ఆమె – అతడు -పండుగ

            నెల్లుట్ల రమాదేవి

ఆమె :
పండుగ అనగానే గుండె దడదడలాడింది
బరువైన కళ్ళను బలవంతాన తెరచి
బడలిన శరీరాన్ని వంటింటి కీడ్చి
పనిలో మునిగింది

అతడు :
సెలవు రోజు కదా పనికి సెలవంటూ
విశ్రాంతిగా మరో గంట పడుకున్నాడు
మెలకువకీ మగతకీ మధ్య
మత్తుగా ఒత్తిగిలి మరింత దొర్లాడు

ఆమె :
పని వెంట పని
పని తరువాత పని
చెమట ముద్దయి చెదిరిన రూపమై
పని తోనే మమేకమై
వంటింట్లో కూరుకు పోయింది

అతడు :
పండుగ కదాని
ప్రత్యేక ఫలహారం కోరాడు
వంట ఆలస్యం అవుతుందని జాలితో …
మరో కాఫీ అడిగాడు

ఆమె :
అడిగినవన్నీ అందరికీ అందించే
పని యంత్రమైంది
శ్రమ మంత్రమైంది
వంటింటి సామ్రాజ్య యుద్ధ తంత్రమైంది

అతడు :
టీవీలో ప్రత్యేక కార్యక్రమాలు ఆస్వాదించాడు
ముఖ పుస్తకంలో కాసేపు మునకలేశాడు
వాట్సాప్ లో అభినందనలు అందించాడు
ఆనక ఆకలితో కాలుగాలిన పిల్లిలా తిరిగాడు

ఆమె :
ముగ్గులతో వాకిలి అద్దింది
అదనపు అలంకరణలతో ఇంటిని దిద్దింది
పిండి వంటలతో వడ్డనలు చేసింది
ప్రత్యేక నైవేద్యాలు సమర్పించింది

అతడు :
భోజనాల వేళ మించిందని సూచించాడు
మరో రెండు వంటలుంటే సాంప్రదాయం కాపాడేవాళ్ళం
కదాని ఆశించాడు
అయినా ఫర్వాలేదని సర్దుకుని
సానుభూతి చూపించాడు

ఆమె :
హమ్మయ్య అంటూ నిశ్వసించింది ఆనాటికి సంపూర్ణ గృహిణీత్వ ధర్మాన్ని నిర్వర్తించానని విశ్వసించింది
మళ్ళీ సిలబస్ అంశాలు కొనసాగించింది

అతడు :
పండుగ కదా సాయంత్రం అలా వెళదామా అని మాటవరస మర్యాద చూపించాడు
రానందేమో -మీ ఆడవాళ్ళింతే
ఎంత ప్రోత్సహించినా వంటిల్లు
వదలరంతే అని ముద్దుగా విసుక్కున్నాడు

ఆ రాత్రి :
ఆమె పెయిన్ బామ్ రాసుకునీ
అతడు డైజిన్ మాత్ర వేసుకునీ
నిద్రకు ఉపక్రమించారు

Written by Nellutla Ramadevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మార్పు అవసరమే….!

తరుణీయం