తరుణీయం

ధూళి వెనుక దీపం

               వేముగంటి శుక్తిమతి

కమలాభాసిస్ అనే ఆంగ్ల రైటర్ విద్య గురించి రాస్తూ అందులో ఒక సందర్భంలో
“ఆడపిల్లవు నీకు చదివెందుకు?” అని ఒక తండ్రి తన కూతురితో అన్నందుకు ఆ కూతురు దానికి సమాధానంగా తండ్రితో “నేను చదవాలి నాన్నా. ఎందుకంటావా? జీవితంలో నేను పోరాడాల్సిన యుద్ధాలను గెలవడానికి చదవాలి. ఆడపిల్ల చదవకూడదట అనే నాలోని నిస్పృహను పోరాడటానికి, నన్ను నేను ప్రోత్సహించు కోవడానికి నేను చదవాలి. ఒక మంచి దృఢమైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవడం కోసం నేను చదవాలి.స్త్రీ వాదన గీతాలు రాయడానికి నేను చదవాలి. నా ప్రపంచాన్ని నేను తయారు చేసుకోవడానికి నేను చదువుకోవాలి. నేను ఆడపిల్లను కనుక చదవాలి అని ఇలాంటి ఎన్నో సమాధానాలు చెప్తుంది. ఎప్పుడో ఎక్కడో చదివిన ఈ మాటలను దాదాపు సుప్రభాతం లాగా కంఠస్థం చేసుకొని రోజూ మననం చేసుకోవడం, మంత్రంలా ధ్యానించుకోవడం నాకు అలవాటయిపోయింది. ఎందుకంటే ఈ మాటలలో కోటి అర్థాలు నాకు వెతికే కొద్దీ దొరుకుతుంటాయి కనుక.
ఆ రోజులు వెళ్లిపోయాయి. ఆడపిల్లలు చదువుకోవడం మామూలైపోయింది. అంత మాత్రం చేత ఆ ప్రశ్న మారిపోయింది తప్ప మాయమై పోలేదు.
ఏ పని చేయాలన్నా స్వాతంత్రం కావాలి. మరి ఆడపిల్ల చదువుకోమన్నారు కానీ గడప దాటిన ఆడపిల్ల ఇల్లు చేరే దాకా భయమే. ఏ సుడిగాలి వీచి ఆ గాలి ధూళి వలయంలో ఏ విరిసీ విరియని పుష్పం దుమ్ము కొట్టుకుపోతుందోనని.
రోజురోజుకు కనీవినీ ఎరుగని, ఊహించలేని అఘాయిత్యాలు, అత్యాచారాలు ఉద్యోగస్తులైన మహిళలపైన, ప్రయాణం చేస్తున్న వాహనాలలో, ఆఫీసులలో, క్లబ్లలో, పబ్ లలో జరగటం వింటున్నప్పుడు ఆ తప్పును పాక్షికంగా చూసి ఎవరి అవగాహనను బట్టి వాళ్లు అనుకోవడం, వాదించుకోవడం, ప్రచారం చేయడం కూడా వింటున్నాం. ప్రతి ఈ సంఘటన వెనుక అరిటాకు సున్నితత్వాన్ని మర్చిపోయి దానికి కూడా కఠినత్వాన్ని ఆపాదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే ఏది ఎలా ఉన్నా మెచ్యూరిటీ ఉన్న టీనేజ్డ్, మిడిలేజ్డ్ స్త్రీలకు జరిగిన దారుణాలే మనసులను విఫలం చేస్తున్న పరిస్థితుల్లో ఈమధ్య ముక్కుపచ్చలారని పసికందులను, మొగ్గలను చిదిమి వేయడం సభ్య సమాజం తలవంచు కోవడమే కాదు గుండె పగిలి నేలకొరగాల్సిన పరిస్థితి. నాలుగేళ్ల, ఐదేళ్ల, పదేళ్ల పిల్లలను రేప్ చేయడమా? అదీ, విద్య నేర్పాల్సిన విద్యాలయాల్లో. ఎంత జుగుప్సాకరం. ఇది మనిషిని కాదు.సమాజాన్నే రేప్ చేయడం. మానవ సంస్కారాన్ని రేప్ చేయటం. ఇంకా చెప్పాలంటే మానవ జాతిని, నీతిని, నాగరికతను రేప్ చేయడం, ఆ మాటకు అర్థం నాశనం చేయడమే కదా.
చిన్నారులంటే జాతి సంపద. ఉత్సాహంగా ఉరుకులు పెట్టే రేపటి పౌరులు. రాబోయే సమాజానికి ఆశా జ్యోతులు.
చూడండి ఒక తల్లి ఆవేదన….
చిన్న తల్లీ.. నన్ను క్షమించు. అమ్మ నాన్న అనే పెద్దరికం తో నీ చిన్న వయసు ను, నీలోని పసి మనసును గురించి ఆలోచించక మూడు సంవత్సరాలు కూడా నిండని పసికందువైన నిన్ను లక్షల కొద్దీ డబ్బులు పోసి డొనేషన్లు కట్టి నిన్ను యాజమాన్యానికి పెట్టుబడిగా పెట్టి నీకు మానసిక ఎదుగుదల లేకుండా నీ బాల్యాన్ని, బాల్యంలో ఉండాల్సిన ఆటపాటలను, ఆనందాన్ని మొగ్గలోనే తుంచి తొక్కి పడేసి కార్పోరేట్ స్కూల్ అనే బందిఖానాలో బంధించినందుకు క్షమించు. నీలోని సృజనాత్మక శక్తిని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని మట్టు పెడుతున్నామని తెలిసి తెలిసీ, అప్పుడే నీకేదో పెద్ద చదువులు తప్పి పోయినట్టు, నువ్వు అప్పుడే ఏదో గొప్ప పదవులు చేపట్టలేదన్నట్టు వెర్రి ఆలోచనలతో నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసినందుకుక్షమించు.
