‘చీకటి చోద్యాలు’

  సుంక ధరణి

కిటికీ ఊచల్లోంచి పలుచని వెలుగేదో నా మొహం మీద వాలింది. దానికవతల u ఏవో శబ్దాలు, త్వరగా పదండి అంటూ పక్షుల అరుపులు. చిరునవ్వుతో నెమ్మదిగా లేచి అరచేతులు రాజేసుకుని కళ్లకు అద్దుకున్నాను. ఇంతలో ‘మేఘన లేవవే ఇంకా… ఇంటర్వ్యూకి టైం అవుతోంది’ అనే అమ్మ అరుపులు.
లేచి, రేడీ అయ్యి వంట గదిలోకి వెళ్లా.
-ఏంటమ్మా ఈ రోజు టిఫిన్ వాసన ఘుమఘుమలాడుతోంది.
-నీకు ఇష్టమని ఇడ్లీ చేసాలే కానీ, పద వడ్డిస్తా!
నాన్న ఏదో అర్జెంట్ పని అని చెప్పి బయటకెళ్లారు. నువ్వు వెళ్తున్నావని ఫోన్ చేస్తా.
-బయటకెళ్లారా! పర్లేదు లే అమ్మ, నేను వెళ్తా. వీలైతే నాన్నని ఇంటర్వ్యూ అయ్యాక పికప్ చేసుకోమంటా.
-సరే అయితే జాగ్రత్తగా వెళ్లు….
తినడం అయిపోయింది. హడావుడిగా ఛార్జీంగ్ పెట్టిన ఫోన్, మంచంపై ఉన్న ఫైల్, గోడకు వేలాడే మాస్క్, టేబుల్ మీదున్న బ్యాగు తీసుకుని అమ్మ మాటలకు ఊ… కొడుతూ గడప దాటా.

ఆఫీస్ కు చేరుకునే సరికి పెద్ద క్యూ… దాదాపు సాయంత్రం దాటొచ్చు ఇంటర్వ్యూ అయ్యేసరికి అనుకుని అమ్మకి ఫోన్ చేసి చెప్పా, రావడం ఆలస్యమైతే కంగారు పడొద్దని.
ఇంటర్వ్యూ అయ్యేసరికి సాయంత్రం ఏడు దాటింది. ఆఫీస్ బయట నిలబడి నాన్నకి ఫోన్ చేసా,
నాన్న ఫోన్ ఎత్తట్లేదు.
కొన్నిసార్లు ప్రయత్నించా. అయినా సమాధానం లేదు.
ఈ లోపే అమ్మ నుండి కాల్…
-హాలో మేఘన, ఎక్కడున్నావు. ఇంటర్వ్యూ ఇంకా అవ్వలేదా?
-ఇందాకే అయిపోయిందమ్మా, నేను బయటకొచ్చి నాన్నకి ఫోన్ చేసా, నాన్నేమో ఫోన్ తీయట్లే.
-సరే, నువ్వు మెల్లిగా వచ్చేసేయ్. నాన్నకి నేను ఫోన్ చేసి చెప్తా.
-సరే అమ్మ!
అని చెప్పేసి బస్సు కోసం కనుక్కుంటే ఇంకో అరగంట వరకు తర్వాతి బస్సు రాదన్నారు. అక్కడే ఎదురుచూస్తున్నాను. పక్కనే ఓ ఆటో ఎక్కడికెళ్లాలి మేడమ్ అంటే సింధుపుర కాలనీ అని చెప్పా. ఎక్కండి మేడమ్ అటు వైపే వెళ్తున్నాం అన్నాడు. ఆటోలో ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉండడంతో ఆలోచించకుండా ఎక్కేసా. నా లొకేషన్ ని నాన్నకి, కొంతమంది ఫ్రెండ్స్ కి పంపా.

ఆ ఇద్దరు ఆడవాళ్లు మధ్యలో దిగేసారు. ఆ తర్వాత ఆ ఆటో అతను ఎవర్నీ ఎక్కించుకోలేదు. నాకెందుకో చిన్నగా భయం మొదలైంది. ఎందుకైనా మంచిదని అమ్మకి ఫోన్ చేసి, ఆటోలో ఉన్నానమ్మ అని చెప్పా. అమ్మ కాసేపు మాట్లాడాక సరే జాగ్రత్తగా వస్తా అని చెప్పి కాల్ కట్ చేసి,
-ఇక్కడే పక్కనే ఆపేయండి.
-అదేంటీ మేడమ్, సింధుపుర కాలనీ అన్నారు.
-ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది. కలిసి వెళ్లాలి. ఇదిగో డబ్బులు.
డబ్బులు తీసుకుంటూ అతను నన్ను చూసే చూపు అస్సలు నచ్చలేదు. అతను వెళ్లిపోయాడు.
చివరికి హమ్మయ్య…
అడవిలో పులి నుండి తప్పించుకున్నట్లు ఉంది అనుకుని,
నిలుచున్న చోటు నుండి చుట్టూ చూసా.
నల్లని రోడ్డుపై తెల్లని లైట్లు, వాహనాల చప్పుడు,
చుక్కలు, ఆకాశం, నేను.
సరిగ్గా చూస్తే దూరంగా ఓ చిన్న బస్ స్టాప్,
అక్కడ ఒకావిడ వచ్చే వాహనాల్ని ఆపుతూ, పంపిస్తుంది.
అమ్మకి కాల్ చేద్దాం అని చూస్తే, ఫోన్ ఆటోలో మర్చిపోయా.
టైం తొమ్మిదికావస్తోంది.

