ఉషోదయం

ఆగండి… కొంచెం ఆలోచించండి…

“మనలో చాలామందికి ఎదుటివారిని వెనుకా ముందూ ఆలోచించకుండా విమర్శించడం అలవాటు. నేనూ ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఓసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు మా అమ్మాయితో వరలక్ష్మీవ్రతం పేరంటానికి వెళ్లాను. అక్కడికి చాలామంది తెలుగువాళ్లు వచ్చారు. అందరూ మన సాంప్రదాయమైన దుస్తులు అంటే చీరలూ, పంజాబీ డ్రెస్సులూ వేసుకుని వచ్చారు. కానీ ఓ అమ్మాయి మాత్రం జీన్స్ వేసుకొచ్చింది. నాకెందుకో కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది.

ఇంటికెళ్లేటప్పుడు ఉండబట్టలేక మా అమ్మాయితో “అదేంటే ఆ అమ్మా యి అలా జీన్స్ వేసుకొచ్చింది. శుభ్రంగా చీర కట్టుకు రాక” అన్నాను. అందుకు ‘ మా అమ్మాయి “అది కాదమ్మా నీకు తెలుసు కదా ఇక్కడ ఆడా మగా ఉద్యోగం చేయడం తప్పనిసరి. ఈ రోజు శుక్రవారం కదా (అమెరికాలో ఆఫీసుల్లో శుక్రవారం నాడే జీన్స్ వేసుకోవడానికి అనుమతి ఉంది) అందుకే ఆ అమ్మాయి ఆఫీసుకి జీన్స్ వేసుకుని వచ్చుంటుంది. కానీ ఆఫీసునుంచి ఇంటికెళ్లి బట్టలు మార్చుకోవడానికి టైం లేక, నేరుగా ఆఫీసునుంచే పేరంటానికి వచ్చుంటుంది. కదా! అందుకే మనం ఎవరినైనా కామెంట్ చేసేముందు మన కోణం నుంచే కాకుండా అవతలి వారి తరఫు నుంచి కూడా ఆలోచించాలమ్మా” అంటూ నాకు క్లాసు పీకింది మా అమ్మాయి.

ఇంక అలా చెప్పడంతో నాకు కనువిప్పు కలిగినట్లు అయింది.

అప్పటినుంచీ నేను ఎవరినైనా విమర్శించేముందు ఆలోచించడం నేర్చుకున్నాను. . అలాగే ఒక్కొక్కసారి మనం ఎవరింటికైనా వెళ్లినప్పుడు వారు మనకు కాఫీ, టీ లేక కూల్డ్రింక్ లాంటివి ఆఫర్ చేయకపోతే, చూడమ్మా ఫలానా వాళ్లింటికి వెళ్తే కాఫీ, టీ సంగతటుంచు కనీసం మంచినీళ్లయినా అడగలేదు అనేస్తాం. ఆలోచిస్తే నిజానికి ఆ సమయానికి వారింట్లో పాలు లేకపోయి ఉండవచ్చు. మరేదైనా కారణం కావచ్చు. కాబట్టి మనం తొందరపడి ఇంత చిన్న విషయానికి ఎదుటి వారిని విమర్శించడం తగదు. మరొక ఉదాహరణ..

ఇంట్లో మనమరాలి పెళ్లి పనులు జరుగుతున్నాయి. కొడుకు కోడలూ | పెళ్లి పనుల్లో నిండా తలమునకలవుతున్నారు. అదే సమయంలో ఆ తల్లి (అత్తగారు) తీర్థయాత్రలు వెళ్లవలసి వచ్చింది. ఇంట్లో మరో పెద్ద దిక్కు లేకపోవడంతో వంటపని, దగ్గరనుంచీ షాపింగ్ పనుల వరకూ కోడలే చూసుకోవలసి వచ్చింది. దాని వల్ల ఆమెకు ಇಲ್ಲು నీట్ గా పెట్టుకోవడం కుదరలేదు. సమయానికి వంట | మనిషి కూడా దొరకలేదు. అంతా ఒంటి చేతిపైన సమర్థించుకోవలసి వచ్చింది. అందుచేత ఈ సదరు గారు తిరిగొచ్చేటప్పటికి కిచెన్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఫ్రిజ్లో అన్ని వస్తువులూ.. అంటే పాలు మీగడలూ పళ్లూ, కూరలతో కిక్కిరిసి ఉంది.

అప్పుడా అత్తగారు అయ్యో! కోడలు ఒంటి చేతిపైన ఈ వారంరోజులు ఎలా నెట్టుకొచ్చిందో అని కాస్త కూడా సానుభూతి చూపకుండా “మీ ఆవిడకి సమర్థత లేదురా. చూడు వారం రోజులు నేనింట్లో లేకపోయేసరికి ఇల్లంతా ఎలా తయారయిందోనని కోడలిని విమర్శిస్తూ కొడుకుతో అన్నది. అలా కాకుండా అయ్యో పాపం నేను లేకపోవడం వల్ల కోడలు ఎంత ఇబ్బంది పడిందోనని ఆ అత్తగారు ఆలోచించి ఉంటే ఎంత బాగుండేది.

మాకు తెలిసినాయన ఒకాయనున్నాడు. చాలా పొదుపరి. ఆ పొదుపుని ఆయన అన్నిటిలోనూ చూపిస్తాడు. ఓరోజు ఆయన మాకు ఫోనుచేశాడు. ఫోను చేసి ఆయన చెప్పాల్సింది చెప్పి చెప్పగానే, మేము ఓ ముఖ్య విషయం చెప్తామనుకుంటుండగానే ఆయన ఫోను పెట్టేశాడు. అప్పుడు ఈయన పొదుపు బంగారం గానూ మనం చెప్పేది వినకుండా పెట్టేశాడనుకుంటూ ఆయన్ను తిట్టుకున్నాం.

తరువాత మాకు తెలిసింది. ఆ సమయంలో ఆయన ఏదో అర్జెంటు పనిమీద బయటకు వెళ్లవలసి వచ్చిందని. అప్పుడు మేమంతా ఆయన్ను అపార్థం చేసుకున్నందుకు ఎంతో నొచ్చుకున్నాం. అందుకే ఎవరినైనా విమర్శించేముందు, కొంచెం ఆగి ఆలోచించడం మంచిది.

మరికొంతమంది, ఫలానావిడకి గర్వం అని సులువుగా అనేస్తారు. ఆమెకు నలుగురిలోకి రావడానికి ఏం సమస్యలున్నాయో ఎందుకని అందరితోనూ ఆమె కలివిడిగా ఉండడం లేదోనని ఆలోచించరు. ఆవిడ నలుగురిలోకి రాకపోవడానికి సవాలక్ష కారణాలు ఉండవచ్చు. అందుకే అవతలివారి ఇబ్బందులు ఏమిటో తెలుసుకోకుండా విమర్శించడం సంస్కారం అనిపించుకోదు.

 

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఈనాటి పెళ్లికూతురు

సమాజసేవలో డాక్టరేట్