ఓ సెలవు దినం కుట్టు మిషన్లో బ్లవుజ్ కుట్టుకుంటున్న ప్రమీల ఇంటికి వచ్చింది కృపల. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో , “ ప్రమీలగారూ…ఏంటీ ఇల్లంతా ఖాళీ..ఖాళీగా…..ప్రశాంతంగా ఉంది, పిల్లలు ఇంట్లో లేరా? “ అడిగింది కృపల.
“ అవును కృపలా పిల్లలు ‘ స్లీప్ ఓవర్’ కి ప్రెండ్స్ ఇంటికి వెళ్ళారు”
“‘ స్లీప్ ఓవర్ ‘ అంటే ఏమిటి ప్రమీలగారూ?”
“ ఏం లేదండీ సామాన్యంగా ఐదారేళ్ళ పైబడ్డ పిల్లల దగ్గరనుంచీ టీనేజ్ దాటని పిల్లల వరకూ తమ తోటి స్నేహితులింట్లో ఓ రాత్రిగానీ, సెలవు దినం అయితే ఓరోజుగానీ గడిపి రావడాన్ని ‘స్లీప్ ఓవర్’ అంటారండీ!ఇది ఒక రకంగా మనం విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న కల్చర్ అన్నమాట”
“ అదెందుకండీ పిల్లలు సామాన్యంగా సాయంకాలాలూ, సెలవు రోజులలోనూ కలిసి ఆడుకుంటూనే ఉంటారు కదండీ! అది చాలదన్నట్లు ఇంకా రాత్రిళ్ళుకూడ, ఎవరింట్లోనో గడపడం దేనికి, అనవసరంగా ఆ తల్లి తండ్రులకు ఇబ్బంది కావడం తప్ప!”
“ ఆం అందుకేనండీ బాబూ, ఇంకో ఇంటివాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఎలా మసలుకోవాలో ఈ ‘ స్లీప్ ఓవర్’ నేర్పిస్తుందన్న మాట!
ఎలా అంటే ఇంకోళ్ళ ఇంటికి ‘ స్లీప్ ఓవర్’ కి వెళ్తున్న తమ పిల్లలకు, అక్కడ ఎలా మసలుకోవాలో నేర్పించి పంపిస్తారన్న మాట.సో రేపు బంధువుల ఇళ్ళకు వెళ్ళినప్పుడుకూడ పిల్లలకు అన్నీ తెలుస్తాయి.
“ ఈ ‘ స్లీప్ ఓవర్’ వల్ల పిల్లలకుగానీ పెద్దలకుగానీ ఏమేమి లాభాలు ఉన్నాయో కాస్త చెప్పరా ప్రమీలగారూ!” అన్నది కృపల. లాభాలా ఓ ఒకటేమిటి బోలెడు ఉన్నాయి కృపలా!
“ముఖ్యంగా పిల్లలు ఇంట్రోవర్ట్లుగా తయారవకుండా, కలివిడి మనస్తత్వం కలవారుగా తయారవుతారు.”
“ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లేని ఒంటరి పిల్లలకు ఈ పద్ధతి వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అంతే కాకుండా పిల్లలు, తమ ఇంట్లో ఉన్న సౌకర్యాలూ , సుఖాలకే అలవాటు పడకుండా, తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న తమ స్నేహితుల ఇళ్ళల్లోకూడ సర్దుకుపోయి ఉండటం నేర్చుకుంటారు. అంతే కాకుండా వారికి జీవితంలో ఎదురయే కష్ట నష్టాల గురించిన సరైన అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఎటువంటి ఢక్కా ముక్కీలు ఎదురైనా, మనస్థైర్యంతో తమని తాము నిలదొక్కుకోగలుతారు.”
“మరైతే ప్రమీలగారు, బయటనుంచి తమ పిల్లల స్నేహితులు తమ ఇంట్లో గడపడానికి వస్తుంటే, తల్లి తండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?”
“ ఓ అదా మంచి ప్రశ్నే అడిగావు. చెప్తాను. ముందుగా తమ ఇంటికి రాబోతున్న పిల్లల తల్లితండ్రులను వారి పిల్లల అలవాట్లు ఏంటీ, భోజనం విషయంలో వారి వారి ఇష్టా ఇష్టాలేంటీ, వారికేమైనా భోజనం తరువాత మందులు తీసుకునే అలవాట్లు ఉన్నాయా లాంటి వివరాలను అడిగి తెలుసుకుని అందుకు సిద్ధంగాఉండాలి.”