బస్ స్టాప్ దగ్గర ఉన్నావిడ దగ్గరకెళ్లి అమ్మకి ఫోన్ చెద్దాం అని వేగంగా ఆమె వైపుకు నడుస్తున్నాను. దగ్గరికి చేరుకునే లోపు నేను రావడం గమనించిన ఆమె నన్నే తీక్షణంగా చూస్తుంది.
అదే చూపు మళ్లీ, ఆటోడ్రైవర్ ఎలాగైతే చూసాడో అలాగే అనిపించింది. వచ్చే వాహనాలను ఆపి ఆమె డబ్బులు అడుగుతుంది. నాకు మళ్లీ భయం మొదలైంది. ఈ సారి రెట్టింపు పరిమాణంలో…
వెంటనే వెనక్కి తిరిగి ఆమె నుంచి దూరంగా పరిగెత్తా ఆ నిట్టనిలువు రోడ్డుపై అలసిపోయే వరకు. చివరగా ఓ చోటు దగ్గర ఆగి నిల్చున్నా ఆయాసంతో! అసలేం అర్థం కాని పరిస్థితి. అటు ఇటు చూసా….
దగ్గర్లో ఓ ఇల్లు, ఆ ఇంటిని ఆనుకుని ఓ వరుసన పది ఇళ్ల వరకు ఉన్నాయి.
అక్కడికైనా వెళ్దాం అని ఆలోచించే లోపే ఓ ఇంట్లోంచి కొంతమంది మగాళ్లు, వాళ్ల వెనకే కొంతమంది ఆడవాళ్లు బయటికి వస్తున్నారు. వాళ్ల తీరు చూస్తే, ఒక్కసారిగా వాంతి వచ్చింది.

నేనెక్కడున్నానో తెలియని స్థితి. ఏడుస్తున్నా, నిశ్శబ్దపు కన్నీళ్లతో.. వెక్కి వెక్కి ఏడుస్తున్నా మట్టిని హత్తుకుంటూ.. బోరున విలపిస్తున్నా ఆకాశాన్ని నిందిస్తూ..
ఇంతలోనే నా భుజం మీద ఓ చేయి వాలినట్లు అనిపించింది.
సగం గుండె అక్కడే ఆగినట్లయింది. వెనక్కి తిరిగి చూసా!
బస్ స్టాప్ లో కనిపించిన ఆవిడ.
-ఎవరమ్మాయి నువ్వు? నిన్ను ఇక్కడ ఎప్పుడు చూడ్లేదే!
-అదీ…అదీ… నేను ఇంటర్వ్యూ… ఆటో…
-సరేసరే, ఎడవకు నువ్వు. ఏం భయపడకు. ఇది మంచి ప్రాంతం కాదు. రాత్రి వేళల్లో ఇక్కడికి నీలాంటి అమ్మాయిలు రావడం అంత మంచిది కాదు. నువ్వు ఎక్కడికెల్లాలో చెప్పు. నేను పంపిస్తా.
-(ఆ సమయంలో ఆమె మాటలు నమ్మడం తప్ప ఇంకే దారి లేదనిపించి) సింధుపుర కాలనీ.
-సరే పదా బస్ స్టాప్ నుంచి కొద్ది దూరంలో ఓ ఆటో స్టాండ్ ఉంది. నాకు అక్కడ తెలిసిన వాళ్లున్నారు. నిన్ను జాగ్రత్తగా ఇంట్లో దింపేయమంటాను.

