పువ్వులా వికసించి,
నవ్వులు మూటగట్టి,
తల్లిదండ్రుల మురిపాన జతచేర్చి,
సీతాకోకచిలుకల్లే ఆనందంతో
ఎగురుతూ….
రంగుల సింగిడిగా
లోకాన్ని కాంతిమయం చేస్తూ
అనుక్షణం సంతోష జలధిలో
తేలియాడే చిన్నారికి…….
పాఠశాలలో పాఠాలు చెబుతారని
మాత్రమే తెలుసు….
గురువుల ఉపదేశాలు,
స్నేహితుల సరదాలే తెలుసు
కానీ…
వలపన్నిన వేటగాడు
పొంచి చూస్తున్నాడని,
అది ఆటగోలుతనం కాదని,
ఆకతాయి తనం అంతకన్నా కాదని,
ఆడతనాన్ని ఛిద్రం చేసే
మాయోపాయమని తెలియదు…
ఉపన్యాసాలు ఇచ్చే గొంతులు,
చర్చించే వేదికలు,
సంధించే ప్రశ్నలు,
జాలిగా చూసే చూపులు,
సమాజపు కోలాహలాలు,
వీటన్నిటి పరిణామాలు,
చిల్లులు పడిన తల్లిదండ్రుల
గుండెలనుండి కురిసే అశ్రుధారలు
ఇవేవీ ఆ లేత చిగురుకు తెలియవు……
తీర్పు ఏదైనా నష్టం తనకేనని
ఊరడించేది ఎలా?
మార్పు ఎంత వచ్చినా
‘అరిటాకు’ సామెత మారదని చెప్పేదెలా?
జీవితం చివరిదాకా
ఈ మరక మాసిపోదని
అర్థం చేయించేదెలా?
ఇంత జరిగినా……
ఇవేమీ తెలియని పసితనం
నవ్వులు చిందిస్తూనే ఉంది ….ఇంకా కూడా..
మనుషులను ఒక్కసారి
మనసుతో ఆలోచించమని
ప్రతీ గొంతుకలో శబ్దనాళమై
నినదిస్తూ ఉన్నా…
రేపటి తరానికి భరోసా ఇవ్వమని….!!!!!