వలస పోతున్న స్వర్ణకారులు

ఎం.వి.ఉమాదేవి

అనాదిగా నాగరికత అభివృద్ధికి అనేక కులవృత్తులవారు ,తమ హస్తకళా నైపుణ్యం తో దోహదం చేస్తూ.. తద్వారా ఉపాధి పొందుతున్నారు. అట్టివారిలో స్వర్ణ కారులు విశ్వ బ్రాహ్మణ వంశీయులు స్వర్ణాభరణాల తయారీలో సమాజంలో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటూ తమ సేవలు అందిస్తూన్నారు. సంస్కృతి, సంప్రదాయం కొనసాగింపుగా అనేక రకాల ఆచారాలు ఇప్పటికీ నిలిచి ఉండడంలో కుల వృత్తుల పాత్ర ఎంతో ఉంది. చెవిపోగులు కుట్టించే పద్ధతి నుండీ, పెళ్లి సందర్బంగా మెట్టెలు, మంగళ సూత్రాలు, కుటుంబం తాహతుని బట్టి వివిధ రకాల ఆభరణాల తయారీలో వీరు ఎంతో ఓర్పుగా, అద్భుతమైన కళాకృతులు రూపొందిస్తున్నారు.

అతి సూక్ష్మమైన కొన్ని మిల్లి గ్రాములతో కూడా కళా ఖండాలు కొన్ని రోజులపాటు కృషి చేసి రూపొందించి రికార్డు లు సృష్టించగలరు. అలాగే దేవాలయ వర్గాలకు వెండి స్వర్ణ ఆభరణాలు, వాహనాలు దేవతల హస్తంలోని ఆయుధాలు, తొడుగులు వంటివి పురాతన కళాకృతులతో పద్మాలు, చిలుక, నెమలి,లతలు మకర తోరణం వంటివి అద్భుతమైన విధంగా రూపుదిద్దుతున్నారు. దేవతలు ధరించే కిరీటాలు సైతం నవ రత్నాలు, కేవలం వజ్రాలతో పొదిగినవి కూడా ధార్మికుల, సంపన్నుల మొక్కు తీర్చుకునేలా ఈ స్వర్ణ కారుల చేతిలో అపురూపంగా తయారవుతున్నాయి. కొన్ని రసాయనాలు వాడుతూ చిన్న పిల్లలు, తమ వారసులు కూడా ఈ రంగంలో ఉండడం ఇష్టం లేక, వారిని చదివించడానికి మొగ్గు చూపుతున్నారు.
ఇటువంటి కళాకారులు నేడు రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో, సరైన పనులు లేక, వీరు పనిచేసే సంస్థల, దుకాణాల మూతతో పూట గడవడం కష్టంగా బాధపడుతున్నారు. పిల్లలచదువులు ఆగిపోతున్నవి. ఉపాధి దొరికే చోటుకి వలస పోవడం జరుగుతుంది. ఉన్న ఊరు వదిలి వెళ్లేది ఇష్టం లేకున్నా, వేరే సంపాదన మార్గము ఏమి లేక కొందరు తమ వృత్తి వదిలేసి, కార్ఖానాలో దినసరి కూలీలుగా పనిచేయడం మేలనే ధోరణి కనిపించడం విచారకరం.ఇతర వస్తువుల అవసరం ఎక్కువ గా ఉంటుంది కానీ వెండి బంగారు వస్తువులు తరచుగా కొనేవాళ్ళు అతి సంపన్నులు మాత్రమే. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అసలు ఇప్పుడు అవసరంలేదనే మధ్య తరగతి అభిప్రాయం.
ఇదే అదనుగా పెద్ద కంపెనీలు అతి తక్కువ కూలి చెల్లిస్తూ వీరి నైపుణ్యం తమ వ్యాపారం లో ప్రత్యేక ఆకర్షణ గా అధిక లాభాలు ఆర్జిస్తూన్నారు.
ప్రభుత్వం వారు వీరి ఇబ్బందులు అర్ధం చేసుకొని, తగిన ఆర్థిక సహాయం, సొంత ఇల్లు,పిల్లల విద్యాభ్యాసం లో, పెళ్లిళ్ల సందర్బంగా సహాయం చేయాలి.భారతీయ ఆభరణాల తయారీలో ప్రఖ్యాతిని కోల్పోకుండా చేయూత ఇవ్వాలి.
********

Written by Mv Umadevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

అంతరంగ వారధులు