రంగయ్య ఒకప్పుడు శ్రీ కృష్ణుడైతే తాను కుచేలుడు అలాంటి గుణవంతుడు, ధనవంతుడు, స్నేహ శీలి, అందరి కష్టాలు వాడివిగా భావించి సహాయం చేసే ధర్మదాత. నేడు ఈ పరిస్థితిలోకి ఎలా వచ్చాడు. గత కొంత కాలంగా అందరికీ దూరంగా ఉన్నాడు. కనీస వివరాలు గానీ, ఫోన్ నంబర్ కూడా లేదు. కానీ రామయ్య మాత్రం రంగయ్య జ్ఞాపకాలతోనే కాలం గడుపుతున్నాడు. నేడు ఇలా …… చూస్తుంటేనే గుండెల్లో బాధ మెలిపెడుతుంది. అలానే నిద్రలోకి వెళ్ళిపోయాడు.
వరంగల్ దగ్గర ఒక పల్లె, అక్కడ యజమాని-నౌకరు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సయోధ్యతో పనులు చేసుకునేవారు. వారికి ఇద్దరు కొడుకులు, వారి పేరే రంగయ్య, రామయ్య. చిన్న తనం నుండి కలిసి మెలిసి ఉండేవారు. గడ్డివాముల్లో కూర్చొని చదువుకునేవారు. రంగయ్య తల్లి కూడా రామయ్యను తన కొడుకుతో సమానంగా చూసుకునేది. హెచ్చు తగ్గులు బాల్యానికి అవరోధం కాకూడదు. పసి మనసులకు తారతమ్యం ఉండకూడదు అనే మంచి మనసు ఆ తల్లిది. రాము, రంగ అంటూ ముద్దుగా పిలిచేది. ఇద్దరు రూపంలో రంగుల్లో వేరైనా మాట, బాట, నిజాయితీ ఒకటిగా పెరిగారు. చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ వారికి వారే పోటీ. కొన్ని సార్లు రాము ఓడి రంగను గెలిపిస్తే, మరోసారి రంగా ఓడి రామును గెలిపించేవాడు. పాఠశాల వార్షికోత్సవము లో బహుమతులన్నీ వాళ్ళవే. వారి స్నేహం ఆ గ్రామానికే కాక అందరికీ ఆదర్శం. రంగయ్య పై చదువులకు పట్నం వెళ్ళాడు. రాము చేతి వృత్తుల విద్యతో పాటూ వ్యవసాయం నేర్చుకొని ఉన్న ఊర్లోనే ఉండిపోయాడు. సెలవుల్లో కలుసుకొని యోగ క్షేమాలు తెలిసుకోనేవారు. రంగ పట్నంనుండి రాము కోసం మంచి మంచి పుస్తకాలు, బట్టలు తెచ్చేవాడు. వృత్తికి వ్యవసాయానికి సరైన సలహాలు సూచనలు ఇచ్చేవాడు. రాము రంగ దగ్గరికి వెళ్ళినపుడు పల్లె రుచునలను, పల్లె తల్లి ఇచ్చిన సంపదలను కానుకగా తీసుకెళ్ళేవాడు. కొంత కాలం గడిచాక రాముకు, రంగకు తగిన అమ్మాయిలను చూసి పెళ్లిళ్లు చేశారు వారి తల్లిదండ్రులు. రాముకు దగ్గరి బంధువుల అమ్మాయి మామూలుగా చదువుకున్నది. రంగకు బాగా చదువుకున్న అందమైన, ఆస్తి గల కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. రాము, రంగ భార్యల స్వభావం విభిన్న దృవాలైన తమ భర్తల స్నేహం ముందు తల వంచారు. స్నేహ మాధుర్యాన్ని తమ మనసులో ఆస్వాధిస్తూ వారి మధ్య కూడా సఖ్యత, ఆప్యాయతలు నెలకొన్నాయి. కాల చక్రం అయిదు సంవత్సరాలు తిరిగే సరికి రాము, రంగ ఇద్దరు తండ్రులైనారు వారికి చెరొక కొడుకు చాలనుకున్నారు. కాలానుగుణంగా మార్పులు సహజంగా వచ్చాయి. రంగ, రాము ఇద్దరు వారి పిల్లలను బాగా చదివించి అమెరికాకు పంపించాలన్న సంకల్పం చేసుకున్నారు. రాము పల్లెలోని పొలం కౌలుకు ఇచ్చి తన వ్యాపారంను పట్నంలో సాగిస్తూ ఇద్దరు మిత్రులు ఒకే ఊరిలో జీవనం సాగిస్తున్నారు. అనుకున్నట్లుగానే రాము వ్యాపారం బాగా వృద్దిలోకి వచ్చింది. రంగ ఉద్యోగంలోనూ, ఆస్తులలోనూ చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇద్దరి మధ్య స్నేహ వారధి ఇంకా