ఇద్దరం నడుచుకుంటూ ఆటో స్టాండ్ దగ్గరకు వెళ్లాం. అక్కడ నన్నో ఆటో ఎక్కించి ఆవిడ వెళ్లిపోయింది.
పాలిపోయిన నా ముఖాన్ని చూస్తూ ఏవైందండి ఎందుకలా ఉన్నారు అని అడిగాడు ఆటో డ్రైవర్.
భయావరణలో ఉన్న నాకు మళ్లీ ఆ గొంతు, ఆ మాట ఎందుకో నచ్చలేదు. ప్రమాదమేదో ఉందంటూ నా మనసు నన్ను తట్టిలేపుతుంది. బయటకు చూసా, ఇంకా మా ఇల్లు చేరడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోపు ఈ భయంతో ఉండలేననుకుని, ఓ కాలనీ రాగానే దిగిపోయా. అక్కడ ఎవరింట్లోకైనా వెళ్లి నాన్నకి ఫోన్ చెద్దాం అని చుట్టుపక్కల చూస్తుండగా, ఓ బిడ్డను ఎత్తుకున్న వ్యక్తి వేగంగా నడుస్తూ… నన్ను చూసి తల కిందకేసుకుని పరుగులు తీసాడు. నాకేం అర్థం కాలేదు. ఏ ఇంటికి వెళ్దాం అన్న ఆలోచనలో ఓ ఇంటి కాలింగ్ బెల్ కొట్టా. ఒక పెద్దావిడ తలుపు తీసింది. నన్ను చూస్తే ఆవిడకేం అనిపించిందో కానీ, తథేకంగా నన్ను చూసి, బయటకు వచ్చి ఎవరైనా ఉన్నారా అన్నట్లు తొంగి చూసి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఆమె ముఖంలో నాకు ఓ రక్షణ కనిపించింది. ప్రశాంతంగా జరిగింది చెప్పా. తాగడానికి నీళ్లు, ఫోన్ ఇచ్చింది. నాన్నకి కాల్ చేసి విషయం చెప్పా‌.

కొంతసమయం తర్వాత నాన్న వచ్చి నన్ను తీసుకెళ్లారు. కానీ ఏదో వెలితి ఆ ఇంట్లోనో, ఆ కాలనీలో వదిలేసి వచ్చినట్లు అనిపించింది. ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలియదన్న సందేహంలో పడి ఇంత జరిగిందా అనిపించింది. నన్ను ఇక్కడ దింపేయమనగానే మొదటి సారి ఆ ఆటో డ్రైవర్ చూసిన చూపులోని ఆంతర్యం నాకిప్పుడు అర్థం అయ్యింది. అంత దూరం నా దగ్గరకి నడిచొచ్చి నన్ను క్షేమంగా పంపిస్తానన్న ఆమె ఉద్దేశం ఇప్పుడు బోధపడింది.
ఇవన్నీ ఆలోచించే లోపే ఇళ్లోచేసింది. అమ్మ కంగారుగా నన్ను నిమురుతూ….
-మేఘనా నీకేం కాలేదుగా!
-హా… ఏం కాలేదులే అమ్మ. నీళ్లు పెట్టు స్నానం చెస్తా అని చెప్పి తర్వాత అందరం తినేసి, పడుకున్నాం.
ఆ రోజు నాకు అస్సలు నిద్ర పట్టలేదు. వేరే ప్రపంచంలోకి, కాదు కాదు నరకంలోకి వెళ్లొచ్చిన అనుభవం.
అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను.
పొద్దున్నే టివిలో వార్తలు హాల్ అంతా మోగిపోతున్నాయి.
మామూలుగానే లేచి…

-ఏంటమ్మా పొద్దుపొద్దున బ్రేకింగ్ న్యూస్, ఇంత సౌండ్ తో వింటున్నావు.
-నిన్న రాత్రి నాన్న నిన్ను తీసుకొచ్చాడుగా ఆ కాలనీలో రెండేళ్ల పాపని ఓ కిరాతకుడు రేప్ చేసి చంపాడంట.
అంతే అక్కడ నిజంగా పేలిపోయింది నా గుండె. నా కళ్ల ముందే వాడు ఆ పాపని తీసుకుని పరిగెత్తడం చూసా.
ఈ విషయాన్ని దిగమింగుతూ నా రూంలోకి వెళ్లా….

Written by Sunka Dharani

పేరు: సుంక ధరణి
తండ్రి పేరు: సుంక నర్సయ్య
తల్లి పేరు: సుంక లత
వృత్తి: విద్యార్థి (ఎమ్మెస్సీ.బోటనీ-ప్రథమ సంవత్సరం)
కళాశాల: కాకతీయ విశ్వవిద్యాలయం
రాసిన పుస్తకాలు: అరుణిమలు (కవిత్వం)

చిరునామా: ఇం.నెం: 9-7-96/9,
గణేష్ నగర్,
రాజన్న సిరిసిల్ల జిల్లా
505 301
ఫోన్: 8978821932
మెయిల్‌: dharanisunka19@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి చిత్రం

పచ్చి నిజం