ఉషోదయం

ఇది తగునా……!

       మాధవపెద్ది ఉషా

హలో ఈ దారుణం విన్నారా? ఆడపిల్ల పుట్తుందని స్కానింగ్లో తెలుసుకున్న అత్త మామలు ఆమె గర్భం తీయించేద్దామన్న దురుద్దేశంతో ( ఇదివరకే ఒక ఆడ పిల్ల ఉండడంతో ఈ సారైనా వంశోద్ధారకుడు కావాలన్న ఒకే ఒక లక్ష్యంతో ) కోడలి భోజనంలో ఏవేవో నాటు పదార్థాలు కలిపి రోజూ స్లో పాయిజన్లాపని చేసేటట్లు తినిపించి, ఎనిమిది రోజులలో ఆమె చావుకు కారణం అయ్యారట!
ఈ మధ్య టీవీ లో ఈ వార్త చెప్పుంటే అంతా షాక్ అయ్యారు! అయినా ఇదేం అన్యాయమండీ? స్కానింగ్లో పుట్టబోయేది ఆడ పిల్లా లేక మగ పిల్లవాడా అన్నది తెలుసుకుని, సంభంధిత బంధవులకు తెలియ చేయడం చట్టరీత్యా నేరం అని తెలిసికూడ ఈ డాక్టర్లు ఎందుకిలా చేస్తున్నారు? వారిని ప్రభుత్వం ఎందుకు శిక్షించదు??? ఏమిటీ ఘోరం!!!
అసలైనా మన దేశంలో అనాదిగా ఈ మగ పిల్లల పిచ్చేమిటండీ నాకు తెలియక అడుగుతాను! ఈ రోజులలో కొడుకులు పట్టించుకోకపోతే, తల్లి తండ్రులను చూసే బాధ్యత తమ భుజస్కందాల మీద వేసుకుని కంటికి రెప్పలాగా కాపాడుతున్నారే ఈ తరం ఆడ పిల్లలు………అయినా కాస్త కూడ దయా జాలీ లేకుండా, కొడుకైతే ఏం చేసినా చేయకపోయినా తమని పున్నామ నరకం నుంచి తప్పిస్తాడన్న ఒకే ఒక నమ్మకంతో ( లేక పోతే ఏంటండీ చెప్పటమే కానీ ఎవరైనా చూసారా పున్నామనరకం ఎలా ఉంటుందో! పోనీ నమ్మితే నమ్మండి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఆ ఒక్క స్వలాభంకోసం ముక్కు పచ్చలారని పసికందుల ప్రాణాలు తీయటం ఏం న్యాయమండీ?) ఆడ పిల్లలంటేనే ఒక విధమైన ఏహ్య భావంతో వారిని పనికిరాని వస్తువుగా పరిగణిస్తూ పుట్టీ పుట్టగానే ఏ చెత్తకుండీకో సమర్పించటం లేక గర్భంలో ఉన్నప్పుడే అంతం గావించడం, ఏమిటీ పైశాచికత్వం??
ఇకపోతే ఏ మాత్రం బుద్ధీ జ్ఞానం ఉన్నా, ఆలోచన ఉన్నా ఆడ పిల్ల విలువ ఏంటో తెలుసుకోగలుగుతారు. ఆడది లేందే మగవాడి ఉనికే ప్రశ్నార్థకం అన్న నగ్న సత్యాన్ని గ్రహించిన నాడు ఇటువంటి అకృత్యాలు జరుగవు గాక జరుగవు.
ఇక్కడ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే మగవారిలో (xy) ఉండే y క్రోమోజోమ్ ఆడవారిలో ఉండే (xx) x క్రోమోజోమ్తో కలిసినప్పుడే మగ పిల్ల వాడు పుడ్తాడు. అదే మగ వారి x క్రోమోజోమ్ ఆడవారి x క్రోమోజోమ్తో కలిసినప్పుడు ఆడ పిల్ల జననం జరుగుతుందన్నమాట! అంటే మగ పిల్లవాడు పుట్టటానికిగానీ, ఆడపిల్ల పుట్టటానికిగానీ పురుషులే కారణంగానీ, స్త్రీలుకాదని తెలుస్తోంది.
