హాస్టల్లో చిట్టి తండ్రి చెమ్మగిల్లిన నీ కళ్ళల్లో
భద్రతలేని అంతరంగపు ఆవేదన నిక్షిప్తమైంది
అనుక్షణం నిన్ను వెంటాడే నిరాశ నిస్పృహల్లో
అసహనపు ఆనవాలు ఉక్రోషపు జీరలు ద్యోతకమయ్యాయి
అయోమయపు మజిలీతో ప్రశ్నార్థకమైన గమ్యం
అమ్మానాన్నల మీది బెంగ అంతర్లీనమై
జ్ఞాపకాల దొంతరలు ఊగిసలాడగా
భాష్పధారల నడుమ నీమది మౌనం దాల్చింది
తొలిచే మస్తిష్కంలో తలకెక్కని చదువులమ్మతో
భీతిల్లిన నీ వదనారవిందాన్ని చూస్తే…
మార్ధవమెరుగని మది సైతం ఆర్ద్రం అవుతుంది కన్నా!
అలసిన నీ చిన్ని బుర్రను తట్టి లేపిన ‘సెలవుల’ పండుగతో
ఎగసిపడిన ఆనందం అలలై పొంగిన తీరు…
నీ ప్రియనేస్తం చెరవాణిలో చేసిన సంభాషణలో
అర క్షణపు ఆలస్యాన్ని సైతం భరించలేని నీ భావోద్వేగం!
భాషలోని యాసతో చిరుహాసం మెదలినా
నీ గొంతులోని ప్రకంపనలకు ప్రతి కన్ను చెమరును చిన్నా!
చిట్టి తండ్రీ అమ్మానాన్నలంతా కఠినాత్మలు కారు
అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఆరాటం
నీ భవితకు సోపానం వేయాలనే తపన మాత్రమే –
నువ్వు ఎదిగి మేలిమి ముత్యమై వారికి వన్నె తేవాలి
కానీ కన్నా… పెరిగినాన్నయ్యాక నీ చిన్నారిని మాత్రం
హాస్టల్లో చిట్టి తండ్రిని చేయవు కదూ!