లక్ష్మీదేవి కనబడితే

దీపావళి రాబోతున్నది. లక్ష్మపూజ చేసుకోవాలి. బంగారం షాపు వెళ్లి ఏదయినా బంగారం కొనాలి అన్నది భార్య అన్నపూర్ణ మొగుడితో. నీకా బంగారం, అమ్మవారికా, ఎగతాళిగా అన్నాడు శివరాం. ఎవరో ఒకరికి, మూతి తిప్పుతూ అన్నది భార్యామణి.   ప్రతి ఏడు కొంటూనే ఉన్నావు. అమ్మవారికి పెడుతూనే ఉన్నాు. ఇంతకీ అమ్మవారు నీకేమయినా బంగారం ఇస్తున్నాదా అన్నాడు. ఇస్తున్నదో లేదో నేనేమీ కలలు కనను అన్నది అన్నపూర్ణ. కలలు కనవే ఈ రాత్రికి. ఎలాగూ కుంభకర్ణుడి లాగా నిద్రపోతావు కదా అన్నాడు శివరాం. అమ్మవారిని తలచుకుని, తల్లీ ఈ రాత్రికి నాకు కనబడు, నేను నిన్ను కొన్ని కోరికలు కోరతాను. తీర్చుతల్లీ అని దణ్ణం పెట్టుకుని పడుకోవే అన్నాడు. అలాగే అడుగుతాలే, మీరు మాత్రం తక్కువగా నిద్రపోతారా? కుంభకర్ణుడిని మించి మరీ నిద్రపోతారు. కలలు కంటూ, అరుస్తూ, మంచం మీద నుంచి క్రింద పడుతూ మీరు కల గని అడగండి దేవిని వరాలు అన్నది. అక్కడే ఉన్న మనవడితో, ఒరేయ్ నానీ నీవు కూడా అడగరా అమ్మవారిని, నీవు కోరిన వరాలు ఇవ్వమమని అని చెప్పింది. సరే అన్నాడు వాడు.

సరే రేపు అందరం కూర్చుని, దేవి ఎవరికి కనబడిందో, ఏమి వరాలు ఇచ్చిందో చెప్పుకుందాం అన్నది. ముగ్గురూ సరే అనుకున్నారు.

ఆ రాత్రికి వీళ్ళను పరీక్షించటానికి అన్నట్లుగ, అనుకోకుండా అందరికి గాఢ నిద్రపట్టింది. అందరికి ఆ గాఢ నిద్రలోనే అమ్మవారు కూడా కనబడింది. ముందుగా శివరాంగారికి కనబడింది. ఆయన స్థాణువై పోయి, నిద్రలోనే లేచి కూర్చుని చేతులు జోడించాడు.

ఏం కావాలి శివరాం నీకు అన్నది మాత. తల్లీ నాకు మంత్రిని కావాలని ఉన్నది, ఆ పదవి ఇప్పించుతల్లీ అన్నాడు. వచ్చే ఎని్నకలలో పోటీ చేసి గెలిచి మంత్రిని కావాలని ఉంది అన్నారు.

అది ఎలా కుదురుతుంది నాయనా, ఇప్పటికే నీ మీద చాలా అవినీతి కేసులు ఉన్నాయి కదా, ఎలా సాధ్యము ,  నీ కోరిక తీర్చటం అన్నది. ఏదో ఒకటి చేసి నన్ను మంత్రిని చేయమ్మా వేడుకున్నాడు శివరాం. కుదరదు నాయనా! అంటూ అదృశ్యమయింది లక్ష్మీదేవి.

ఇంతలోనే అన్నపూర్ణమ్మ ముందు ప్రత్యక్షమయింది. ఆమె నిద్రలోనే ఉలిక్కిపడి లేచి, కూర్చుని మంగళ సూత్రాలు కళ్ళ కద్దుకొని, నమస్కారం చేసింది దేవికి. అమ్మా, అన్నపూర్ణమ్మా, నీ కోరిక ఏమిటి అన్నది దేవి. తల్లీ నాకు నా చిన్న కొడుకు భార్యకు పురుడు పోసి, మనవడిని పెంచాలని ఉందమ్మా. వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా. అందుకని నేను వెళ్ళి సాయం చేయాలని ఉంది. అదీగాక నా కోడలుకు మగపిల్లవాడే పుడతాడని డాక్టర్లు చెప్పారట. అందుకని వంశాంకురాన్ని జాగ్రత్తగా చూసుకొని, పెంచి, రావాలని ఉందమ్మా అన్నది. ఇంకా ఎంతమందిని పెంచుతావు, అన్నపూర్ణా. నీ పిల్లలను పెంచి పెద్ద చేశావు, చాలదా. ఇప్పటికే ఒక మనవడిని, మనవరాలను పెంచావు. చాలదా.  నీ జీవితం అంతా ఇలాగే పిల్లలను, పెంచుతూనే సరిపెట్టుకుంటావా? నీకేమీ ఇతర వ్యాపకాలు లేవా? నీ పిల్లలు పెద్దవాళ్ళే కదా. వాళ్ల పిల్లలను వాళ్ళు పెంచుకుంటారులే. ఎన్నో సౌకర్యాలు వచ్చాయి కదా ఇప్పుడు. నేను తీర్చను నీ కోరిక, అని అదృశ్యమయింది.