“ఇక పోతే డిన్నర్కి, పిల్లలందరికీ ఇష్టమైన, ఐస్క్రీమ్, పిట్జాలాంటివి తెప్పించి వాళ్ళు ఎంజాయ్ చేసేటట్లు చూడాలి. ఆ తరువాత పిల్లలందరూ కూడఇష్టపడే ఏవైనా ఇన్డోర్ గేమ్స్ గానీ, తంబోలాగానీ ఆడేటట్లు చేయడమే కాకుండా కాసేపు టి.విలో కార్టూన్ ఛానల్స్ కూడ చూడమనాలి. ఒకవేళ కనుక ఎవరైనా ఏదైనా కారణం చేత తమ పేరెంట్స్తో మాట్లాడాలి అంటే వెంటనే వారు కోరినట్లుగానే చేయాలి.
ఇకపోతే మీ పిల్లలను ఎవరింటికైనా పంపవలసివస్తే ముందుగా ఆ పిల్లల తల్లి తండ్రులెలాంటివారు, వారి ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది లాంటి వివరాలను సేకరించకుండా పూర్తిగా అపరిచితుల ఇళ్ళకు పంపకూడదు. మీ పిల్లలకీ , మీకూ వారితో కొంత పరిచయం తప్పనిసరిగా ఉండి తీరాలి. కొంచెం పెద్ద పిల్లలైతే వారినే అడగాలి. “నీకు వారింట్లోనూ, వారి ఫామిలీ మెంబర్స్‌తోనూ ఓ రాత్రి గడిపేంత చనువు ఉందా అని అడగాలి. ఎందుకంటే అంతగా పరిచయం లేని వాళ్ళతో పిల్లలు బిడియంగానూ, సంకోచంగానూ ఫీల్ అవుతారు. అందువల్ల వారు ఆ క్రొత్త వాతావరణంలో ఇమడలేక ఇబ్బందికి గురవుతారు.
మరొక ముఖ్య విషయం….మీ పిల్లలను ‘స్లీప్ ఓవర్’కి పంపే ముందు ఆ స్నేహితుల ఇంట్లో అందరితోనూ మంచి మ్యానర్స్తో నడుచుకోవాలని మరీ మరీ చెప్పాలి. అంతేకాదు టేబిల్ మ్యానర్స్ కూడ పాటించాలని గట్టిగా చెప్పి పంపాలి. సాధ్యమైనంతవరకు నేను ఇది తినను, అది తినను అని సూకరాలకి పోకుండా వాళ్ళు ఏది పెడితే అది తినాలని చెప్పాలి.
ఇక పిల్లలు వెళ్ళబోయే ఫామిలీ కనుక మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళైతే మీ పిల్లలు వారింట్లో తమ ఇంటి గొప్పలు చెప్పకూడదనీ అందువల్ల ఆ ఇంటి సభ్యులు, వారి మిత్రులూ హర్ట్ అవుతారని అర్ధం అయేటట్లు చెప్పాలి. అలాగే మీ పిల్లలు వెళ్ళే ఇల్లుగలవాళ్ళు మీకన్నా ఎక్కువ స్థాయిగలవారైతే మీ ఇంట్లో లేని, వారింట్లో ఉన్న అత్యాధునిక వస్తువులను చూచి లేకిగా ప్రవర్తించకూడదనీ, వీలైనంతవరకూ మౌనంగానే అన్నీ గమనిస్తూ డిగ్నిఫైడ్గా ఉండాలనీ, ఆటలలోఏదైనా తగాదా వస్తే స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పాలి.”
“ అలా గనుక పిల్లలు ప్రవర్తిస్తే ఈ ‘స్లీప్ ఓవర్’ వల్ల పిల్లల వ్యక్తిత్వ వికాశం అద్భుతంగా జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.”
“ ఇవండీ ‘స్లీప్ ఓవర్’ గురించిన విశేషాలు! ఈ పద్ధతి కనుక మీకు నచ్చితే మీ పిల్లలను కూడ ‘స్లీప్ ఓవర్’ కి పంపిస్తారు కదూ కృపలా!