రాష్ట్రపతి అవార్డు గ్రహీత పద్మప్రియ – ఇంటర్వ్యూ by వంగ యశోద
ఆమె చక్రాల కుర్చీ నుంచే రాష్ట్రమంతా తిరిగి వికలాంగుల సమస్యలపై అవగాహన కల్పిస్తారు. సమస్యలపై వేగంగా స్పందించి కోవిడ్ సమయంలో ఎందరికో అన్నదాతగా మారారు. తన వైకల్యం తాను చేయాలనుకున్న సామాజిక సేవాకార్యక్రమాలకు ఏ మాత్రం అడ్డు కాదు అంటూ తనలాంటి ఎందరినో ఆదుకుంటున్నారు. ఆమే “పద్మావతి ఇనిస్టిట్యూట్ ఫర్ ది డిసేబుల్డ్ ” వ్యవస్థాపక అధ్యక్షురాలు పద్మప్రియ. నటనలోనూ.. సామాజిక సేవలోనూ రెండు సార్లు రాష్ట్రపతి అవార్డను అందుకున్న కళాకారిణి, సామాజిక సేవకురాలు.
వైకల్యం తమ శరీరానికే తప్ప మనసుకు కాదని, తోటి వారి సమస్యలకు స్పందించి చేతనైన సహాయం అందించే అవకాశం భగవంతుడు ఇచ్చాడని నమ్మే వ్యక్తి ఆమె. అందుకే తమపై సానుభూతి వద్దని… తోటి మనుషులుగా గుర్తించి తమ హక్కులు తమకు కల్పిస్తే చాలని అంటారు. ఆమెతో తరుణి ముఖాముఖీ..
తరుణి : పద్మాగారు నమస్కారం. రాష్ట్రపతి చేతుల మీదుగా రెండుసార్లు జాతీయస్థాయి అవార్డు అందుకున్న మీరు ఎందరికో స్ఫూర్తిదాతలు. మీ గురించి మాకు వివరిస్తారా? పద్మ ప్రియ : తరుణి పాఠకులందరికీ నమస్కారం. మీ అభిమానానికి ధన్యవాదాలు.
మాది ఖమ్మంలో మధ్యతరగతి నేత పని వారి కుటుంబం. నాన్న సత్యం, అమ్మ కుసుమ. అక్క, తమ్ముడు ఉన్నారు. ఏడాది వయసులోనే పోలియోల కారణంగా రెండుకాళ్లు చచ్చుపడి పోయాయి. అక్క, తమ్ముడు పరుగులు పెడుతుంటే నన్ను మాత్రం అమ్మో, నాన్నో భుజంపై ఎత్తుకొని తీసుకువెళ్లేవారు. తోటి పిల్లలంతా ఆడుకుంటుంటే నడవలేని నా స్థితిని చూసి ఎన్నో సార్లు ఏడ్చాను. అమ్మనాన్న నన్ను ఓదార్చేవారు. అమ్మ పాటలు బాగా పాడేవారు… నేను ఆమెను అనుకరించేదాన్ని.
చదువు జీవితాన్ని ఎదుర్కోనే ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని బలంగా నమ్మే అమ్మనాన్న నన్ను ఖమ్మంలోని ‘సెయింట్ మేరీస్ పోలియో రిహాబిలిటేషన్ సెంటర్ ‘ లో చేర్చారు. అక్కడ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేసే ఆస్ట్రేలియా మహిళ కార్ల హీటస్ గారు పరిచయం అయ్యారు. ఆమె మాటలు నాతో ఆత్మవిశ్వాసం పెంచాయి. చదువుతో పాటు పాటలు పాడటం, నాటకాలు వేయడం. బొమ్మలు గీయడం వంటి కళలలో శిక్షణ ఇచ్చారు. అమ్మతో చిన్నతనం నుంచి నేర్చుకున్న పాట, నాటికపై ఉన్న మమకారం, మా టీచర్ ఇచ్చిన ప్రోత్సాహం నన్ను కళాకారిణిగా తీర్చిదిద్దాయి. మొదటిసారిగా నేను స్కూల్ ఫంక్షన్‌లో నాటకం వేశాను. కుర్చీలో కూర్చొనే నటించాను. నా హావభావాలు చూసి ప్రేక్షకులు ఎంతో మెచ్చుకున్నారు.
కరతాళధ్వనులతో నన్ను అభినందించారు. దాంతో నాటకాలపై ఆసక్తి పెరిగి చూసిన వారు ఎంతో మెచ్చుకున్నారు. అలా నాటకాలు వేయడం ప్రారంభమైంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. ఒకవైపు కళలు.. మరోవైపు చదువు కొనసాగిస్తూనే డిగ్రీ పూర్తిచేశాను. కె.వి. సుబ్బారావు గారి దగ్గర లైట్ మ్యూజిక్, వై. రామచంద్రర్ గారి దగ్గర కర్నాటక సంగీతం, పృద్వీ వెంకటేశ్వరరావు గారి దగ్గర మ్యూజికల్ డ్రామా నేర్చుకున్నాను. హైదరాబాద్‌లో పాటల పోటీలలో పాట పాడాను. ఆ ప్రోగ్రామ్‌కు వచ్చిన వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షుడు వంశీరామరాజుగారు తమ సంస్థలో సంగీతం టీచర్‌గా ఉద్యోగం ఇచ్చారు. టీచర్‌గా పనిచేస్తూనే ఎన్నో నాటకాలలో నటించాను.
తరుణి : మీరు నాటకాల్లో ఏలాంటి పాత్రలు వేసేవారు. మీరు నటించిన పాత్రలకు లభించే ఆదరణ ఎలా ఉండేది ?
