పూర్వజన్మ కర్మఫలం చేత ఈ జన్మము, జీవితగమనము మనకు ప్రాప్తిస్తుందని భారతీయ వైదిక సంస్కృతి తెలుపుతుంది. గత జన్మములో చేసిన పాప కర్మలకు ఫలితంగా ఈ జన్మలో అనేకములైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నప్పుడు మరి నిష్కృతి ఎలా? పరిష్కారం ఏమిటి? అన్నదానికి భర్తృహరిగారు చక్కని శ్లోకం అందించారు.
శ్లో|| యా సాధూంశ్చ ఖలానంకరోతి, విదుషో మూర్ఖాన్, హితాన్ ద్వేషిణః
ప్రత్యక్షం కురుతే పరోక్షమమృతం హలాహలం తత్ క్షణాత్
తామారాధయ సత్ర్కియాం భగవతీం భోక్తుం ఫలం వాఙ్సితం
హే సాధో, వ్యసనైర్గుణేషు విపులేష్వాస్థాం వృథామాకృథాః
పై శ్లోకానికి ఏనుగు లక్ష్మణకవి చక్కని తెలుగు చేశారు.
మ. ఖలునిన్ సజ్జనుగాక, మూర్ఖజను సంఖ్యావంతునింగాఁగ, దా
యల సన్మిత్రులుగా, నగోచరము బ్రత్యక్షంబుగా, బ్రాణహృ
త్కలనంబైన మహావిషంచమృతముంగా జేయు సత్కర్మము
జ్జ్వల నిష్ఠానిధివై భజింపుము వయస్సా వాంఛితార్థాపికిన్
ఓ మిత్రుడా! నీవు కోరిన కోర్కెలను పొందదలచుకున్నట్లైతే దుష్టులను సజ్జనులుగాను, మూర్ఖులను విద్వాంసులుగాను, శ్రతువులను మిత్రులుగాను, అగోచరమైన దానిని గోచరంగాను, ప్రాణాన్ని హరించే విషాన్ని అమృతంగాను చేయగలిగిన సత్కార్యాన్ని శ్రద్ధతో ఆచరించు. ఇతర విషయాల కోసం పాటుపడకు.
మానవుడు తాను కోరినవాటిని పొందాలంటే, సత్కర్మాచరణ చేయాలి. ఈ సత్కర్మాచరణకి ఉన్న శక్తి ఎలాంటిదంటే అది దుష్టులను సజ్జనులనుగా మార్చగలదు. ఏమీరాని మూర్ఖులను కూడా పండితులుగా చేయగలదు. శ్రతువులను మిత్రులనుగా మార్చాలన్నా కనిపించని వస్తువులను కనిపించేట్లు చేయగలదు. ప్రాణాలను హరించివేసే హలాహలం వంటి విషాన్ని కూడా దివ్యమైన అమృతంగా మార్చగలదు. కాబట్టి మానవులు సత్కర్మాచరణపై శ్రద్ధ చూపాలి. అంతేకాని రజస్తమోగుణాదులపై ఆసక్తి చూపకూడదని కవి తెలుపుతున్నారు.
అందుకే భారతీయ సంస్కృతి అంతా దాన ధర్మాదులపైనే ఆధారపడి ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకొని జన్మించిన రాజు కూడా దానధర్మములను ఆచరిస్తేనే చరిత్రలో నిలబడిపోయే చక్రవర్తి కాగలడు. మన పండుగలు పర్వదినాలు కూడా వీటినే తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మనం జరుపుకుంటున్న కార్తీకమాసం ఇటువంటి జీవన విధానాన్నే మనకు బోధిస్తున్నది. మన మనోభీష్టాలు నెరవేరాలంటే ఇతరుల ఆకలిదప్పులను, ధార్మికావసరాలను గుర్తించాలి. చేయూతను అందించాలి.