పున్నమి పొద్దుల్లో
వెన్నెల వలపులతో
పదహారేళ్ల పరువం
విరిసిన అందం
పంచాలనే ఆరాటం
పసిమికలువల ప్రతిరూపం
బెదురు చూపులు
చెదిరిన ఆలోచనలు
మెరుపు కోరికలు
అమాయకపు అలకలు
కన్నె కన్నుల కలలు
చిన్నపిల్ల తన్మయత్వం
ఆమె పాలిట అమాయకత్వం
తన ఆశ వమ్ము కాదని
మల్లెల పందిరిలో పాదం మోపి
చెదిరిన కళ్ళలో చుక్కను నిలిపి
ముస్తాబుతో వచ్చింది ముద్దుగుమ్మ
ఆకాంక్షల బహుమతుల పట్టుకొమ్మ
తన జీవిత చక్రాన్ని
మల్లెలతో మురిపించి
వెన్నెలలు కురిపిస్తాడని
భర్త గా ఆహ్వానించి
హృదయ భారం మోపి
కాలానికి తలవంచింది
కానీ
కానీ
పురుషాహంకారం
పురివిప్పి నాట్యం చేసింది
కోరలతో విషం కక్కి
కాల నాగు గా కాటేసింది.
అంతటితో కాంత కలలు
కనుమరుగై కటిక చీకటిలో
కారు మబ్బులు కమ్మినాయి
కట్నం చాలలేదని
నేను తాకలేనని
పతి సతాయింపులు
అత్త ఆడపడుచుల వెకిలింపులు
మామగారి మందలింపులు
నిత్య నూతనాలవుతాయి
నిరాశ నిండిన గుండెతో
బ్రతికే భారమని భావించి
ఆత్మహత్యే శరణ్యమని
ఆహుతి అయ్యే సందర్భమవుతుంది
కానీ
కానీ
జీవన ప్రయాణంలో
పూలబాటలు ముళ్ళ బాటలుంటాయని
పెళ్లే ప్రధానం కాదని
ఒంటరిగా ఎదురీదే స్థైర్యం తానై
మరో అడుగు ముందుకేసింది
మొక్కవోని ధైర్యంతో
ఆశల ఊపిరులను చేర్చుకొని ధైర్యాన్ని దండిగా నింపుకొని విద్యను వినయాన్ని జోడించి
తన జీవిత చరిత్ర పుటలను
సిరివెన్నెల చిరు గ్రంథంగా
మలచుకొని…
నేటి స్త్రీ అబల కాదు సబలని
రేపటి తరానికి వారధి అయి-సారధి అయి నిలిచింది
కొత్త ఆశల
క్రొంగొత్త ఆదర్శాల పెళ్లి కూతుర్ల లా వీళ్ళు!