ఆదమరచి హాయిగా నిశ్చింతగా నిద్ర పోనివ్వకుండా స్కూల్ టైం అయింది అంటూ కాసేపు పడుకుంటానమ్మా అని ఆవలిస్తూ కళ్ళు నడుచుకుంటున్న నిన్ను రెక్క పట్టి లాగిన నా నిర్దయత్వాన్ని క్షమించు తల్లీ.. త్వరగా బ్రష్ చేసుకొమ్మని, స్నానం చేయమని గబగబా తినాలని ..తాగాలని.. ప్రతి నిమిషం నా వయసు కొలమానంగా నీ బాల్యాన్ని మర్చిపోయి నానా కట్టుబాట్లతో నిన్ను చీల్చిచెండాడిన నా రాక్షసత్వాన్ని మన్నించమ్మా. సాయంత్రం ఇంటికి రాగానే దిగాలుగా ఉన్న నిన్ను ఏనాడూ గమనించక దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకోకపోగా మళ్లీ పొద్దటి పాఠాన్నే గణగణ గంట కొట్టి నట్టు బట్టలు మార్చుకోమని, హోంవర్క్ చేయమని, తొందరగా పడుకోవాలి అని ఏవేవో ఆజ్ఞ లు జారీ చేశాను కానీ స్కూల్ లో ఏం జరుగుతుందనికాని, నీ అలసటను కానీ, ఏదో చెప్పాలని చెప్పరాక మళ్లీ మళ్లీ ఏడుస్తున్న నిన్ను బడి ఎగ్గొట్టాలని ఏడుపా, హోంవర్క్ చేయలేదా అంటూ కసిరిస్తుంటే భయం భయంగా చూస్తూ కళ్ళ నీరు కారకుండా గుండెను తడుపు కున్న నిన్ను ఏనాడూ అర్థం చేసుకొని అక్కున చేర్చుకోనందుకు మాకేశిక్ష వేసినా తక్కువే తల్లీ.
బంగారు చిట్టితల్లీ. ఒంటి మీద ఉన్న నీ బట్టలను చూపుతూ ఏదో చెప్పబోయి చెప్పరా క బడికి పోనని ఓ మూల కూర్చుని ఏడుస్తుంటే నిర్లక్ష్యంగా స్పందించాను తప్ప నీ చిన్ని గుండెలో రగులుతున్న అగ్ని జ్వాలను చూడలేక పోయాను తల్లీ.
అమ్మ ఒడిలో నిదురించాల్సిన పసికందుకు ఇంత పెద్ద అన్యాయమా? విషయం తెలిశాక గుండె పగిలిపోతుంది. రక్తం గడ్డ కట్టుకు పోతుంది. సమాజమంతా లంకలోని రాక్షసుల్లా కనిపిస్తున్నారు. వద్దు తల్లి. ఈ చదువులు మనకొద్దు. నిన్ను కన్నానే తప్ప తల్లిని కాలేకపోయాను. నీ చిన్న చిన్న సంతోషాలలో భాగస్వామిని కాలేకపోయాను. నా చిట్టి తల్లి నన్ను క్షమించు. పిల్లలుా దేవుడూ చల్లని వారు. బడి గుడి లాంటిది. గుడిలోని దేవుళ్ళని మింగే ఈ వ్యవస్థ బ్రష్టు పట్టి పోతుంది. నామరూపాలు లేకుండా పోతుంది. లంకా దహనం జరుగుతుంది. ఈ పాపాలన్నింటినీ ప్రళయం అంతమొంది స్తుంది తప్పక. అప్పుడే బడికి పంపిస్తా. నిన్ను చదివిస్తా. అంతదాకా నన్ను క్షమించు.”
ఆడపిల్ల జీవితమే ప్రశ్నార్థక మా???
ఇది ఒక తల్లి ఆవేదన మాత్రమే కాదు. ప్రతి మాతృమూర్తి ఆవేదన.
ఇలాంటి భయంకరమైన సమస్యలను సులభంగా పరిగణిస్తున్నారంటే దుఃఖం, ఆశ్చర్యం కలుగుతున్నాయి.
అసలు పిల్లల్నిమూడేళ్ళు కూడా నిండనప్పుడే బడికి పంపుతున్నాం. ఇది పొరపాటు. ఆ వయసులో పిల్లలకు ఏది చేయవచ్చో, చేయరాదు ఏది అర్థం కాదు. 40,50 సంవత్సరాల క్రితం వరకు మనదేశంలో పిల్లలకు అయిదేళ్ల వయసులో అక్షరాభ్యాసం చేయించి బడికి పంపేవారు. ఈ మనపద్ధతి నేటికీ చాలా పాశ్చాత్య దేశాల్లో పాటిస్తున్నారు. మనం కూడా పాటిస్తే మంచిదేమో……..
అసలు జ్యోతులు వెలగాలంటే …..

One Comment

Leave a Reply
  1. అయిదేళ్ల వయస్సులోనే పిల్లలను పాఠశాలలకు పంపాలి. కానీ తల్లి తండ్రులకు కూడా ఆ సోయి లేకపోవడమే నేటి విషాదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆమె – అతడు -పండుగ

ఇంటి ఆడపడుచు