ప్రేమించి చూడు….

సుగుణ అల్లాణి M.A,Bed Teacher

ప్రేమ అద్భుతం ….ప్రేమ అమరం….ప్రేమ మత్తు ప్రేమ పిచ్చి … ఇలా ఎన్నైనా చెబుతారు
కానీ ప్రేమ గురించి తెలియాలంటే ప్రేమించగలగాలి ,ప్రేమించబడాలి, ప్రేమను సఫలం చేసుకోవాలి
…….
వేప చెట్టు గాలి చల్లగా వీస్తుంది
ఆ చెట్టు కు నాకూ చాలా దగ్గరి అనుబంధం ఉన్నదని నా నమ్మకం
మా నాయనమ్మ చెప్పేది…
మా నాన్న తన కడుపులో పడినపుడు చూసిందట ఈ వేపమొక్కని.
పెరట్లో ఉన్న ఈ మొక్క ఎట్లా మొలిచిందో తెలీదు కానీ…దానికి చూడగానే తన కడుపులో బిడ్డలా అనిపించేదని…. పెరడు బాగుచేసేటపుడు దాన్ని పీకేస్తానంటే … ఒప్పుకోలేదని …

మా ఊరిలో విశాలమైన ఇల్లు…
అంతకన్నా విశాలమైన పెరడు.
నా బాల్యమంతా ఆ చెట్టుకిందే గడిచింది
అమ్మ ఒక కొమ్మకు చీర ఉయ్యాల కట్టి ఊపేదట… అలా అయితేనే నిద్రపోయేవాడినని అనేది
నేను పాకే వయసప్పటికి బండలు పరిచినారు కాని వేప చెట్టుని ముట్టుకోలేదు
……
ఇప్పుడు రిటైర్ అయ్యాక కూడా నేనిదే చెట్టు కింద సేదదీరుతాను..
ఈ చెట్టు కింద కూర్చుని ఏదో ఒక పుస్తకం చదవడమో ,చెట్టు వైపు పైకలా చూస్తూ ఊహల్లోకి వెళ్లడమో యిష్టం నాకు.
అమ్మకు దగ్గర గా ఉన్నట్టు అనిపిస్తుంది.
లోపలినుండి చప్పుడు వినిపించింది.
విననట్టు ఊరుకున్నాను.లేవలేదు
మళ్లీ గట్టిగా గ్లాసు కింద పడేసిన చప్పుడు వినిపించింది
ఇక తప్పక లేచి వెళ్లాను.
మంచంలో నా భార్య …. పదేళ్ల క్రితం మెట్లపైనుండి జారి పడింది. నడుము కింది భాగం చచ్చు పడిపోయింది.
పిలవగలదు కానీ పిలవదు…
నీళ్లు కావాలని సైగ చేసింది .. యిచ్చాను.
డైపర్ వైపు చూపించింది…
బయటకు వచ్చి సర్వెంట్ గది లో వీరమ్మను పిలిచాను…
వస్తున్నా అంటూ కేకేసింది….

మళ్లీ వేప చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాను.
నేను నా ఈజీ చైర్… వేప చెట్టు
అలా వేపచెట్టు వైపు చూస్తుంటే…. ఏవో ఆలోచనలు…
నా గతాన్ని లెక్కలేనన్ని మార్లు గుర్తుచేసుకొని ఆ జ్ఞాపకాల లోనే బతుకుతూంటాను.
వేప చెట్టు ఆకులు రాలడం చూస్తూ ఉంటే … గడుస్తున్న నా జీవితపు చివరి రోజుల్లా అనిపిస్తాయి.
చెట్టు మళ్లీ వసంతానికి చిగురిస్తుంది కానీ నా జీవితం??
ప్రతి మనిషి కి ఉంటాయి ఆశలు ఆశయాలు కోరికలు….
నాలాంటి భావుకులకు మరీ ఎక్కువ…
అవును నేను ప్రవృత్తి రీత్యా ఎంతో భావుకత్వమున్న వాడిని.
నా చిన్నతనంలో మా అమ్మా నాన్నలను గమనించేవాడిని…. అమ్మ ఇంటెడు పని చేసినా పని చేసినట్లు కనిపించేది కాదు.నాన్న యింటికి వచ్చేసరికి చకచకా పనులన్నీ చేసుకొని ఇల్లంతా చక్కగా నీట్ గా సర్దేసి ఉంచేది.
తను కూడా అలంకరించుకోవడం కాదు కానీ శుభ్రంగా ఉండేది.కుట్లు, అల్లికలు , బాగా చేసేది.పనికిరాని పాత వస్తువులను పెయింటింగ్ చేసి కొత్తగా యింటిని అలంకరించేది.ఆ కాలంలో అమ్మ పన్నెండో తరగతి వరకు చదివింది.పుట్టింటినుండి పెట్టెడు పుస్తకాలు తెచ్చుకుంది. చిన్న చిన్న కవితలు రాసేది. పెరట్లో మంచం వేసుకొని అమ్మా నేనూ పడుకుని ఆకాశాన్ని ,చుక్కలను చూస్తూ కబుర్లు చెప్పుకునే వాళ్లం. తను చదివిన కథల్లో విషయాలు చెప్పేది.అమ్మకు యద్దనపూడి నవలలంటే పిచ్చి.ఆ నవలల్లో హీరోని వర్ణంచేది. అందం చదువు మాటల్లో కఠినత్వం కనిపించినా మనుసులోని సున్నితత్వం…. ఆ హీరోయిజం …రొమాంటిజం … ఇలా అన్నీ చెప్పేది.

