బంద్

మాధవపెద్ది నాగలక్ష్మి

రేపు రాష్ర్ట బంద్. అందరు కార్యకర్తలు తరలి రావాలి. భారీగా తరలివచ్చి సమ్మెలో పాల్గొనాలి. అందరూ అధికార పార్టీల ఆగడాలను, అవినీతిని ఎండగట్టాలి, పిలుపు ఇచ్చింది ప్రతిపక్ష పార్టీ.

జనం అందరూ వేలల్లో వచ్చారు బందంలో పాల్గొనటానికి. ఇంతమంది కన్నా జనాలు రావటానికి వీలు కాదని ప్రభుత్వం రూలం పెట్టదు. సమ్మె చేద్దామనుకున్న నాయకులు అసలు చెప్పరు. వాళ్లకు ఎంత జనం వస్తే అంత గొప్ప. తమ పార్టీలు బలంగా ఉందని, సరే వస్తున్నారు. వస్తున్నవారి చేతిలో పెట్రోలు డబ్బాలు, కిరసనాయిలు, అగ్గిపెట్టెలు, త్రాళ్లు, మారణాయుధాలు వగైరా వగైరా ఉన్నాయేమోనని ఎవరూ సరిగా తనిఖీ చేయరు. ఏదో పైపైన చేసి ఊరుకుంటారు. అయినా ఎన్నివేలమందిని తనిఖీ చేయగలరు? సమ్మె మొదలవంగానే వేలమంది పోలీసులు ప్రత్యక్షం. కార్యకర్తలు రాళ్లమీద రాళ్ళతో దాడి. పోలీసులు వాళ్లమీద లాఠీ ఛార్జీలు. లొంగకపోతే టియర్ గాస్ ప్రయోగం, వగైరా వగైరా… ప్రభుత్వ బస్సులు తగలబెట్టడం, రైళ్ళు తగలబెట్టడం, భవనాలమీద రాళ్లు వేయడం, భవనాలు ముట్టడించడం, ఏమిటి ఇదంతా.

ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు నష్టమవుతుంటే ప్రభుత్వం ఏమి చోద్యం చూస్తున్నది. 70 ఏళ్ళుగా ఈ తమాషా చూస్తున్నాయి ప్రభుత్వాలు. ఎవరైనా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఆ పార్టీ నాయకులకు ఐదు ఏళ్ళ జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా అని రూలు చేస్తే బాగుంటుంది కదా. అప్పుడు ఆ పార్టీ నాయకులు తన కార్యకర్తలను అదుపులో ఉంచుకోడా? ముందు నుంచి వాళ్లకు క్రమశిక్ష ఇవ్వడా?

ఇంతకీ ఈ నాయకులు ఎక్కడ.  ఎక్కడో కార్యకర్తల మధ్య పోలీసుల రక్ష వలయంలో, ముందు ఉండేది ఈ కార్యకర్తలే. చావు దెబ్బలు తినేదివారే. కాళ్ళు, చేతులు విరిగి, తలలకు దెబ్బలు తగిలి ఆసుపత్రులలో చేరతారు. మరునాడు నాయకులు వెళ్ళి ఆసుపత్రిలో వారిని పరామర్శిస్తారు. మీకు అండగా ఉంటామని చెపుతారు. ఆ దరిద్ర నారాయణులు మురిసిపోతారు. నాయకులతో ఫోటోలు దిగుతారు.  ఆ తరువాత వాళ్ల ఖర్మ ఏమిటి? పనులు చేసుకునే ఓపిక ఉండదు. వారి పార్టీలు అధికారంలోకి రాకపోతే వీళ్లకు పుట్టగతులు ఉండవు. డబ్బు ఉండదు – కూలి, నాలి చేసుకుని బ్రతుకుదామనుకుంటే అనారోగ్య బాధ.