ఆ తరువాత దేవి మనుమడిని తట్టి లేపింది. ఆ సుందర రూపము ఆ తేజస్సు చూసి విస్తుబోయి కాళ్ళ మీద పడ్డాడువాడు. నీ కోరిక ఏమిటి నాయనా అన్నది. నాకు బోలెడు చాక్ లెట్సు, ఒక స్మార్ట్ ఫోను కావాలి అమ్మా అన్నాడు వాడు. ఇంత చిన్న కోరికా? ఇంకా పెద్ద కోరిక అడుగు అన్నది దేవి.

అమ్మా, నాకు మంచి చదువు, మంచి బుద్ధి, జ్ఞానము ఇవ్వు తల్లీ అన్నాడు. ఇస్తాను. సరే కాని నీవు మంచి చదువు చదివి అమెరికా వెళ్లి, పెద్ద ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడతావా? ఇక్కడ ఈ దేశంలో ఏమున్నది అని అన్నది దేవి నవ్వుతూ.

నేను ఎందుకు వెళతాను తల్లీ అమెరికాకు అన్నాడు వాడు.

డబ్బు చాలా సంపాయించటానికి అన్నది దేవి.

ఇంకా డబ్బులు ఎందుకు? మా నాన్నగారు అమెరికాలో కోట్లు సంపాయిస్తున్నారు. మా అమ్మ కూడా సంపాయిస్తున్నది. నన్ను ఇక్కడ వదిలేశారు. మా తాతకు కూడా చాలా పొలాలు , ఇళ్ళు, భూములు ఉన్నాయి. ఇవన్నీ నాకు ఇస్తారు కదా. ఇంకా నేను ఎందుకు కష్టపడాలి అన్నాడు.

ఓరి, నీ తెలివి ఎంత గొప్పగా ఉందిరా. ఎంత ముందు చూపురా నీది. ఈ కాలం పిల్లల తెలివి,ి ఆలోచనా శక్తికి నిర్ఘాంతపోయింది. ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే, నేను మీకేమి బహుమతి ఇవ్వమంటారు అని అడిగాడు నాని.

నాక ఏమీ వద్దు నాయనా. నాకు అన్నీ ఉన్నాయి. నీవు అడిగిన  చదువు, మంచి బుద్ధి, జ్ఞానము, చాక్ లెట్లు, స్మార్ట్ ఫోన్ వగైరా వగైరా అన్నీ ఇస్తాను. బాగా చదివి ప్రయోజకుడవై, తాతను, అమ్మమ్మను, అమ్మ, నాన్నలను కనిపెట్టుకుని ఉండి, వారి ముసలితనంలో వారిని ప్రేమగా చూసుకుంటూ, మంచి పేరు తెచ్చుకో. మరకమాట – నీవు పెద్దయినాక ఉద్యోగము చేయకుండా, తాతలు, తండ్రులు సంపాయించిన ఆస్థితో జీవితం గడపకు. ప్రతిమనిషి కష్టపడాలి, ఏదో ఒక ఉద్యోగం చేయాలి. సమాజానికి పనికి వచ్చే పౌరుడిగా ఉండాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. నీకు డబ్బు ఎక్కువ అయితే పేదవాళ్ళకు సహాయం చేయాలి ఆ డబ్బుతో. వారి కోసం, ఆసుపత్రులు స్కూళ్ళు, వృద్ధాశ్రమాలు, ఎన్నయినా కట్టించవచ్చు. అంతేగాని ఉద్యోగం చేయకుండా, సోమరిగా ఉండవాకు అని చెప్పి అదృశ్యమయిపోయింది.

మరునాడు ముగ్గురు కలుసుకున్నప్పుడు నాని సంతోషంగా ఇదంతా వాళ్ళకు చెప్పాడు. ఓ అమ్మో, ఈ కాలం పిల్లలకు ఎంత తెలివి. మనం ఎంత కష్టపడి సంపాయించాం. అందుకే  అన్నారేమో సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అన్నాడు శివరాం. అయినా మనకు కూడా బుద్ధి లేదు లెండి, అవసరానికి మించి ఒళ్లు హూనం చేసుకుని ఇంత ఎందుకు సంపాయించాం అన్నది అన్నపూర్ణ. నిజమేనే.  తిండి లేకుండా, నిద్రలేకుండా వేళకు, పిల్లల ముద్దు ముచ్చట్లు చూడకుండా ఎందుకు. అంత కష్టపడ్డాను నేను.  ఎన్ని ఇళ్ళు కొన్నాను, ఎన్ని స్థలాలు కొన్నాను, ఎన్ని పొలాలు కొన్నాను, ఎన్ని కార్లు కొన్నాను అన్నాడు శివరాం. నేనూ అంతేగా అన్నది అన్నపూర్ణ.

ఇప్పుడు మన పిల్లలు కూడా ఇదే పని చేస్తున్నారు కదండీ, ఏమిటో నిట్టూర్చింది అన్నపూర్ణ.

ఏదయితేనేమి, అందరికీ దేవి కనపడింది. నానిగాడికి మంచి హిత బోధ కూడా చేసింది. అదే ఆనందం మనకు అనుకున్నారు ఇద్దరూ.

   మాధవపెద్ది నాగలక్ష్మీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి చిత్రం

తరుణి చిత్రం