కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభా, క్షమయా ధరిత్రీ అన్న శ్లోకం అందరూ వినే వుంటారు. పనిలో దాసిగా, సలహాలు ఇవ్వడంలో మంత్రిగా,భోజనం పెట్టడంలో తల్లిగా, అందం లో లక్ష్మిగా, పడక గదిలో రంభగా, క్షమించడంలో భూమాతగా ఆడది ఉండాలి అని చెప్పారు మన పూర్వీకులు. ఈ శ్లోకాన్ని సూక్ష్మంగా పరిశీలించి చూస్తే ఇందులో ఆడపిల్లలు మెలగవలసిన ప్రవర్తనను, వారి వ్యక్తిత్వంలో ఇముడ్చుకోవాల్సిన గుణగణాలనే చెప్పారు తప్ప తరతరాలపాటు మగవారికి దాసిగానే ఉండిపొమ్మని కానీ, ఆశలను, కోరికలను, ఆత్మ అభిమానాన్ని చంపుకుని ఊడిగం చేయమని మాత్రం వారి అంతరార్థం కాదు. రోజూ మన ఇళ్ళల్లో చూస్తున్న, జరుగుతున్న విషయాలే అయినప్పటికీ మనం పెద్దగా పట్టించుకోము. మన ఇంట్లో ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు ఉన్నారనుకోండి ఆడపిల్లకు 5-6 ఏళ్లు వచ్చేటప్పుడే ఆమెకు జాగ్రత్తలు చెప్పడం, తెలియకుండానే ఆంక్షలు విధించడం మొదలుపెట్టేస్తుంటాం. అది ఎందుకు అంటే సమాధానం లేదు. తల్లి అయితే మరి ఎక్కువగా చొరవ తీసుకుని మెల్ల మెల్లగా ఇంటి పనులను అలవాటు చేయడం మొదలు పెట్టేస్తుంది. అప్పటి రోజుల్లో అయితే ప్రతి ఆడపిల్లకు వంట వార్పు ప్రతి ఒక్కటి చిన్న వయసులోనే అలవాటైపోయేది. కానీ కాలం మారింది కదూ…. కాదు కాదు మనమే చాలా ముందుకు వెళ్లిపోయాం… అవును అప్పట్లో ఆడపిల్లలకు పెద్ద చదువులు చదువుకునే వీలును కల్పించే వాళ్ళు కాదు వాళ్ల తల్లిదండ్రులు. కనుక వాళ్ళు ఇంటికే పరిమితమై కుటుంబాన్ని ఉద్ధరించే బాధ్యతను తీసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం అలా ఉందా చెప్పండి. ఆడ మగ అన్న వివక్ష లేదు ప్రతి ఒక్కరు విద్యావంతులే. ఉద్యోగాలను చేస్తూ వారితో సమానంగా సంపాదిస్తూ, ఉన్నత శిఖరాగ్రాలను అందుకుంటున్నారు.
ఇప్పటికి కూడా ఆడపిల్లలను దాసిగానే పరిగణించే కుటుంబాలు లేవనుకుంటే మాత్రం అది మన భ్రమ మాత్రమే. ఇక్కడ స్వార్థం ఎలా పెరిగిందంటే ఆడపిల్ల ఉద్యోగం చేయాలి ఎందుకంటే బాగా చదువుకుంది కదా ఉద్యోగం చేస్తే తప్పేంటి అని సహకారాన్ని అందిస్తున్నారని ఓ పక్క సంతోషమే కానీ ఇంటి పని కూడా చేసి తీరాల్సిందే ఎందుకంటే బాధ్యత అని నొక్కి వక్కాడించే వాళ్ళు లేకపోలేదు.
అయితే ఇక్కడ నాదొక ప్రశ్న? ఏం మగవాడు అయితే ఇంటి పనులు చేయకూడదా? చేయకూడదని ఎక్కడైనా రాసిపెట్టి ఉందా? అంతా తెలిసినా ఏమి చేయలేని అసమర్థులమని సరి పెట్టుకోవడం తప్ప మరి సమాధానం లేదు రాదు అని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మార్పు మెల్లగా మొదలైంది అన్న విషయాన్ని ఈ మధ్యనే ఓ సంఘటన ద్వారా తెలుసుకున్నాను. నేను గతవారం మా ఎదురింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు ఎవరో అనుకుని నేను వెళ్ళగానే కంగారుగా ఫోన్ దాచేసింది.
నువ్వా రా అమ్మ మీ అంకుల్ వస్తున్నారో లేదో చూసి నాకు కొంచెం చెప్పు అంటూ నన్ను తలుపు దగ్గరే నిల్చబెట్టేసింది.
ఫోన్లో, పని చేస్తే తప్పేముందిరా
పాపం ఆ అమ్మాయి మాత్రం నీలాగే ఆఫీస్ కి వెళ్లి పని చేసి రావడం లేదా, ఎన్ని పనులని చేస్తుంది తను, తను నీలాగే అలసిపోతుంది కదా
కనీసం అది అర్థం చేసుకోకుండా నా కోడలితో ఏంటి రా నీకు అని గట్టిగ దబాయిస్తుంది. నిజంగానే ఖంగు తిన్నాను. కోడలు అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ ఎత్తిచూపే అత్తలయితే వున్నారు కానీ, కోడల్ని సమర్థిస్తూ కొడుకులకు బుద్ధి చెప్పే అత్తలు ఉన్నారా అని ఒకంత ఆశ్చర్యం కూడా వేసింది. ఇలా ఫోన్లో చాలాసేపు వాళ్ళ కొడుకుకి నచ్చ చెప్పి ఫోన్ పెట్టేసి నీ అంకుల్ ఏం రాలేదు కదూ హమ్మయ్య అంది నాతో… అంకుల్ ఉంటే భయం ఏంటి ఆంటీ అని నేను అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం వినగానే నా మతి పోయింది. మీ అంకుల్ కి ఆడవాళ్లే పనిచేయాలమ్మ అది వాళ్ళ జన్మతః హక్కుగా మాట్లాడుతాడు నేను మా వాడితో మాట్లాడేది గాని విన్నాడనుకో మగవాడేంటి పనిచేసేది అంటూ వాడిని సమర్థించి మరికొంత చెడగొడతాడు. అందుకే ఆయన లేనప్పుడు ఇలా ఫోన్ చేసి వాడికి బుద్ధి చెప్తూ ఉంటాను అని నవ్వి అయినా మనవాడికి మనం కాకపోతే ఎవరు చెప్పాలమ్మ ఉద్యోగం చేసే అమ్మాయిని, ఇంటి పనులు కూడా మొత్తం నువ్వే చేయాలంటూ అజమాయిస్తూ చేయించడం తప్పు. ఆ విషయంలో కోడలైనా, కూతురైనా ఒక్కటే అంది. మీ అంకుల్ ని ఎలాగో మార్చలేకపోయాను కనీసం నా కొడుకు నయినా మార్చే ప్రయత్నం చేస్తాను.
నువ్వు మాత్రం నీ పిల్లలకి
అది ఆడపిల్లైనా, మగ పిల్లవాడైనా ఇంటి పనులు చేయడం చిన్నతనం నుంచి అలవాటు చెయ్. అప్పుడే వారు పెద్దయ్యాక ఇలా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ తో స్వార్థపరులుగా మారకుండా వుంటారు అని నాకు సలహా ఇచ్చింది.
మా ఎదురింటి ఆంటీ అయితే మారారు…. మరి మార్పు మీలో ఎప్పుడు మొదలయ్యేది… తప్పక మారతారని ఆశిస్తూ….