తరుణీయం

ఇనిస్టెన్ట్…..

వేముగంటి శుక్తిమతి

ఇది ఇనిస్టెంట్ కాలం. ఇప్పుడున్న జనరేషన్ కి ఎనర్జీ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, సినిమాలో యాక్ట్ చేయాలన్నా, చివరకు చదువు రావాలన్నా ఎప్పుడు ఏది అనుకుంటే అది ఇన్స్టెంట్ గా అంటే చిటికలో జరిగిపోవాలి. భూమిలో విత్తనం వేస్తే అది వెంటనే మెులకెత్తాలి. తెల్లవారే పెరిగి పోవాలి. మూడో రోజు పూలు పూసి కాయలు కాయాలి. అంతేకాక ఎక్కువ మోతాదులో పంట రావాలి. ఒక గేదె ఎదగటానికి, లీటర్ల కొద్దీ పాలివ్వడం అన్నీ త్వరత్వరగా జరిగిపోవాలి. అదేవిధంగా రెండేళ్ల వయసులో పిల్లలు బడికి పోవాలి చదువుకోవాలి. వందకు వంద మార్కులు తెచ్చుకోవాలి. వీలైతే తల్లి గర్భం నుండే ఐఐటి క్లాసులకు కోచింగ్ తీసుకోవాలి. ఏ దేశానికో వెళ్ళి పోవాలి. మస్తుగా డబ్బులు సంపాదించాలి. ఇన్స్టెంట్ కాలం అంటే ఇది.

మరి జీవితంలో ఎదగడానికి ఈ ఇన్స్టెంట్ ఎంత వరకూ ఉపయోగపడుతుంది. దీని ఫలితం ఏమయి ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే ఫలితం కూడా ఇన్స్టెంట్ గానే నిలబడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నేటిచదువుల గురించి ఆలోచిస్తే పూర్తిగా మాటలు కూడా రాని పసిపిల్లలను స్కూల్ కు పంపించడం, పంపించింది మొదలు హోం వర్క్ లు, పరీక్షలు, మార్కుల గురించి వాళ్లను ఒత్తిడి చేయడమే తప్ప వాళ్ళ బాగోగులు, ఆరోగ్య పరిస్థితులు, మానసిక స్థితుల గురించి కూడా ఆలోచించటం లేదు మనం. అసలు నిజం చెప్పాలంటే పిల్లలు ఇంట్లో రోజులోఎంత టైం ఉంటున్నారు. సాయంకాలం స్కూల్ వదిలిపెట్టే కాలం దాటిపోయింది. ఏడు ఎనిమిది దాకా స్కూల్లోనే. ఇంటికి రాగానే మళ్లీ హోం వర్క్ లు, ఒద్దింపుల వడ్డింపులు.

ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు అమ్మమ్మ లేదా నానమ్మ లేదా అమ్మ వీరే మొదటి గురువులు. భగవద్గీత శ్లోకాలు, రామాయణంలోని కథలు, భారత భాగవతాల్లోని నీతి, వేమన పద్యాలు, సుమతి పద్యాలు ఇవన్నీ కంఠస్తం కావలసిందే. మరి ఆ పెద్దవాళ్ళు పెద్ద పెద్ద చదవరులేంకారు. ఇక పాఠశాలకు వెళ్ళాక టీచర్స్ పాఠాల తో పాటు ఆడించే వాళ్ళు. పాడించే వాళ్ళు. చదివించే వాళ్ళు. నీతి కథలు చెప్పే వాళ్ళు.అసలు స్కూల్ కి పోయేదే అయిదారేళ్లకు. అప్పటికే ఇంటి గురువుల చదువులు తలకెక్కేవి. నాన్ డీటెయిల్ అనే పుస్తకం తెలుగు, ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలతో అనుబంధంగా ఉండేది.అవి పాఠ్య ప్రణాళిక లోనే ఉండేవి. వాటిలో గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు. మదర్ తెరిసా, మహాత్మా గాంధీ, ప్రకాశం పంతులు, గొప్ప గొప్ప చిత్రకారుల, సంగీత విద్వాంసుల, మేధావుల జీవితచరిత్రలు ఉండేవి. వాటి నుండి కూడా ప్రశ్నాపత్రంలో ప్రశ్నలుండేవి. అందుకని క్షుణ్నంగా చదివేవాళ్ళం. దానితో ఆ గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు తెలియకుండానే మనసులో నాటుకుపోయేవి. ఎవరైనా ఏదైనా తప్పు పని చేసినా, సరిగా చదవకపోయినా ఉపాధ్యాయులు తమ బాధ్యతను నిర్వర్తిస్తూనే తల్లిదండ్రులకు తెలియపరచే వారు. అసలు అలాంటి పరిస్థితే చాలా తక్కువగా ఉండేది