పెరుగుతున్న కొద్ది నన్ను నేను ఆ హీరోలా ఊహించుకునే వాడిని…..
అమ్మ నానమ్మా చాలా స్నేహంగా ఉండేవారు. అమ్మ అంటే నానమ్మ కు చాలా యిష్టం.

నాన్న ఎందుకో ఎప్పుడూ చిరాకు కోపం తో ఉండేవాడు.ఎప్పుడూ యింట్లో నవ్వుతూ మాట్లాడేవాడు కాదు.భోజనం చేయడానికి కూడా ఓపిక ఉండేది కాదు. తినేటపుడు హడావిడీగా తిని వెళ్లేపోయేవాడు. అవసరమైతే తప్ప ఎక్కువ మాట్లాడడం యిష్టపడేవాడు కాదు.
ఆయన యింట్లో ఉన్నంత సేపూ సంతోషం మా యింటికి మైళ్ల దూరం లో ఉండేది. ఒక స్తబ్దత నిశ్శబ్దం రాజ్యమేలేది.ఆయన బయటకు వెళ్లగానే గుండెనిండా ఊపిరి పీల్చుకున్నట్టుండేది.అయినా నాన్నంటే అమ్మకు యిష్టం.
నాన్న పుట్టినరోజును పండగ లా చేసేది. నెల రోజుల ముందు నుండే ప్రయత్నాలు మొదలుపెట్టేది. నాన్న యింట్లో లేనప్పుడు బజారుకు వెళ్లి ఆయనకు బట్టలు తెచ్చి కుట్టించేది.
స్పెషల్ గా ఏదో ఒక బహుమతి యిచ్చేది.
మన కోసం ఎవరైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే మనుసు ఆడే ఆనంద హేల కు హద్దుంటుందా…
మా నాన్న ముఖంలో ఆ సంతోషాన్ని చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూసేది… ఎప్పుడూ నిరాశే ఎదురయ్యేది. డబ్బులన్నీ తగలేయడమేంటి అని తిట్లుకూడా… చేసిన వంట బాగుందని ఏ రోజూ చెప్పలేదు.అమ్మ పుట్టిన రోజు తమ పెళ్లిరోజులు నాన్న కు గుర్తే ఉండవు. నానమ్మ గుర్తు చేస్తే అయితే ఏంటట ?అనే వాడు. అయినా అమ్మ చేయడం మానలేదు.
అమ్మ కు సర్ప్రైజెస్ అంటే యిష్టం. నా పుట్టిన రోజు కోసం అన్నీ ఎంతో యిష్టం గా చేసేది.
ప్రతిసారీ ఒక కొత్త థీం తో చేసేది…. నేను పదో తరగతి పూర్తిచేసేవరకు నా పుట్టినరోజులన్నీ యింట్లో నే జరిగేవి.
నా ఫ్రెండ్స్ యింటికి వచ్చేవారు. అమ్మ అందరినీ చాలా ప్రేమగా ఫ్రెండ్లీ గా చూసేది.
బాల్యమంతా అమ్మతోనే గడిచినందుకు… నాకు అదే ప్రవృత్తి అలవాటైందేమో!!
ఇంటర్మీడియట్ లో ఉన్నపుడు ఫ్రెండ్స్ తో బయట చేసుకో రా నీ పుట్టిన రోజు అన్నది … వెళ్లాము … కానీ అమ్మ యింట్లో చేస్తే వచ్చే ఆనందం పొందలేక పోయాను.అదే మాట అమ్మతో అంటే …. నాతోనే ఉండపోలేవు కదా ఇంకా బయట కొత్త ప్రపంచం ,విశాలమైన జీవితం ఉంది….
నువ్వు బాగా చదుకోవాలి మంచి ఉద్యోగం లో స్థిరపడాలి …. చక్కటి అమ్మాయిని పెళ్లిచేసుకోవాలి… నీ పిల్లల్లో నీ చిన్నతనాన్ని నేను చూడాలి…. నీవు నీ భార్యను బాగా అర్థం చేసుకోవాలి…. అర్థం చేసుకోవడమంటే…..చెప్పినట్లు వినడం కాదు… తన మాట కు ప్రాముఖ్యతనివ్వడం . తన అభిప్రాయాన్ని గౌరవించడం…. ఈ కాలం పిల్లలు బాగా చదువుకుంటున్నారు… నిర్దిష్ట మైన అభిప్రాయాలను ఏర్పర్చుకుంటున్నారు….. వారి అభిప్రాయాలకు ఆశయాలకు విలువనివ్వడం ముఖ్యం….. పిల్లిని గదిలో బంధించినట్లు చేయకుండా రెక్కలున్న పావురం లా స్వతంత్ర్యం గా ఎగరనివ్వాలి.