ఏదో కూలినాలి చేసుకుని బ్రతికే వాళ్లకు డబ్బు ఎర చూపించి లారీలు ఎక్కించి మరీ సభలకు తీసుకు వస్తారు, ఎలక్షన్ల సమయంలో, ఆందోళనల సమయంలో, ఏమిటి ఇదంతా. సమ్మె మొదలవంగానే, జనం బాగా చేరి, ఊపు అందుకోగానే, ఒకడు పెట్రోలు పోసుకుని కాల్చుకుంటాడు. చుట్టూ ఉన్న జనం ఏం చేస్తున్నారో తెలియదు. చోద్యం చూస్తుంటారు. సగం మనిషి కాలి నాక అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మంటలు ఆర్పి, ఆసుపత్రికి తీసికెళతారు. ఈ విపరీతాలకు కారణం సగం మన నాయకులే. ఈ మధ్య మన నాయకుల మాటలు వింటున్నారా? నా మీద అభాండం వేస్తే నీ అంతం చూస్తా అని అని ఒక నాయకుడు, నేను తప్పు చేశానని ఋజువు చేస్తే నడివీధిలో పెట్రోలు పోసుకుని కాల్చుకుంటూ అని మరొకరు, నేను అసత్యవాదిని అయితే గోదావరిలో దూకుతా అని మరొక నాయకుడు, మరొక గొప్ప నాయకుని పదజాలము, నేను అబద్ధమాడానని ఋజువు చేస్తే ఉరేసుకుంటా, నిరూపిఁచలేకపోతే ఆ తాడు నీ మెడనేసుకుంటావా. ఇవీ నాయకుల ప్రగల్భాలు. మధ్యలో దేవుడిని కూడా లాగుతారు. దేవుళ్ళమీద ప్రమాణాలు కూడా చేస్తారు. ఇవన్నీ విన్న నిరక్షర జనం మనసాయే, పెట్రోలం పోసుకుని చస్తానంటుంటే, మనం ఆపాటి చేయలేమా, మన సామి కోసం అనుకుంటారు. మరి వీరు చావుకు కారణం ఎవరు?  ఆ ఇంటి దీపాలను ఆర్పుతున్నదెవరు? నాయకులా, దరిద్రమా? నిరక్షరాస్యులా? పోలీసులా? ప్రభుత్వమా? అమాయకుల అజ్ఞానమా? ఆలోచించండి మేధావులందరు. మార్గము కనిపెట్టండి.

అసలు నన్నడిగితే గోల చేసిన కార్యకర్తలను, అమాయకులను జైళ్ళలో పెట్టే బదులు ఆ కార్యకర్తల నాయకులకు లక్షలతో జరిమానా విధించి, జైలు శిక్షలు కూడా ప్రకటించేటట్లుగా, ప్రభుత్వము రూల్ పాస్ చేస్తే నాయకులు తమ కార్యకర్తలను అదుపులో పెట్టుకుంటారు కదా? అదీగాక నాయకులు కావాలనువారికి బాగా విజ్ఞానము, బాగా చదువు వచ్చి తీరాలని రూల్ పెట్టాలి. అలాగే కార్యకర్తలుగా చేర్చుకునేవారికి పదవతరగతి పాసం సర్టిఫికెట్ అయినా ఉండాలి. అప్పుడు జనంలో విచక్షణా జ్ఞానం పెరుగుతుంది. హింసలు, ప్రభుత్వ ఆస్థినష్టాలు తగ్గుతాయి కదా. ఆలోచించండి అందరూ.

నాయకుడు కావాలనుకునే ప్రతి ఒక్కరు మన నెహ్రూగారిలాగా ఇందిరాగాంధీలాగ, పి.వి.నరసింహరావులాగా, ద్రౌపది ముర్ములాగా, వెంకయ్యనాయుడిగారి లాగ, విజ్ఞత, విద్య కలిగి ఉండాలి. అప్పుడే నాయకులు దేశాన్ని ముందుకు నడవగలరు. ఏమంటారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణీయం

ఎంత చెప్పినా తక్కువే