మౌనమేఘాలు

పుస్తక సమీక్ష

సమీక్షకులు – ఎన్. లహరి

ఒక పుస్తకం చదివిన వెంటనే బాధ అయినా సంతోషం అయినా కవి అనుభవించింది వూహించి రాసేదే కవిత్వం.కొన్నిసార్లు అనుభవానికి రానివయినా సరే వూహల్ని వాస్తవంలా మరల్చి తొలి అక్షరం నుండి చివర వరకు పాఠకులను చూపు తిప్పనివ్వక చదివించగలిగేదే కవిత్వం..
ఇలాంటి కవిత్వాన్ని రాసి ఆసాంతం చదివించగలిగి ప్రతి కవితలో పాఠకులు తమను తాము చూసుకున్నట్లుగా చేసే కవిత్వ సంపుటే మౌన మేఘాలు
ఈ కవితా సంపుటి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ వారి పుస్తక ప్రచురణ బహుమతికి ఎంపిక కాబడి వారిచేతనే ముద్రించబడడం విశేషం.తన తొలి కవితా సంపుటే ఇలా ఎంపిక అయినందుకు ముందుగా కవయిత్రి శ్రీమతి స్వాతికృష్ణ గారికి అభినందనలు..

ఇక సంపుటిలోకి తొంగిచూస్తే
అమ్మ ఋణం అంటూ రాసిన కవితలో లోకం విడిచిన అమ్మ గురించి
“అమ్మకు అమరత్వం ఉంటే ఎంత బావుండేదో
బిడ్డల కోసం ఎంత అలసిపోయిందో
విశ్రాంతి తీసుకుంటోంది
సమాధి శయ్య లోపల
ఇప్పుడు కానరాదు కదా అమ్మ
కాటికి నేనెళ్లినా” అంటారు.

ప్రతి హృదయానికి హత్తుకుని కళ్ళు చెమ్మగిల్లుతాయి.
నిజమే తల్లి ఉన్నప్పుడే ఆమె ప్రేమను అందిపుచ్చుకోవాలి.లేదంటే కానరాని లోకాలకు తరలి వెళ్తే బిడ్డ కాటికెళ్లినా కానరాదు కదా..

అదే కవితలో
“కష్టాల నలక పడనీయక
తానే కాచే రెప్పవుతుంది
కడగండ్ల వాన కురిసేలోపే కొంగు ఛత్రాన్ని కప్పేస్తుంది”..

స్వాతి కృష్ణ సన్నిధి ( మౌన మేఘాలు కవితా సంపుటి రచయిత్రి)

ఎంత గొప్ప పోలిక..
ఏ తల్లయినా బిడ్డకు కష్టం రాకుండా చూసుకుంటుంది అని ఎంతో గొప్పగా వర్ణించారు కవయిత్రి..

నాన్న కవితలో
“గొంతులో కోపాన్ని ప్రదర్శిస్తూ
మనసులో నవనీతాన్నుంచి
తన ఆశల సమాధిపై
నా ఆశయ సౌధాలను
నిర్మించిన నాన్న సృష్టినేలు బ్రహ్మ”

నాన్నను బ్రహ్మను చేసిన వాక్యాలు..ఇంతకన్నా ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల నుండి ఇటువంటి ప్రేమను తప్ప ఏమీ ఆశించరు కదా..
“అనుభవాలతో తాను పండిపోయినా
వృద్దాప్యపు మలి దశలో
నీకేమి తెలియదన్న మాటకు బదులీయలేక మౌనమయ్యాడు”అంటారు.

ప్రస్తుత రోజుల్లో ఇది జరుగుతూనే ఉంది.కష్టపడి పెంచిన తండ్రిని నీకేం తెలియదు అని ఒకమాటతో తన అనుభవాన్నంతా తుడిచేస్తున్నారు నేటి తరం..ఆ భావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.
“అవును నిజమే నాన్నకేమీ తెలియదు.ప్రేమ పంచడం,కన్నీటికి చేయందించడం తప్ప “అంటూ బిడ్డలు నాన్న విలువను తెలుసుకునేలా చెంపదెబ్బ కొట్టినట్లు చెప్పారు..

“ఏ పేరున కీర్తించినా తనివితీరదసలు
దేవుడు పంపిన కార్యదర్శి అతడు
బాధ్యతలు చేపట్టిన నుండి
పాఠశాలే ఓ పూల వనంలా
విద్యార్థులే చిరు మొక్కలుగా భావిస్తూ అనురాగ బంధంతో అల్లుకుపోతాడు”
గురువు అంటే ఎలా ఉండాలో,ఎలా ఉంటాడో ఈ కవిత చూస్తే చాలు.గురు,శిష్యుల బంధాన్ని పూలతోట,తోటమాలిగా వర్ణిస్తూ మనోహరమైన పొలికలను పొందుపరిచారు.

పచ్చల దండలు కవితలో
“నిదురను రేయికి బలి ఇస్తాడు
కంటిని పంటకు కావలి పెడతాడు
ఓటమి ఒడ్డున కూలబడినా
వెనుతిరగని వీరుడతడు”అంటారు.