వాతావరణం చల్లబడినట్టు వీచిన గాలి తెమ్మెర ముఖానికి కొట్టి మరీ చెప్పింది.
నుదుటి మీద చిన్న వాన చినుకు పడగానే ఊహల్లోనుండి బయటపడాల్సి వచ్చింది.
పెరటి వరండానుండి వీరమ్మ పిలుస్తుంది.
బలవంతం కానే లేచి యింట్లోకి వెళ్లాను. నా గదిలోని కిటికీ పక్కనున్న కుర్చీలో కూర్చున్నాను.
వానజల్లు మొదలైంది
వీరమ్మ టీ బిస్కెట్ తీసుకొచ్చింది.
మీ అమ్మగారు తాగారా… అన్నట్టు సైగ చేసి అడిగాను.
తాగారన్నట్టు తలూపి వెళ్లిపోయింది.
మా పిల్లలు కూడబలుక్కుని పెట్టిన పనిమనిషి వీరమ్మ
మొత్తం కుటుంబం ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేసారు.
ఇంటి పని వంట పని చేస్తుంది. మాకున్న కొద్దిపాటి పొలాన్ని ఆమె మొగుడు వీరయ్య సాగు చేస్తాడు.
బయట పనులు ఆమె కొడుకు చేస్తాడు .
నా కొడుకు కూతురు విదేశాల్లో ఉన్నారు.డబ్బుకు కొదవ లేదు. పనిమనిషిని పెట్టి తమ బాధ్యతను నెరవేర్చారు.

