మన మహిళామణులు

సాహితీ లోకానికి చిరపరిచితులు ఆదంపతులు.శ్రీమతి తెన్నేటి సుధాదేవి గారు..

     తెన్నేటి సుధా

చాలా చక్కగా వివరంగా తన జీవిత విశేషాలు తరుణి తో పంచుకున్నారు.ఆమె మాటల్లో

సంక్షిప్తంగా నా రచనలు-నేను
– తెన్నేటి సుధాదేవి

నా పేరు తెన్నేటి సుధాదేవి. నా పుట్టినిల్లు వరంగల్లు. అమ్మ తెన్నేటి అహల్యాదేవి. నాన్న టి.వి. సుబ్బారావు. ఎం.ఎ. వరకు నేను వరంగల్లో చదివాను. అక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూలులో. అక్కడే బి.ఇడి. చేశాను. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న (ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ) పి.జి. సెంటర్లో తెలుగు ఎం.ఎ. చేసి మాడపాటి హనుమంతరావుగారి నెలకొల్పిన మాడపాటి హనుమంతరావు స్వర్ణపతకం పొందగలిగాను. నా ఎదుగుదలకు అమ్మ, నాన్నల ప్రోత్సాహం ఎంతగానో ఉంది. 1964, 65 సంవత్సరాల్లోనే మా అమ్మ ప్రభుత్వ బాలికల పాఠశాలలో హిందీ పండిట్గా ఉద్యోగం చేస్తుండిరది. నాన్న మల్టీపర్పస్ స్కూల్లో టీచ్. మేము ఆరుగురం పిల్లలం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా నాన్న అందర్నీ చదివించడమే కాదు, పిల్లలను అన్ని రంగాలలో ప్రోత్సహించారు. అమ్మ పనిచేస్తున్న స్కూల్లోనే ఆడపిల్లలం చదువుకున్నాము.
మా అమ్మ అహల్యాదేవి రచయిత్రి. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, తన విద్యార్థినులకు వక్తృత్వపోటీలు పెట్టడం, చిన్న నాటికలు రాసి పాఠశాల వార్షికోత్సవాలు ఘనంగా చేయడం – ఇవన్నీ ఒక ఎత్తైతే అమ్మ ఒక స్కూల్ మ్యాగజైన్ నిర్వహించేది. 64, 65 సంవత్సరాల్లో డి.టి.పి. చేసే సదుపాయం లేదు. విద్యార్థినులచేత కథలు, కవితలు, వ్యాసాలు రాయించి రాతప్రతి మ్యాగజైన్ తెచ్చేది. పిల్లలు రాసిన రచనలను బాగా రాయగలిగేవారితో రాయించి పత్రిక తయారుచేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. అయినా పిల్లలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. చదువుతోపాటుగా సృజనాత్మకత పెంపొందించాలని ఆమె లక్ష్యం. అందుకు ఆ స్కూలు ప్రధానోపాధ్యాయిని సుజాతారెడ్డిగారు ఎంతగా సహకరించేవారు. ఆ స్కూలును ఇప్పటికీ సుజాతారెడ్డి స్కూలు అని అంటారంటే ఆమె ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించేవారో తెలుసుకోవచ్చు.
రాతప్రతి మ్యాగజైన్ పేరు ‘శారిక’. అవి ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. నేను 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఆ మ్యాగజైన్కి కథలు, కవితలు రాయడం మొదలుపెట్టాను. అమ్మ ప్రదర్శింపచేసే నాటికలకు థీమ్ చెప్తే నేనూ నాటికలు, మోనో యాక్షన్స్ రాశాను. ఈ విధంగా నా రచనావ్యాసంగా ప్రారంభమైంది. అమ్మ ‘బాల’ అనే బాలల పత్రికలో కవితలు రాసేది. ‘స్వతంత్ర’ అనే పత్రికలో హిందీ నుంచి అనువాద కథలు రాసేది. ‘జనధర్మ’ అనే పత్రికకు వ్యాసాలు రాస్తుండేది. అదే స్ఫూర్తితో నేను కథలు రాయడం మొదలుపెట్టాను. మా అమ్మ ఆంధ్రప్రభ వారపత్రిక తెప్పించేది. చదవడం బాగా అలవాటు చేశారు అమ్మా, నాన్న ఇద్దరూ. పత్రికలలో వచ్చే సీరియల్స్, కొమ్మూరి సాంబశివరావు రచించిన డిటెక్టివ్ నవలలు, యద్దనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాలరావు, వాసిరెడ్డి సీతాదేవి ` ఇంట్లో పిల్లలందరికీ చదివే పిచ్చి. ఆ రచయితలను, రచయిత్రులను కలవడం చాలా ఇష్టం. మా అమ్మ ఆ కోరిక కూడా తీర్చింది. మా స్కూల్లో జరిగే వార్షికోత్సవాలకు డా॥ సి. నారాయణరెడ్డిగారిని, డా॥ వాసిరెడ్డి సీతాదేవిగారిని ఆహ్వానించింది. వారిని చూసి ఆనందించడం గొప్ప అనుభూతి. వారి దగ్గర అప్పుడు తీసుకున్న ఆటోగ్రాఫులు ఇప్పటికీ జాగ్రత్తగా దాచుకున్నాను. అలాగే తెన్నేటి లత ‘మోహనవంశీ’ ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. ఆమె మా బంధువులు. మా ఇంటికి తరచుగా వస్తుండేవారు. ఇది రచనలపరంగా నాలో రాయాలన్న తపన పెంచింది. చాలా కథలు రాశాను. అవి పోస్టు చేయడం పెద్ద పని. ఫెయిర్ రాసి తిరుగు స్టాంపులు జతచేసి పోస్టాఫీసుకు వెళ్ళి తూకం వేసి ` ఇంత పని.
ఆ విధంగా నేను రాసిన ‘జీవనపథం’ అనే కథను ఆంధ్రప్రభకు పోస్టు చేశాను. అద్భుతం ` ఆ కథ ఆంధ్రప్రభలో 1969లో ముద్రితమైంది. ఆ పత్రిక నాకు పోస్టులో వచ్చింది. పారితోషికం 75 రూపాయలు పంపించారు. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నా పేరు అచ్చులో వందలసార్లు చూసుకున్నాను. ఆ తరవాత రాస్తూనే ఉన్నాను. ప్రతి కథ ముద్రితమైంది. రాయడంలో ఆనందాన్ని మనసారా అనుభవించాను, అనుభవిస్తూనే ఉన్నాను.
ఇక అట్లాగే రేడియో వినడం కూడా అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా నాటికలు వినడం. ఎప్పుడూ నాటికలు వినడం, ఆ కళాకారులతో మాట్లాడటం అమ్మ అలవాటు చేసింది. నండూరి సుబ్బారావు, ఎ.బి. ఆనంద్, సి. రామ్మోహన్రావుగార్ల వంటి ప్రముఖ ఆకాశవాణి కళాకారులను కలవడం, మాట్లాడటం, వారింటికి వెళ్ళడం, వారు మా కుటుంబానికి ఆత్మీయులు కావడం సర్వసాధారణమైంది.
1975 వరకు నా జీవితం వరంగల్లో ఈ విధంగా కొనసాగింది. 1975లో వంశీ రామరాజుగారితో నా వివాహం తదనంతరం మరో మలుపు. హైదరాబాద్ వచ్చాను. 1977లో ‘అమృతవాణి’ అనే సంస్థలో స్క్రిప్ట్ రైటర్గా పనిచేశాను. ఆ సంస్థలో నేను వారికోసం సామెతల ఆధారంగా చిన్న నాటికలు (స్కిట్స్) రాసేదాన్ని. ఒక్కొక్కదాని నిడివి 10 నిమిషాలలో …………. నాటికలు అక్కడే రేడియో స్టూడియోలో రికార్డు చేసి మనీలా ఫిలిప్పైన్స్ పంపించేవారు. మనీలా రేడియోనుంచి అవి ప్రసారమయ్యేవి. అక్కడ సంవత్సరం మాత్రమే పనిచేసినా 17 సంవత్సరాలు సామెత నాటికలు రాశాను. మొత్తం 500 సామెతల నాటికలు రాశాను.
