నిజమెప్పుడూ రూపాన్ని మార్చుకుంటుంది
అబద్ధం తన గొంతు నొక్కిన ప్రతిసారీ…
కళ్ళెం లేని కోరికలు,
మనసును డబ్బువైపు లాగుతుంటే
పడగలు విప్పిన విషబీజాలు అంకురిస్తూనే ఉంటాయి.
ఆకర్షణల బానిసలమయ్యామని తెలియదు
అగాధంలోకి జారేదాకా….
అడుగులు అటువైపే కదులుతాయి
ఒక్కోసారి మార్గం వక్రించినా.
నీతి, నిజాయితీలు గతులు తప్పి,
అనుబంధాలన్నీ కాగితాలుగా చిరిగి,
రెపరెప లాడతాయి రూపాయి నోటులా..
మానవత్వం నలిగిపోతుంది..
కాసుల గలగలల మధ్య…
విలాసాలు కాస్తా అవసరాలవుతాయి…
బలం అధికారపు వలగా మారి
బలహీనతను ఎరగా వేస్తుంటుంది..
చివరగా…..
ఏదో ఒకనాడు…
కాలపు సంకేతం తనకు చేరినప్పుడు,
అమ్ముడు పోయిన మనసును పట్టిలాగి
ఓ క్షణం వెనక్కి చూసుకున్నప్పుడు…..
అదేక్షణం……
మనిషిగా బతకాలన్న కోరిక
వెక్కిరిస్తుంటుంది చెల్లని నోటులా!!!!