ఇంజినీరింగ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసాను. అమ్మ కోరిక ప్రకారం దూరపు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను.
చూడడానికి అందంగా ఉండేది.
నేను అందగాడినే!
మంచి ఎత్తు … రంగు ఉంగరాల క్రాఫ్.
కాలేజీలో ఎందరు నాకు ప్రపోజ్ చేసారో…
ఎందుకో ఎవరూ నా మనస్సును తాకలేదు.
చదువు అవగానే ఉద్యోగం … ఉద్యోగం వచ్చిన ఆరునెల్లకే పెళ్లి…
పెళ్లి మీద ఎన్నో ఆశలు ఊహలు …
ఇరవైనాలుగేళ్లకే పెళ్లా అని స్నేహితులంతా అన్నారు
అమ్మ అమ్మాయిని చూపించగానే నచ్చింది ఓకే అన్నాను.
పెళ్లి లో పెళ్లికూతురు చిరునవ్వులతోనే ఉన్నది. కానీ ఎక్కువ గంభీరం ప్రదర్శించినట్టు అనిపించింది.గర్వంతో
కూడిన నవ్వు అని నాకైతే స్పష్టంగా తెలిసింది.
అందరూ చూడ చక్కని జంట … మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటే నాకూ గర్వంగానే ఉంది మరి…మూడు రాత్రులు గడిచాక ఇంటికి వచ్చాము… మూడు రోజులు ముభావంగానే ఉంది. అలా అని అయిష్టమేమీ లేదు.
ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా… సాధ్యం కావడం లేదు.
మాట్లాడితే తెలుస్తుంది కదా!!
నెలరోజులు గడిచాయి. సినిమాకు వెళ్దామని రెడీగా ఉండమని పొద్దున చెప్పి ఆఫీసుకు వెళ్లాను.
సాయంత్రం వచ్చేసరికి రెడీగానే ఉంది.
బయల్దేరాము…. అంతా మౌనమే!!
సినిమాలో కూడా జోక్స్ వచ్చినపుడు నేను గట్టిగా నవ్వడం తను నిశ్శబ్దం నవ్వడం…
వచ్చేటపుడు హోటల్ కి డిన్నర్ కి వెళ్లాము …
కూర్చున్నపుడు… మెల్లగా మాటలు కలపడానికి ప్రయత్నిస్తూ…
సునీ… ఎటో చూస్తున్నదల్లా తిరిగి నా వైపు చూసింది వింతగా…
ఆ చూపుకే నా నోటి తడారిపోయింది.
ఎలా ఉంది మారేజ్ లైఫ్? అన్నాను మెల్లిగా…
బానే ఉంది… అంది
అంటే …. ఆగాను…
నిజంగా నిన్ను చూడగానే యిష్టపడ్డాను.. అన్నాను
ఆహా!!! అన్నది నిర్భావమైన ముఖంతో…
మరి నువ్వు ?అన్నాను
ఏంటి?
యిష్టపడి చేసుకున్నావా పెళ్లి?
యిష్టమేముంది? మా నాన్న చేసుకోమన్నాడు … చేసుకున్నా… అన్నది
ఒక నిమిషం అర్థం కాలే?
అదేంటి ?
అంతే అన్నట్టు బుజాలెగరేసింది
బట్ ఐ లవ్యూ సో మచ్… అన్నాను
ఛీ ఛీ అదేం మాట … అలాంటివి మా యింటావంటా లేవు… అన్నది సునీత.
ఎలాంటివి? అని బిత్తరపోయి చూసా…
ప్రేమలు అవ్వీ…అన్నది…
నా నవనాడులు క్రుంగిపోయాయి.
ఇంకేం మాట్లాడలేదు

ప్రేమ అంటే బూతు లా అర్థం చేసుకునే తనతో ఏం మాట్లాడాలని కాలం యిచ్చే సమాధానానికై ఎదురుచూసాను
ఆ తర్వాత దాదాపు నాలుగైదు సంవత్సరాలు నా ప్రేమను గుర్తిస్తుందేమో అనే ఆశతో ఓపికగా ఎదురుచూసాను
నిరాశే ఎదురైంది
తనలో ఎటువంటి మార్పు రాలేదు … నేను తన మనుసు దగ్గరికి వెళుదామని ప్రయత్నించిన ప్రతిసారీ దూరమవుతూ వచ్చింది.
అలా అని విముఖత కనిపించదు.
అమ్మా నాన్నలకు మంచి గౌరవం యిచ్చేది. సమయానికన్నీ అమర్చేది… పిల్లలకూ అంతే… అన్నీ పద్దతి ప్రకారం బాధ్యత కనుక చేస్తున్నాను అనే భావం కనబర్చేది…
……..
రానురానూ నేను కూడా ముభావంగా అయిపోయాను
ఏదైనా అవసరముంటే తప్ప మాట్లాడదు.
చాలా రోజులకు నా మనుసులోని బాధను అమ్మ తో పంచుకున్నాను … పోనీ తను పెరిగిన వాతావరణం అలాంటిదేమో రా అన్నది.
………
కాలం అమ్మను నాన్నలను తీసుకెళ్లింది….
ఇద్దరు పిల్లలనిచ్చింది…నా మనుసుకు అతి దగ్గరగా ఉండే అమ్మ దూరమైన తరువాత ఇంకెవరికీ దగ్గరవ్వాలనిపించలేదు.సునీతకు దగ్గరవుదామని ప్రయత్నించి విఫలమయ్యాను… ఇక ఒంటరితనం నన్ను స్తబ్దునిగా చేసింది… ఆ ఒంటరితనమే నన్ను పుస్తకాలకు దగ్గర చేసింది . ఒంటరితనానికి పుస్తకాలకంటే మంచి స్నేహితులేముంటాయి.

నా బాధ్యత గా ఇద్దరి పిల్లలనూ చదివించి వాళ్ల జీవితాలను వాళ్లు సరిదిద్దుకునే స్తోమతనిచ్చాను…
ఇద్దరూ స్థిరపడి పెళ్లిచేసికున్నారు…
అన్ని సందర్భాలలో ప్రేక్షకునిలా ఉండిపోయాను.
సునీత మెట్లమీదనుండి పడి మంచం పట్టిన తర్వాత… పట్టణ జీవితం విసుగనిపించి ఇంకా ఏడేళ్ల సర్వీసున్నా స్వఛ్చందంగాపదవీ విరమణ తీసుకొని మా ఊరికొచ్చేసినాను.
ఇక్కడ పొలం పనులు కూడా చూసినట్టుంటుంది అనుకొని…..
ఇంట్లో ఉన్నపుడు వేపచెట్టు కింద లేదా పొలం గట్టు మీద గంటల తరబడి పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతాను….
ప్రకృతిని ప్రేమించడం అలవాటు చేసుకున్నాను.ఏళ్ల తరబడి మౌనాన్ని ఆశ్రయించాను.