ఎంతోమంది చదువుకున్న మగవారుకూడ ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోకుండా, తెలిసినా తెలియనట్లు ఉంటూ, ఆడ పిల్ల పుట్టటానికి తమ భార్యే కారణం అని అతని తల్లితో సహా నిందలు మోపుతూ, భార్యకు విడాకులు ఇచ్చేసి మరో వివాహం చేసుకోవడానికి కూడ వెనుకాడడం లేదు.ఈ విషయంలో సంఘంలో ఎంతో పురోగమనం రావాల్సి ఉంది. అంతే కాదు ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు ప్రజలందరికీ తలకెక్కేలా వివిధ మాధ్యమాల ద్వారా ఎయ్డిడ్స్ లాంటి వ్యాధులను ప్రచారం చేసినట్లు చేయ వలసిన అవసరం ఎంతైనా ఉందంటాను.
పైన నేను ప్రస్తావించిన విషయాలు పచ్చి నిజాలైనా మనం ఆవేశం తగ్గించుకుని ప్రశాంతంగా విజ్ఞతతో ఆలోచిస్తే దీని వెనుక ఉన్న అసలు కారణాలు మనకు అవగతమవుతాయి. మనం ఈ విషయాన్ని సమగ్రంగా విశ్లేషిస్తే మనకు ఈ క్రింది కారణాలు స్ఫురిస్తాయి. మొదటిది మన దేశ నిరక్షరాస్యత. రెండవది వరకట్నం.
వర కట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమైనా కూడ ఎవరూ పాటించడం లేదు. భయపడడం లేదు. ఇంకా కొంతమంది అతి తెలివిగలవాళ్ళు , మేము కట్నం తీసుకోలేదు ఏవో ఆడ పెళ్ళివారు వారి అచ్చటా ముచ్చటా తీర్చుచకోవడం కోసం వారు ఇచ్చిన లాంఛనాలూ, కానుకలు తీసుకున్నాం అంతే అని చెప్పేసి తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం కూడ చూసీచూడనట్లు వదిలేస్తోంది. ఇటువంటి పరిస్థితులలో పేద మధ్య తరగతి కుటుంబాలవారు ఆడపిల్లలను ఒక గుదిబండగా భావిస్తున్నారు. అందుకే ఒక ఆడ పిల్లని తప్ప పెంచటానికి తయారుగా లేరు. అవునా కాదా! అంతే కాదు ఈ రోజులలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై దృష్టి పెడ్తే , ఆడపిల్లలను కనటానికీ, పెంచటానికీ తల్లి తండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారంటే అతిశయోక్తి కాదు. అందువల్లనే పసికందుల దశలోనే అంతమొందించటమే నయం అనే కఠిన నిర్ణయానికి ఆడ పిల్లను కన్న తల్లి తండ్రులు వస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఒక్కొక్కసారి తల్లి కూడ బలవుతున్న పరిస్తితి ఏర్పడుతోంది.
కాబట్టి ఎవరిది తప్పంటారు మీరు చెప్పండి??
చివరగా నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, ఇటువంటి ఘోరాతిఘోరాల నివారణకోసం ప్రభుత్వం కంకణం కట్టుకోవాలి. ఈ బాధ్యత నిస్సందేహంగా ప్రభుత్వానిదే!
అన్నిటికన్నా ముందు నిరక్షరాస్యత తొలగించాలి. కుటుంబ నియంత్రణ అమలు పరచాలి. డబ్బుకి ఆశపడి “సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ “ చేసి పుట్టబోయేది ఆడ పిల్ల అన్నది బయట పెట్టిన డాక్టర్లకు కఠిన శిక్షలు వేయాలి. మగపిల్లలను సరైన పద్ధతిలో పెంచే దిశగా పేరెంట్స్ అడుగులు వేయాలి.అప్పుడే ఆడపిల్లలకి రక్షణ ఉంటుంది. ఆడ పిల్లలకి రక్షణ ఉన్న నాడు ఆడ శిశువుల మరణాలకు తప్పక చెక్ పడగలదని నేనంటాను మరి మీరేమంటారు???

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘వనభోజనాల్లో పెళ్ళి సంబంధాలు’

అభిప్రాయ వీచిక