వంశీ రామరాజుగారు నా రచనలు బాగా ప్రోత్సహించడంతో నా రచనలు కొనసాగించడం జరిగింది. 1978లో తెలుగు అకాడమిలో నాకు ఉద్యోగం వచ్చింది. నాకెంతో ఇష్టమైన తెలుగు అకాడమిలో 32 సంవత్సరాలు పనిచేసి డెప్యూటీ డైరెక్టర్గా 2010లో పదవీవిరమణ చేశాను. అకాడమిలో పరిభాష, నిఘంటువుల ప్రచురణలోనే కాకుండా ఇంటర్, డిగ్రీ పుస్తకాల సమన్వయకర్తగా పనిచేశాను. ‘తెలుగు వైజ్ఞానిక త్రైమాస పత్రిక’కు 16 సంవత్సరాలు సహసంపాదకురాలిగా పనిచేశాను.
రెండు సంవత్సరాలు ఫిలిమ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పనిచేశాను.
అమెరికాలో వంగూరి ఫౌండేషన్వారి కార్యక్రమాలలో పాల్గొన్నాను. హైదరాబాదులో వంగూరి ఫౌడేషన్ వారి ‘నెలనెలా తెలుగు వెన్నెల’ సాహిత్య కార్యక్రమాలు వంశీ రామరాజుగారితో కలిసి నేను నిర్వహించాను. వంశీ అధ్యక్షురాలిగా అనేక కార్యక్రమాల నిర్వహణలో పాలుపంచుకున్నాను, పంచుకుంటున్నాను.
వంశీ సంస్థ ప్రచురించే అనేక పుస్తకాలకు సంకలనకర్తగా ఉన్నాను.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘బలిజేపల్లి లక్ష్మీకాంతకవి నాటకకళావైదుష్యం’ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నాను.
1. రసమయి సంస్థ ద్వారా సుశీలా నారాయణరెడ్డి అవార్డు అందుకున్నాను.
2. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహితీ అవారుడ అందుకున్నాను.
3. అపురూప సాహితీ అవార్డు
– ఇవి కొన్ని.
మా నాన్న విద్యాన్ తెన్నేటి గురించి…
ఆయన మహామేధావి. మానవతావాది. వరంగల్లో నడుస్తున్న గ్రంథాలయం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, కన్నడ, సంస్కృతభాషలలో నిష్ణాతులు. తెలుగులో గొప్ప పండితులు. 32 గ్రంథాలు రచించారు. గణితంలో ఆంగ్లంలో ఆయన రాసిన 10 గణితగ్రంథాలు నీల్కమల్వారు ప్రచురించారు. తెలుగులో రాసిన 6 గ్రంథాలను తెలుగు అకాడమివారు ప్రచురించారు. ఉర్దూ కవితామాధురి, లిటిల్ క్లే కార్ట్ అనే (స్వర్ణశకటం) ఆంగ్లంలో రాసిన గ్రంథం, షేక్స్పియర్ రాసిన గ్రంథానికి హిందీ అనువాదం విశిష్టగ్రంథాలు. ఎంతో సంస్కారవంతులైన విద్వాన్ తెన్నేటి తన సంతానాన్ని ఎంత ప్రేమగా చూశారో, ప్రతివారికి అంత ప్రేమను పంచిన నిస్వార్థ సేవాపరాయణులు. ‘తెలుగుభాష`గుండెఘోష’ అనే గ్రంథాన్ని తెలుగుభాషపట్ల అభిమానాన్నే కాక తెలుగుభాష గురించిన అనేక విశ్లేషణలు పొందుపరిచారు. ‘నా కలల తెలంగాణ’ సంకలనంలో తెలంగాణ అంటే ప్రేమకు ప్రతీకగా రచించారు.
తన పార్థివదేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు దానం చేశారు.
ఇక వంశీ రామరాజుగారి గురించి…