బలపడసాగింది. పిల్లల చదువులు ముగిశాయి. పై చదువులకు అమెరికా వెళ్లాలని రంగ కొడుకు, జర్మనీ వెళ్తానని రాము కొడుకు నిర్ణయించుకున్నారు. వారి అభిరుచులకు, ఆశయాలకు అనుగుణంగానే రాము, రంగ ఏర్పాటుచేసి విమానాశ్రమానికి వెళ్ళి, విమానం ఎక్కించి వచ్చాడు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో రంగ కొడుకు అమెరికా నుండి ఫోన్ చేశాడు “తానే స్వంతంగా ఒక కంపెనీ పెడుతున్నానని ఇక్కడి అమ్మాయి పరిచయం వల్ల నాకీ అవకాశం వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను”. అంటూ ఫోటోలు పంపించాడు. ఏమీ చేయలేని స్థితిలో రంగ దంపతులు సోఫాలో కూలబడిపోయాడు. రాము దంపతులు రంగను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. మనసులో మాత్రం తన కొడుకు ఏమి చేస్తాడో అన్నదిగులు ఉండేది రాము దంపతులకు. కాని రాము కొడుకు తల్లిదండ్రుల ఇష్టంతోనే ప్రేమించిన అమ్మాయిన పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఉద్యోగాలుచేస్తూ వారి ఖర్చులకు పోనూ మిగిలిన డబ్బులను తండ్రికి పంపించేవాడు. వాటితో రాము ఆస్తులను కొని కొడుకు, కోడలు పేరున ఉంచేవాడు.
రంగ కొడుకు వ్యాపారంలో మెళకువలు నేర్చుకొని బాగా సంపాదిస్తూ ఖరీదైన స్నేహాలు, అలవాట్లతో పొదుపు చేయలేకపోయాడు. అతని భార్య కూడా సంపన్న కుటుంబం నుంచి వచ్చింది కావడం వలన విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. రంగయ్య కొడుకును ఎప్పుడు ఏమీ అనేవాడు కాదు. సంతోషంగా ఉంటేచాలు అనుకునేవాడు. రంగయ్య దంపతులను కొడుకు అమెరికా పిలుచుకున్నాడు. అక్కడి అందమైన ప్రదేశాలు చూపించాడు. తన కంపెనీ ఎలా నడుస్తుందో చెప్పాడు. స్నేహితులను పరిచయం చేశాడు. దాదాపు రెండు నెలల కాలం కొడుకు, కోడలు, మనవళ్లతో గడిపాడు. ఈ ఆనందం చాలు ఇంకా ఏ దిగులు లేదనుకున్నాడు. ఇద్దరు ఇండియా కు ప్రయాణం అవుతున్నారు. సరిగ్గా అదేసమయంలో కోడలు దగ్గరకు వచ్చి “మావయ్య మీ అబ్బాయి బిజినెస్ ను ఇంకా డెవెలప్ చేయాలనుకుంటున్నాడు”… అంటూ ఆగిపోయింది నేలచూపులు చూస్తూ, చెప్పు తల్లీ నువ్వు నా బిడ్డవే అన్నాడు రంగ.”అదే మామయ్య పట్నంలో ఉన్న ఆస్తులు కొన్ని అమ్మి మాకు డబ్బులు సర్దుబాటు చేస్తే బాగుంటుంది”. ఆ మాటలకు ఓ క్షణం తటపటాయించి ఇంటికి వెళ్ళి కబురు చేస్తా, వాటికి ఎంత ధర వస్తుందో తెలుసుకోవాలిగా అన్నాడు. సరే మామయ్య అంటూ సాగనంపారు. ఇండియాకు వచ్చి కోడలు అడిగినట్లుగానే ఆస్తులు అమ్మి కొడుకు అకౌంటుకు బదిలీ చేయించాడు. రాము వారించినా వినలేదు. మనం సంపాధించింది వాళ్ళకే కదా అంటూ రాము మాటలను తోసిపుచ్చాడు. మరో రెండు సంవత్సరాలకు ఇంకొంత ఆస్తి అమెరికా చేరింది. వయసు తెచ్చిన ప్రభావమో, దిగులో తెలియదు రంగ భార్యకు అనారోగ్యం వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. విషయం తెలుసుకున్న రంగ కొడుకు మిగిలిన ఆస్తులను అమ్మి అమ్మను తీసుకొని మా దగ్గరకు రండి ఇక్కడ మెరుగైన వైద్యం చేయించవచ్చు అన్నాడు. భార్యను బ్రతికిచ్చుకోవాలి అన్న ఆరాటంతో ఆస్తులను సొమ్ముగా మార్చుకొని భార్యను తీసుకొని కొడుకు దగ్గరకు వెళ్ళాడు. ఇంతకుముందు వెళ్ళినపుడు కొడుకు కోడలు బాగా చూసుకున్నారు కదా ఇప్పుడు అలాగే అనుకున్నాడు. కాని అక్కడకు వెళ్ళిన కొద్ది రోజులకు తెలిసింది. ఆస్తులు కావాలి కాని కన్నవారి అవసరం కాదని ఏదో మొక్కుబడిగా వైద్యం సాగుతుంది. కాస్త మెరుగైంది అనుకునే పరిస్థితిలోనే రంగ భార్య చనిపోయింది. ఆ తర్వాత రంగ నుండి ఫోన్లు ఏమీ రాలేదు……