కాలువ గట్టు .. వేపచెట్టు , పొలం గట్టు… పొలం లో సగం ఎకరం అన్ని రకాల పూల చెట్లు… మరో సగం ఎకరం అన్ని రకాల పండ్ల చెట్లు వేయించాను… ఒకసారి మాటల్లో వీరయ్య తో అన్నాను… నేను చనిపోయిన తర్వాత నా సమాధి ఈ పూల చెట్ల మధ్య కట్టించమని… బాధపడ్డాడు అలా మాట్లాడొద్దని….
ఉదయం ఆరు గంటలకు పొలానికి వెళితే పదకొండు గంటలకొస్తాను… అక్కడే గంట యోగ ,బావిలో ఈత కొట్టి చెట్ల మధ్య మెడిటేషన్ …. ఇంటికి వచ్చి వీరమ్మ పెట్టింది తిని మధ్యాహ్నం అంతా వేప చెట్టు తో కబుర్లు…. సాయంత్రం. మళ్లీ వాకింగ్…
అమ్మలాగ ఏమీ ఆశించిని ప్రేమ దొరకదని అర్థమైన తర్వాత ఒంటరితనం నా జీవితమైంది…

ఒంటరియైన వాడు… యోగి కాని భోగి కాని మానసిక రోగి కానీ అవుతాడని అంటారు.
నేనవేవి కాకుండా నేనునేనుగానే ఉండిపోయాను….
……
పిడికిట్లో ఇసుక లాగా కాలం జారిపోతూనే ఉంది….

ఎప్పట్లా రాత్రి పడకున్నాను… నిద్రలోనే వీరమ్మ ఏడుపు మాటలు వినబడుతున్నాయి.
కళ్లు తెరిచాను…. ఎవరో పడుకుని వున్నారు చుట్టూ జనం ఉండడం తో ముఖం కనబడలేదు.
కిటికీలోనుండి బయటకు చూసా… వేపచెట్టు నుండి పెద్ద కొమ్మ ఒకటి విరిగి పడిఉంది
మా అమ్మాయి అబ్బాయి పిల్లలతో సహా వచ్చారు…అందరూ గంభీరంగా ఉన్నారు.
నన్ను ఎవరూ పలకరించడం లేదు.
సునీత వీల్ చైర్ లో కూర్చున్నది. ఎప్పటిలాగే ఏ భావం లేకుండా…
నన్ను నేను చూసుకున్నా…. అదేంటి నేను వేప చెట్టు కొమ్మ మీద కూర్చున్నాను??
అంత పైకి ఎలా ఎక్కాను?
………..అర్థమైంది
నేను చనిపోయాను… నా ఆత్మ వేపచెట్టు పైన ఉంది
వీరయ్య విరిగిన వేప చెట్టు కొమ్మను కొట్టిస్తున్నాడు..
అయ్యగారు ఎప్పుడూ ఇక్కడే కుర్చీలో కూర్చునేవారు… ఏ రాతిరో కొమ్మకూలింది … లేకుంటే ఎంత ప్రెమాదం…
ఓ వాన లేదు గాలి లేదు కొమ్మెట్లా యిరిగిందన్నా…?అన్నాడొకాయిన…
ఏమో తెల్వదురా …
నా కళ్లు ఆనందబాష్పాలతో నిండాయి…
యిన్నాళ్లూ అమ్మ తరువాత నన్నెవరూ ప్రేమించడం లేదనుకున్నాను
మిత్రమా!! నన్ను యింతగా ప్రేమించావా… పసితనం నుండి నీ నీడలో పెరిగినందుకు నిన్ను ప్రేమించినందుకు నీ శరీరం లోభాగాన్ని నాకోసం యిచ్చావా!!
నా జీవితం వ్వర్థం కాలేదు… అనుకుంటూ..
ఆనందంగా అనంత పయనానికి దారిచూసుకుంటూ వెళ్లిపోతూఉన్నాను…..

Written by Suguna Allani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చెల్లని నోటు

తీరని కల తీరింది