ఆహారంతో ఆరోగ్యం

శివల పద్మ

ఆడపిల్లలూ…
ఈరోజు మన టాపిక్ ఆహారం , ఆరోగ్యం. ప్రతిరోజూ చేసే పనేగా దీనిలో చెప్పడానికి ఏముంది అంటారా..?
పొరపాటు . అందరూ అనుకుంటున్నట్లుగా తిండి కేవలం బ్రతకడం కోసం కాదు. అది ప్రాణ శక్తి …జీవశక్తి …మనిషిలో చైతన్యాన్ని నింపే ఆధార శక్తి .
కానీ అంతటి పవిత్రమైన శక్తివంతమైన అంశం ఈరోజు నానా విధాలుగా వెర్రి తలలు వేస్తోంది
సరే …తిండికి సంబంధించి ముందు మనం వంట వైపు వద్దాం . ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఆడపిల్లలు వంట అంటే ఆసక్తి చూపుతున్నారు. వారి సంసారాల్లో వంట మనిషిని అయినా పెడుతున్నారు. అధిక సమయాల్లో బయట తింటున్నారు. రెండు కూడా ఎంత మాత్రం సరైన పద్ధతులు కాదు .

ఒకటి వంట మనిషి – వంట చేసే సమయాల్లో వండేవారి ఆలోచనలు ఆ వంట తినే వారి మీద ప్రభావం చూపుతాయంటే మీరు నమ్ముతారా ..?కానీ చూపుతాయి .వండుతున్న మనిషి మనసులో నెగిటివ్ ఆలోచనలు , కోపం , బాధ ఉన్నప్పుడు ఆ వంట తినేస్తాం .కానీ కాసేపటికి మనసు ప్రభావానికి లోనవుతుంది . అది శారీరకంగా కావచ్చు. మానసికంగా కావచ్చు .

అలాగే అది ఇంట్లో వంట చేసిన వంట మనిషి కావచ్చు .హోటల్లో వండిన వారు కావచ్చు. వన్డేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. వేరే ఆలోచనలు రాకుండా దైవస్మరణ , ఒక మంత్రం వంటిది చదువుకుంటూ ఉంటే ఆ వండిన పదార్థానికి అనుకూల శక్తి చేరుతుంది.

అంతా అనుకున్నట్లు తిండి కడుపు నింపడం కోసం కాదు .
వండిన మనిషి భావన మంట మీద పడుతుంది.
ఆ ప్రభావం తిన్న మనిషి మీద పడుతుంది.
ఆ ప్రభావం ప్రవర్తన మీద పడుతుంది.
ఆ ప్రవర్తన అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు అనగలమా తిండి కేవలం కడుపు నింపుతుందని ?
ఇది అంతా ఒట్టిదే అని చాలామంది కొట్టి పారేయవచ్చు .కానీ ఇది వాస్తవం. అందుకని ఎక్కడ తింటున్నారో తెలుసుకోవాలి.
అలాగే తరచూ ఆర్డర్ చేసుకొని తినడం కూడా అలవాటు తగ్గించుకోవాలి .వ్యాపారం కోసం తిండి పదార్థాలు చేసే వాళ్ళకి వస్తువుల నాణ్యత గురించి ఆలోచించే అవసరం లేదు .వారు అనేక చెడిపోయిన పదార్థాలు వాడినా మనకు తెలియదు. అలాగే ఎప్పటివి నిలవ ఉంచి పెడుతున్నారో కూడా తెలియదు .ఇది క్రమంగా (వెంటనే కాకపోయినా) ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఈరోజు సమాజంలో ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు బయట తిండికి అలవాటు పడి చాలా తొందరగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు . ఇంట్లో వంట చేసుకుంటే ఆరోగ్యానికి సంబంధించినవి వాటిలో చేర్చవచ్చు. కానీ వ్యాపారం చేసే వాళ్ళకి మీ ఆరోగ్యంతో పని ఏమిటి?

అలాగే తల్లి వంట చేస్తే ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే మిరియాల చారు పెడుతుంది. వేడి చేస్తే మజ్జిగ పులుసు పెడుతుంది. నూనెలు అధికం కాకుండా చూసుకుంటుంది .
కాబోయే తల్లులు కూడా ఇలాగే చేసినప్పుడు పిల్లలు , ఇంటి వాతావరణం ఆరోగ్యంగా ఉంటాయి. ఇంత చదువు చదివి వంట చేస్తామా అనుకోవద్దు. దాని మీదే ఆరోగ్యం , దాన్నిబట్టి ఆనందం, సక్సెస్ అన్నీ ఉంటాయి. వంట చేయడం అనేది చిన్నతనం కాదు. పరువు తక్కువ కాదు .మన ఆరోగ్యం కోసం మనం తీసుకుంటున్న జాగ్రత్త .

కనుక నేటి ఆడపిల్లలు రాబోయే తరం యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వంటకి ప్రాధాన్యతని ఇవ్వడం మంచిది.
అలాగే తొందరగా వంట చేయడం ..
శుభ్రంగా చేయటం ..
వృధా కాకుండా చేయడం..
వంటివి కూడా అలవర్చుకోవాలి ఇవన్నీ కూడా వంట అనే కళలో భాగాలే. ఇంటికి ఆత్మీయులు వచ్చినప్పుడు మన చేత్తో వంట చేసి వారికి పెడితే కలిగే సంతృప్తి వేరు. అది హోటల్ భోజనం తెచ్చి పెట్టడంలో ఉండదు. ఆత్మీయతతో కూడిన ఆతిథ్యం ఇల్లాలికే ఒక ఆభరణంగా ఉంటుంది.

Written by Shivala Padma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సద్భావనలు

Paneer Butter Masala