రంగ లేచి కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న రాముని లేపి అమాంతంగా కౌగిలించుకున్నాడు. “స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం” అనే పాట వినిపిస్తుంది ఇద్దరి మనసుల్లోనూ. అప్పుడు అడిగాడు రాము, రంగను ఇన్నాళ్ళు ఎక్కడకు వెళ్లావు? నేను గుర్తుకు రాలేదా? అంటూ …. రంగ కళ్ళు జలపాతంగా మారాయి. రాము తన కండువతో కన్నీటిని తుడిచి ఏంటి రా చిన్నపిల్లాడిలా! అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ముందు కాఫీ తాగు అంటూ మొక్కల మధ్య ఉన్న శ్రీ కృష్ణుని విగ్రహం దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. చూడరా నీకు ఇష్టమైన దైవం నీ గుర్తుగా ఇక్కడ పెట్టించాను. అదిగో అక్కడు చూడు నీ ఫోటో ఉంది అంటూ చూపించాడు. రంగ రాము చాలా ఆనందంగా చిన్నపిల్లలై పోయారు.
ఇప్పుడు చెప్పరా ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు అని రాము రంగ ను మళ్ళీ మళ్ళీ అడిగాడు. “ఏముందిరా చెప్పడానికి వాళ్ళు పథకం ప్రకారం నా ఆస్తులన్ని స్వంతం చేసుకొన్నారు. తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పు చూశాను, ఇండియాకు రావాలనుకున్నాను. కాని ఆవిడ చనిపోవడంతో కొంత కాలం ఉండాల్సి వచ్చింది. నిన్ను చూడాలని మన పల్లెలో బ్రతకాలని మనసు ఆరాట పడింది. ఆ విషయమే కొడుకుకు చెప్పాను. వాడు విమానం మాత్రం ఎక్కించాడు. చేతిలో చిన్ని గవ్వలేదు. పట్నం రాలేక ఎక్కడెక్కడో చిన్నచిన్న పనులు చేసుకుంటూ చివరకు ఇలా నీ దగ్గరకు చేరాను” అని చెప్పాడు.
ఆత్మీయ నిలయం ఏంటి రా ఎందుకు పెట్టావు అని రంగ రాముని అడిగాడు. నా కొడుకు పంపిన డబ్బులతో ఆస్తులను కూడబెట్టాను. వాడు రమ్మన్నా నేను పోలేదు, వాళ్ళే అయిదు సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోతారు. ఇక్కడ అన్నీ లెక్కలు చూసుకుంటారు. మన ఊళ్ళో ఉన్న మన వయసు వాళ్ళందరూ ఒంటరి వాళ్ళు అయ్యారు. పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, అందుకే కొడుకు, కోడలు, నేను కలిసి తీసుకున్న నిర్ణయం మన స్నేహానికి గుర్తుగా మన లాంటి వారి కోసం ఏర్పాటుచేసిన నిలయమే ఈ ఆత్మీయ నిలయంరా అంటూ ఒకరినొకరు కౌగిలించుకొని ఇద్దరి ఆత్మలు ఒకటిగా అడుగులు వేయసాగారు. “స్నేహానికన్న మిన్న లోకాన లేదురా …. కడ దాకా నీడ లాగా నిను వీడిపోదురా … పాట సాక్షిగా రాము రంగ స్నేహానికి చిరునామా అయ్యారు.”

Written by Vanaparti Padma

వనపర్తి పద్మావతి, హన్మకొండ

9949290567

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సమాజసేవలో డాక్టరేట్

కూర విశాలగారి పాట