. నిజంగా ఆనాటి చదువులు తలచుకుంటే ఈనాడు మన ఎంతెంత కోల్పోయామో తెలుస్తుంది. స్కూల్ లో ఏం జరుగుతుందో తెలియటం లేదు. చిన్న చిన్న పిల్లలు తల్లి బెదిరింపులకు తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకే లేచి చదువు కోవడం, పూర్తి నిద్రపోని ముఖాలతో స్కూల్ కి వెళ్లడం, మళ్లీ ఏ రాత్రి కో ఇంటికి రావడం, హోం వర్క్ చేసుకోవడం ఇదీ ఈనాటి చదువు. వాళ్ళ బాల్యమంతా హరించబడి మూడేళ్లకే పెద్దవాళ్లలా నిరాశ నిస్పృహలు. పువ్వులా వికసించి ఉండాల్సిన ముఖాలు కళా విహీనంగా, ముడుచుకు పోయి ఉంటున్నాయి. దానికి కారణం మానసిక ఒత్తిడేమో.
ఇదిలా ఉండగా చదువు కోవాలని స్కూళ్ళకు, హాస్టళ్లకు, కాలేజీలకు వెళ్లే ఆడపిల్లల పరిస్థితి చూస్తే,ఆడపిల్ల చదువుకోవాలని మన సంస్కర్తలు చేసిన ఉద్యమాలన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా? ఆడవాళ్ళు అర్ధరాత్రి ఒంటరిగా బయటికి వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పిన గాంధీజీ ఈనాడు బ్రతికి ఉంటే సజీవ సమాధి చేసుకునే వాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముక్కుపచ్చలారని మూడు,నాలుగేళ్ళ పసిమొగ్గలైన చిన్నారి పిల్లలు చదువుకోవాల్సిన స్కూళ్ళలో చీకటి గదిలో బంధింపబడి కామపిశాచుల రాక్షసత్వానికి బలైపోతున్నారు. పది పన్నెండేళ్ల విద్యార్థినులు బాత్ రూమ్ లలో పురుడు పోసుకుంటున్నారంటే మన చదువులు ఎంత అధోగతి పాలు అయ్యాయో ఒప్పుకోక తప్పదు.
ఒకప్పుడు అంటే దాదాపు ఇరవై,ముపై సంవత్సరాల క్రితం చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్తుంటే “నీ పుస్తకాలు జాగ్రత్త. టిఫిన్ బాక్స్ జాగ్రత్త. పెన్సిల్ , రబ్బర్ పోగొట్టుకోకు, చెప్పులు పోగొట్టుకోకు.’ అని చెప్పేది అమ్మ. మరి ఈనాడు మానాన్ని పోగొట్టుకోకు అని చెప్తే ఆ పసికూన లకు అర్థం కాదని ‘టచ్’ ‘నాట్ టచ్’ అని శరీరాన్ని వాళ్ళ లేత చేతులతో తడుముకుంటూ చూపిస్తూచెప్తుంటే పాపం ఆ పిల్లలు ఏమీ అర్థం కాక అయోమయంగా తల్లి వైపు చూస్తూ పాఠం లాగా ఆ మాటలను బట్టిీ పడుతూ ప్రాక్టీస్ చేస్తుంటే స్కూల్ కెళ్ళనమ్మా’ఈ చదువులు మాకొద్దమ్మా’ అని గట్టిగా అరుస్తారేమో ననిపిస్తుంది. అరుస్తే బాగుండుననిపిస్తుంది.
ఎందుకిలా జరుగుతుంది. తప్పిదం ఎక్కడ? ఇంట్లోనా…? స్కూల్లో నా….? సమాజంలో నా…..? ఎవరి బాధ్యత సన్నగిల్లింది.
మరి విద్యారంగం వెనకబడి ఉన్నదన్న ఆ రోజుల్లో ఇలాంటివి జరగలేదు .వినలేదు. ఆనాటి సమాజంలో ఇప్పటిలా మహిళా చట్టాలు లేవు. మహిళలను ఉద్దరిస్తామనే కంకణం లాంటి ట్యాగులు కట్టుకున్న వాళ్ళు లేరు. ఇలాంటి పశు వృత్తి కూడా లేదు.
ఆనాటి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల లక్ష్యం ఏమిటంటే తమ విద్యార్థులు విద్యావంతులు కావాలి. అంటే టీవీలో, వాల్ పోస్టర్లలో రెండూరెండూ,మూడుమూడూ,నాలుగూనాలుగూ అని మైకులు పెట్టుకొని కూరగాయలమ్మినట్టు ర్యాంకుల చిట్టా కాదు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే విద్య.. వాళ్లు సమాజానికి ఉపయోగపడే విద్య. మరి అలాంటి విద్యావ్యవస్థను, పువ్వులలా విరబూసే విద్యార్థులను మళ్లీ చూడగలమా?
చూడగలము. ఎప్పుడైతే కుటుంబంలోని ఆడవాళ్ళు, స్కూళ్ళలో లేడీ టీచర్స్ ఆడపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయాన్ని తమ ఇంట్లోనే, తమ పిల్లకే జరిగినట్టు ప్రతి వాళ్ళు స్పందించాలి. అలా కాకుండా జరిగిన విషయాన్ని చిలవలు పలవలుగా చేసి, మసిపూసి మారేడు కాయ చేస్తూ బాధితులను ఇంకా పనికిమాలిన మాటలతో హింసించక అలాంటి సంఘటనలకు కారణాలు వెతుకుతూ ఇకముందు జరగకుండా జాగ్రత్త తో పాటు పోరాటం చేస్తూ ప్రతిఘటించాలి. ఎవరికి వారు మాకు అవసరంలేదని వదిలేస్తే ఆ ఆపద ఆగిపోకుండా ప్రతి కడపను దాటి పలుకరించే ప్రమాదం ఉంటుంది.
ఇన్స్టెంట్స్ నచ్చుతున్న తల్లులు
మరింకే చేయగలుగుతారు? మరింకే చెప్పగలుగుతారు?
కాని , చెట్టు కే కదా కాత! తప్పదు తరుణులకే అంటే ఆడవాళ్ళకే సామాజిక బాధ్యత కుటుంబ బాధ్యత ఎక్కువ . ఒడుపుగా పురుషులకు చెప్పాలి , పిల్లలకు వాళ్ళ తో చెప్పించాలి. అప్పుడే ఇన్స్టెన్ట్స్ ఫలితాలనిస్తాయి . ఆడవాళ్ళ బాధ్యత లో మగవాళ్ళుూ ఉంటారు , ఉండాలి . మీరేమంటారు? ఆలోచించండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి చిత్రం

ఉషోదయం