పద్మ ప్రియ : చాలా పాత్రలు వేశాను. పార్వతి, చంద్రమతి, సత్యభామ వంటి అనేక పాత్రలు వేశాను. వీటిలో నాకు బాగా నచ్చిన, ప్రేక్షకులు బాగా ఆదరించిన పాత్ర సత్యభామ. మనకు సత్యభామ అనగానే గుర్తుకు వచ్చే ప్రముఖ నటి జమునగారు. ఈ పాత్రలో నా నటన చూసి ఆమె మెచ్చుకోవడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన.
తరుణి : మీ ప్రతిభకు మెచ్చి రాష్ట్రపతి అవార్డు బహుకరించారు. మీరు రెండు సార్లు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఏయే విభాగంలో మీకు ఈ అరుదైన గౌరవం లభించింది ?
పద్మ ప్రియ : దాదాపు మూడు వందల మ్యూజికల్ లైవ్ షోలు, దూరదర్శన్, ఇతర టీవీ ఛానల్స్‌తో కలిపి దాదాపు ఐదు వందల నాటక ప్రదర్శనలు ఇచ్చాను.జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో సంస్థల నుంచి అవార్డులు అందుకున్నాను. ఎక్కువగా నాటకరంగంలో అవార్డులు ఉన్నాయి. 2009లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నాటక రంగం నుంచి 2009లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేని రోజు. జీవితంలో ఒకసారి రాష్ట్రపతి అవార్డు అందుకోవాలంటే ఎంతో కృషి చేయాలి. అలాంటిది నేను రెండుసార్లు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం నా పూర్వజన్మ సుకృతం. అమ్మనాన్న, అక్క తమ్ముడు, గురువులు, శ్రేయోభిలాషుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం రాణి ఝాన్సీ లక్ష్మిబాయి అవార్డు తో సత్కరించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. రాష్ట్రపతి చేతుల మీదుగా రెండు సార్లు అవార్డులు అందుకునే అరుదైన అవకాశం నాకు లభించింది.
తరుణి : మీలాంటి ఎందరికో ఆశ్రయం ఇస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు?
పద్మ ప్రియ :నాకు స్ఫూర్తి మా అమ్మ. ఈ రోజు ఆమె మా మధ్యన లేరు. కానీ, ఆమె ఇచ్చిన ఆత్మధైర్యం నన్ను ముందుకు తీసుకువెళ్తున్నాయి.అంగవైకల్యం అనగానే.. వీరికి ఏ పని చేతకాదు అంటూ జాలిగా చూస్తారు. సమాజం చూసే జాలి చూపులు తట్టుకోలేక ఆత్మనూన్యతాభావంతో బతుకుతున్నారు. కానీ మా అమ్మ నన్ను ఎప్పుడు జాలీగా చూడలేదు. పైగా ఎంతో ధైర్యాన్ని నాలో నింపారు. మా అమ్మ లాంటి అమ్మ అందరికీ ఉండరు కదా! అందుకే డిసేబుల్డ్ వారికోసం ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేశాను. వారందరికీ అమ్మలా మా అమ్మలా అండగా ఉండేలా పద్మావతి ఇనిస్టిట్యూట్ ఫర్ డిసేబుల్డ్ సంస్థను 1999లో ప్రారంభించాను. చదువుతో పాటు కళలలో శిక్షణ ఇస్తాం. వృత్తి నైపుణ్యంతో కూడిన కోర్సులను కూడా అందిస్తున్నాం.
తరుణి : కోవిడ్ సమయంలో మీరు అందించిన సహాయం ఎంతో గొప్పది. ప్రతిరోజూ అన్నదానం చేసేవారు. ఇది ఎలా సాధ్యమైంది?
పద్మ ప్రియ : కోవిడ్ సమయంలో ఆకలితో ఎంతో మంది అలమటించారు. పనులు లేక పస్తులున్నారు. అలాంటి వారికి ఒక పూటైన భోజనం అందించాలనుకున్నాం. మా కుటుంబసభ్యుల సహాకారంతో ఎంతో మందికి ఆహారం అందించగలిగాం.
తరుణి : మీలాంటి ఎందరికో ప్రతి ఏడాది స్ఫూర్తి అవార్డులు..అవార్డులు అందిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి అవార్డులు ఇచ్చారు?
పద్మ ప్రియ :వికలాంగులు సాధించిన, సాధిస్తున్న విజయాలు ఎన్నో ఉన్నాయి. వారిని భుజం తట్టి ప్రోత్సహిస్తే మరిన్ని విజయాలు సాధిస్తారు అన్న భావనతో వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని గుర్తించి అవార్డులు ఇస్తున్నాం. ఇప్పటివరకు వందలాది మందిని గుర్తించి అవార్డు అందించాం. ఇకమీదట కూడా ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందిస్తాం.
తరుణి : మీరు ఇప్పటివరకు వివిధ సంస్థల్లో పనిచేశారు కదా.. ఏయే సంస్థల్లో పనిచేశారు. మీరు ఇచ్చే సూచన?
పద్మ ప్రియ :నేను గతంలో సెన్సార్ బోర్టు సభ్యురాలిగా, నంది అవార్డుల కమిటీ సభ్యురాలుగా పనిచేశాను. ఇప్పుడు వికలాంగుల హక్కుల పరిరక్షణ సంఘం సలహాదారుగా ఉన్నాను. వికలాంగుల హక్కులపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ కళా జాతర నిర్వహించాం. అయ్యో పాపం అన్న సానుభూతి మాకు వద్దు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మాకు దక్కనివ్వండి అంటూ చైతన్యం తీసుకువస్తున్నాం.