ఆయన నా భర్త అని చెప్పుకోవడం నాకెంతో గర్వకారణం. 1972లో వంశీ సంస్థ స్థాపించి 50 ఏళ్ళుగా కొన్ని వేల కార్యక్రమాలు అలవోకగా, అద్భుతంగా నిర్వహించిన అత్యంత ప్రతిభాశాలి. వేగేశ్న ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి 33 సంవత్సరాలుగా దివ్యాంగ బాలబాలికలకు ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా చదువు, వారికి ఫిజియోథెరపీ, ఆపరేషన్లు నిర్వహించిన, నిర్వహిస్తున్న సేవామూర్తి. లక్ష్మీనృసింహ స్వామి ఆలయం, షిరిడీ సాయిబాబా ఆలయం అదే ప్రాంగణంలో నిర్మించారు. అంతేకాకుండా ఘంటసాలగుడి నిర్మించారు. కోవిడ్ సమయంలో అంతర్జాల కార్యక్రమాలు నిర్వహించారు. 15 సంవత్సరాలుగా ఘంటసాల ఆరాధనోత్సవాలను అమెరికాలో దివ్యాంగుల సేవలో భాగంగా నిర్వహించారు.
నేను వివాహం చేసుకుని వచ్చిన దగ్గరనుంచి నా ప్రగతికి ఎంతో ప్రోత్సహించారు. నా రచనలకు దోహదం చేశారు. కార్యక్రమాల నిర్వహణ నేర్పించారు. నా ఉద్యోగబాధ్యతల్లో సహకారం అందించారు. అందుకే నా రచనావ్యాసంగం నిరాటంకంగా సాగింది. కార్యక్రమాల నిర్వహణే కాకుండా దాదాపు 200 మంది ప్రముఖులకు సన్మానపత్రాలు రాశాను. ఈ విధంగా వరంగల్లో అమ్మ, నాన్న ప్రోత్సాహం, హైదరాబాదులో నా భర్త ప్రోత్సాహం ఇవి నేనొక స్థాయికి చేరడానికి తోడ్పడ్డాయి.
ఇక నా రచనల గురించి…
1. తెన్నేటి సుధ కథలు
2. తెలుగు సామెత నాటికలు
3. వ్యాసకదంబం
4. అమ్మ – కవితసంకలనం
5. ఉదయకాంత – కవితా సంకలనం
6. ఎమ్.ఎల్. నరసింహారావు మోనోగ్రాఫ్ (తెలుగు అకాడమి ప్రచురణ)
7. బలిజేపల్లి లక్ష్మీకాంతకవి నాటకకళావైదుష్యం
8. లిటిల్ డిటెక్టివ్ – నవల
అముద్రితంగా ఉన్న సన్మానపత్రాలు
ఇవి కాకుండా వంశీ సంస్థ ప్రచురించిన పుస్తకాలకు సంకలనకర్తగా ఉన్నాను.
1. కొత్తకథలు నాలుగు భాగాలకు
2. కవితామేఘమాల
3. కొత్తకవిత – 1
4. వజ్రోత్సవభారతి కవితా సంకలనం
5. తెలుగు సినీతెర చంద్రమోహనం
ఇంకా మరికొన్ని పుస్తకాలు
ఇక హైదరాబాద్ వచ్చాక నా కోరికలెన్నో తీరినై. ఎంతోమంది సినీనటీమణులు మా ఇంటికి వచ్చారు. భానుమతీ రామకృష్ణ, సూర్యకాంతం, కృష్ణకుమారి, అక్కినేని నాగేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, రజని, మల్లికార్జునరావు, శ్రీలక్ష్మి, రాజబాబు, రాజ్యశ్రీ ` వీరందరితో పరిచయభాగ్యం.
అంతేకాకుండా రచయిత్రులు, రచయితలతో పరిచయం, వీరంతా మా ఇంటికి రావడం ` ఇల్లిందల సరస్వతీదేవి, వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచన.
గాయనీగాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత మా ఆతిథ్యం స్వీకరించారు.
మా జీవితం కళాకారులతో, గాయనీగాయకులతో, రచయితలతో, నటీనటులతో ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంటుంది.
నేను ఈ సంకలనంలో చేరాను, కథలింకా రాశాను. వాటిని పుస్తకంగా ముద్రించాలి. అలాగే చాలా కవితలు రాశాను, రాస్తూనే ఉన్నాను.
నా విద్యార్హతలు ఎం.ఎ., బి.ఇడి., పిజిడిసిజె, పిహెచ్.డి.

One Comment

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పచ్చి నిజం

డా. హిమబిందుగారు ఏమంటున్నారో చూడండి