లైన్ అండ్ లైఫ్

మాధవపెద్ది నాగలక్ష్మి

ఆరుబయట కూర్చుని, ఆకాశంవైపు చూస్తున్నాను. సూర్యుడు ఇంటికి వెళ్ళబోతున్నాడు. ఆకాశం రంగు అందంగా ఉన్నది. పక్షులు గూళ్ళకు చేరే వేళయింది. ఆనందంతో ఆకాశంవైపే తదేకంగా చూస్తున్నాను. ఇంతలో గుంపులుగా పక్షులు ఇంటికి వెళ్ళడం కనబడింది. అవి ఎంతవరుస క్రమంలో వెళ్తున్నాయో చూడముచ్చటేసింది. వాటి వరుస క్రమం చూసి, వీటికి ఉన్న జ్ఞానం కూడా మన మనుష్యులకు లేదు కదా అనిపించింది.  అవునండీ, మనుష్యులకు ఉందా ఈ క్రమశిక్షణ. వరుసలలో వెళ్ళండం ఉందా? ఎక్కడ చూసినా త్రోపులాటలే కదా? సినిమా టికెట్ల కోసం, రైళ్ళలో సీట్ల కోసం, బస్ స్టాండ్లలో బస్ కోసం, త్రోపులాట లేనిచోటు ఎక్కడ ఉంది చెప్పండి? ఆఖరికి తిండి దగ్గర కూడా. బఫేలలో ఎక్కడో భోజనము అయిపోతుందో, ఎక్కడ రుచిగల పదార్థాలు తమకు దక్కవో అని, చాలా వేగంగా పళ్లాలు పట్టుకొని, ఒకళ్ళ నొకళ్ళు త్రోసుకుంటూ, ముందుకు వెళ్ళటం. బఫేలలో త్రోసుకుంటూ ఉండే పళ్ళేలలో పదార్థాలు క్రిందపడటం, క్రిందపడ్డవి వెనక వచ్చేవాళ్ళు త్రొక్కడం, నేల ఖరాబు కావడం, ఇంకా ఎక్కువ గా త్రోసుకుంటే సాంబారు లాంటివి బంది అవతలివారి బట్టలమీద పడటం, వారు గుఱ్ఱుగా చూడటం, ఏమిటి ఇదంతా, వరుసలో రాకపోవటం వల్లనే కదా?

ఇహ గుళ్ళల్లో సంగతి చెప్పనక్కరలేదు. త్రోపులాటలో చేతిలో కొబ్బరికాయల పళ్ళెం క్రింద పడటం, అవి తీసుకోవడానికి ముందుకు వంగితే వెనకవాడు వీళ్ల మీదగా వెళ్ళటం, వీళ్ళు క్రిందకు కుప్పకూలటం, అయినా లెక్ఖ చేయకుండా ముందువాడు ముందుకు వెళ్ళటం, అంత అవసరమా ఇదంతా? దేవుడి విగ్రహం ఎక్కడికీ పోదు గదా? మీరు లైన్ లో వెళ్లినదానికి త్రోసుకుంటూ వెళ్ళినదానికి మీకు కలిసి వచ్చే సమయం, మహా అయితే ఐదు లేక ఆరు నిమిషాలు ఉండవచ్చు. ఆ ఐదునిమిషాలు ఓపిక పడితే, మీరు క్రింద పడదు. మీ జుట్టు చెదరదు. మీ బట్టలు నలగవు. మీ పూజా సామాగ్రి క్రిందపడి అపవిత్రం కాదు. అన్నిటినీ మించి మీ లైఫ్ మీకు ఉంటుంది. త్రొక్కిడు లాటలో ప్రాణం పోకుండ ఎందుకు వరుస క్రమం పాటించరు? పక్షులలాగా? ఆఖరికి బఱ్రెలు, మేకలు కూడా గొఱ్ఱెల కాపరి అదిలిస్తుంటే వరుసలో వెళ్తాయి కదా? ఆ పాటి భయం, బుద్ధి, జ్ఞానము మనుష్యులమైన మనకు లేదా? ఎందుకు పరుగెత్తుకుంటూ వెళ్ళి, తొక్కిసలాటలో ఇరుక్కుని చచ్చిపోతారు చెప్పండి? ఈ మధ్య స్కూళ్లల్లో పిల్లలకు వరుసక్రమంలో  తరగతులకు వెళ్ళటం, బెల్ కొట్టగానే ఇంటికి వెళ్ళే సమయంలో కాని, లంచ్ పీరియడ్ లో గాని త్రాసు కాకుండా లైన్ లో వెళ్లేటట్లు చూస్తున్నారు గదా? పెద్దయ్యాక మీరు ఆ పద్ధతి ఎందుకు మరచిపోతున్నారు? ఎందుకు పాటించటం లేదు? కాస్త వరుస క్రమంలో వెళ్ళి వీళ్ళు లైన్ తప్పరు. ఎప్పుడు కూడా,  భారతీయులకున్న నిబద్దత మనకు లేదు అని వేరే దేశాలవారు అనుకునేటట్లు చేయండి.

ప్రభుత్వం కూడా కాస్త కళ్ళు తెరిచి, పూనుకొని లైన్ లో రానివారికి జరిమానాలు భారీగ విధించటం చేయాలి. అది గుడికాని, బడికాని, బస్ స్టాండ్ కాని, నాయకుల మీటింగ్ లు గాని, మరేదైనాగాని ఎక్కడ అయినా లైన్ తప్పితే జరిమానాలు విధించాలి. అపుడే ప్రజలు దోవకు వస్తారు. ప్రాణాలు నిలుస్తాయి. ప్రభుత్వం పుణ్యం కట్టుకొని ప్రజల ప్రాణాలు నిలపండి ప్లీజ్.  ప్రజలారా దయచేసి వరుసక్రమంలో రావటం నేర్చుకోండి,  విలువైన ప్రాణాలు కాపాడుకోండి.

సర్వేజనా సుఖినోభవంతు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అతి గారాబం అభిలషనీయం కాదు.

తరుణి చిత్రం