రేయి,పగలు తేడా లేకుండా శ్రమించే
ఒక రైతు గురించి అలతి పదాలతో అద్భుతముగా అక్షరీకరించారు.

పలుకుల పక్షులు కవితలో
“మాట పెదవి దాటిందా
పలుకులు పక్షులవుతాయి
రహస్యం రహాస్యంగానే గాలి అలల్లో చేరి సుడిగాలై చుట్టేస్తుంది”

చూసారా..తెలిసిన రహస్యాన్ని గుండెలోనే దాచుకోవాలి ,బయట పెట్టామా అది మనల్నే ముంచేస్తుంది అని ఎంత అందంగా చెప్పారో..

“నేనో కవిని అంటూ
అన్యాయాలనైనా,అమర ప్రేమనైనా కలమున దాచి పుస్తక పుటలపై విదిలించగలను”అంటూ ఒకింత చిరు గర్వాన్ని కూడా చూపారు.

ప్రణయ కౌగిలి కవితలో
“ఎడబాటును మోయలేకపోతున్నా తలపులలో నీ రూపు చెరపలేకున్నా
కలలోనూ వీడని తోడువైనా
ఏ మాయో నన్ను ఏమారుస్తుంది..
వూపిరాడక నా గుండె లయ తప్పుతోంది”.అంటారు

విరహాన్ని కూడా వినూత్నంగా చెప్పడంలోనూ కవయిత్రి నేర్పరే మరి.

అవసరాల అంగడి కవితలో
“ఏం మిగిల్చుకుంటుంది తన కోసం
దుఃఖాన్ని మంచి గంధంలా పూసుకోవడం తప్ప..
అలసట తెరలను బ్రతుకు దండెంపై ఆరేయడం తప్ప..
కన్నీటి తడికి కంటి పొరలు రాలిపోతాయని
నిబ్బరపు మడుగు అడుగున దాచిపెట్టేస్తుంది
ఆ నీటిలో ఈ నీరు కలిసేలా” అంటారు

ఒక గృహిణి తన సర్వస్వం అర్పించుకుని అన్నీ తానే స్వయంగా చేసుకుంటున్నా చీదరింపులు,ఛీత్కారలే మిగులుతాయి కొందరికి..అలాంటి వారి ఆవేదనే ఈ కవిత..
మడుగు నీటిలో కన్నీరు కలిసిపోతుందని నిబ్బరపు మడుగు అడుగున ఆ కంటి నీరును దాచిపెట్టేస్తుంది.
మాటలు చాలవు కవయిత్రి నేర్పును పొగడాలంటే..

మౌన మేఘాలు”కవితలో
“వదులుతున్న శ్వాస ఆవిర్లు హృదయాకాశంలో చేరి మౌన మేఘాలై వలపు జల్లులు కురిపిస్తున్నాయి..
ఏకమే కమ్మంటు తడిపేస్తున్నాయి” అంటూ రసికతను జోడించిన సరసాన్ని కూడా తన అక్షరాల్లో ప్రతిఫలింప చేశారు.

వూహల్లో అందాలు కవితలో
“సముద్రాన్నే తోడి గొంతులో బంధించేదాన్ని..
తీరం ఏడుపు గుర్తొచ్చి విడదీయకూడదనుకున్నా”అంటారు.
ఎంతటి వూహ ఉందో కవయిత్రి మనసులో.
నిజం కానీ వూహల్ని ఇలా రాతల ద్వారా సఫలీకృతం చేయుటలో కవయిత్రి సఫలీకృతం అయ్యారు.

కానిదేముంది కవితలో
“కాలాన్ని గుప్పిట బంధించగలను
కదలిపోయినా సరే ఒడిసిపట్టి తెస్తాను”అంటారు.ఇదెలా సాధ్యం అనుకునేలోపే కిందనే కనిపిస్తుంది
“కవి రాతలకు కానిదేముంది
విలువైన వూహలకు వూతమే అది”అంటారు.
నిజం అనక తప్పదుగా మరి..

ఇలా మౌన మేఘాలు సంపుటిలో ఎన్నో కవితలు కళ్ళను, మనసును కూడా కట్టిపడేసి కదలనీయక చదివిస్తాయి..ఒక్కో కవిత ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా ,సందేశాన్ని ఇచ్చేలా ఉంటాయి.స్నేహం,ప్రేమ,శృంగారం,విరహం,బాధ,ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ తీసుకువచ్చిన ఆణిముత్యం లాంటి పుస్తకం, ప్రతి గ్రంధాలయంలోనూ తప్పక చేరాల్సిన పుస్తకం మౌన మేఘాలు అని చెప్పవచ్చు.
ఇంత ఆకర్షణీయమైన సంపుటిని వెలువరించిన స్వాతికృష్ణ సన్నిధి గారిని అభినందిస్తూ మరెన్నో మంచి సంపూటాలు తీసుకురావాలని అభిలషిస్తున్నాను..

Written by N. Lahari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విధివంచిత(కవిత)

తరుణి చిత్రం