బ్రహ్మగారీ పదవీ విరమణ

        మాధవపెద్ది నాగలక్ష్మీ

‘వైద్యో నారాయణ’ అని మనవాళ్లు వైద్యుడిని దేవుడితో పోల్చి గౌరవించారు. మెచ్చుకున్నారు. రోగాలకు మందులు కనిపెట్టిన వైద్యులకే అంత గౌరవము ఇస్తే, ఇన్ని రోగాలు కనిపెట్టగలిగిన ఆ బ్రహ్మగారిని, మనం ఎంత గౌరవించాలి, ఎంత మెచ్చుకోవాలి,  ఎంత పూజించాలి చెప్పండి. కాని అదేమిటో మన బ్రహ్మగారికి పూజలు లేవు, ఒకటి రెండు చోట్ల తప్ప గుళ్లు లేవు. ఏదో తప్పు చేశారని, అందువలన శాపం వచ్చిందని అంటారు కదా. సరే. అది వదిలేయండి. అసలు నాకు అనిపిస్తుంది, బ్రహ్మగారికి ఒక్క క్షణమయినా తీరిక ఉందా అని? 20 గంటలు పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు, డాక్టర్లకు తీరికే ఉండటం లేదు, భార్యా, పిల్లలతో గడపటానికి. అలాగే ఉద్యోగం చేసే స్త్రీలకు కూడా సమయం ఉండటం లేదు, భర్తతో బయటికి వెళ్లటానికి, పిల్లల సరదాగా ఆదుకోవటానికి, మరి మన బ్రహ్మగారి సంగతేమిటి? ఆయనకు సరస్వతీ మాతతో మాట్లాడటానికి, ఆమె వేణుగానము వినటానికి సమయము ఉందా అని.

ఎందుకంటే ఇన్ని కోట్ల జనాలను సృష్టించటము, ఇన్ని కోట్ల మంది ముఖులు వేరువేరుగ మలచటం, ఇన్ని రకాల మనసత్వాలు కల్పించటం, ఆఖరికి అరికాళ్ళలో గీతలు కూడా ఒకరికి ఉన్నట్లుగ వేరొకరికి గీయకపోవటం ఎంత ఆలోచించాలో చెప్పండి. మరి ఎక్కడ ఉంది ఆయనకు సమయం. 24 గంటలు పనిచేస్తూనే ఉన్నారు కదా? అలాగే మరణాలు జరుగుతున్నాయి. ఒకరోజు ఒకచోట మరణం సంభవించగానే, వెంటనే మరొకచోట మనిషిని పుట్టించి ఖాళీ భర్తీ చేయటం, ఇలా నిర్విరామంగా పనిచేస్తున్నారు కదా బ్రహ్మగారు. ఏమిటి ఆ బ్రహ్మగారి  పరిస్థితి? అసలు ఆయన ఎలా ఉంటారు? ఎలా చేస్తున్నారు ఇన్ని పనులు? ఇన్ని పనులు చేస్తున్న ఆయనను మనము ఎంత సత్కరించాలి, ఎలా సత్కరించాలి? ఆలోచించండి.

ఏమి చేస్తే ఆయన ఋణం తీర్చుకోగలం చెప్పండి.

అసలు ఇన్ని రోగాలు ఎందుకు కల్పించారు. ఆ రోగాలను నయం చేసే మనుష్యులను ఎందుకు సృష్టించారు. రోగాలు ఎందుకు? వాటికి విరుగుళ్ళు ఎందుకు? చెప్పండి. అసలు ఆ బ్రహ్మగారు ఎవరికయినా కనపడితే ఆయననే అడిగి తేల్చుకోండి ఈ విషయాలు.

ఆయన ఎప్పుడు తింటారు? ఎప్పుడు విశ్రమిస్తారు? ఎప్పుడు మాతతో కాలం గడుపుతారు? వీణానాదం ఎప్పుడు వింటారు? ప్రతి మనిషికి రిటైర్ మెంట్ (పదవీ విరమణ) అనేది ఒకటి ఉంది కదా? కాని పాపం మన బ్రహ్మగారికి అది కూడా లేదు కదా. ఆయనకు విసుగురావటం లేదా? ఎవరైనా క్రొత్తవాళ్లకు ఆ పదవి అప్పగించి తను విశ్రాంతి తీసుకోవచ్చు కదా? బాధ్యతలను క్రొత్తవారికి కట్టబెట్టేటప్పుడు ఇన్ని రోగాలను, ఇన్ని మానసిక సమస్యలను కల్పించకుండా, ఆనందంగ ఉండే మామూలు మనుష్యులను సృష్టించమని చెప్పి మరీ తన పదవిని అప్పగించమనండి. వీలయితే జన్మ, జరా, మృత్యు బాధల నుంచి విముక్తి కలిగేలా మనుష్యులను సృష్టించమని ఆ క్రొత్త బ్రహ్మగారికి చెప్పి మరీ తాను పదవీ విరమణ చేసి విశ్రాంతిగా గడపమని చెప్పండి.

ఆయన కనపడితే అన్ని ప్రశ్నలు ధైర్యముగా అడగండి జవాబు కనుక మీకు తెలిస్తే అందరికి చెప్పండి. అందరం సంతోషిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సృష్టి

బాల తరుణి