ఇన్నర్ రింగ్
ప్రశాంతంగా, హాయిగా సాగిపోతున్న జీవితంలో ఎవరికైనా, ఎప్పుడో ఒకప్పుడైనా అనుకోని సంఘటనలు తారసపడి కలవరపెడుతుంటాయి. కొంతమంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఆ క్షణాన్ని, ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలో తెలియక, తెలుసుకునే ప్రయత్నం చేయక బెంబేలెత్తి పోయి డిప్రెషన్ లేదా దీర్ఘ వ్యాధి ఇంకా కొంతమంది సూసైడ్ అటెమ్ట్ కు లోనై తొందరపాటుతో వివేచనను కోల్పోతుంటారు. జరిగిపోయిన దాని గురించి ‘ఇలా చేయలేదు, అలా చేస్తే బాగుండునేమో, ఇదంతా నా కర్మ, అయ్యో ఇలా జరిగిందే’ అంటూ వాటి చుట్టే తిరుగుతూ అసలు సొల్యూషన్ గురించి ఆలోచించరు.
ఒకసారి మా దూరపు బంధువుల ఇంటికి అనుకోకుండా వెళ్ళాను. ఇంట్లో ఉన్న పెద్ద మనిషి చాలా బాగా ఆదరించి ఎంతసేపటికీ వెళ్ళనివ్వలేదు. అసలు సంగతి వాళ్ల ఇంటి ప్రక్కనే ఉన్న రెవెన్యూ ఆఫీస్ లో పని ఉండడం వలన ఎలాగూ ఇంత దూరం వచ్చాను కదా అని వెళ్లడం జరిగింది. కానీ ఆ పెద్దావిడ పడుతున్న ఆరాటాన్ని, ఆపేక్షను చూసి ఖంగు తిన్నాను. సాయంకాలం దాకా నాతో కాలక్షేపం చేసిన ఆవిడ కాఫీ’ టిఫిన్ లతో సహా చిన్నపిల్లలా ఆమెనే అందిస్తూ ఉంటే’ ఇంట్లో ఎవరూ ఉండరా అమ్మా. మీరు ఒక్కరే ఒంటరిగా ఉంటారా?’ అని ప్రశ్నించాను. దానికి ఆవిడ మొహమంతా చిన్న పోయింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏదైనా అడగకూడనిది అడిగానా అని బాధపడ్డాను. కాసేపటికి ఆమె తనను తాను తమాయించుకుని ‘నా కొడుకు కోడలు ఇక్కడే ఉంటారమ్మా. కొడుకు ఆఫీస్ కి వెళ్ళాడు. కోడలికి ఉద్యోగం చేయాలని ఇష్టం. ఏవేవో పరీక్షలు రాస్తూనే ఉంది. కానీ దేంట్లో సెలెక్ట్ కావట్లేదు. ఆ మనో వ్యాధితో రోజురోజుకు కృశించి పోతుంది. వేళకు తినదు. నిద్ర సరిగా పోదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ నిరాసక్తతతో ఉంటుంది.
మాకేం డబ్బుల ఇబ్బంది లేదమ్మా. అంతో ఇంతో భూమి పుట్రా ఉన్నాయి. ఇది సొంత ఇల్లు. అబ్బాయికి మంచి ఉద్యోగం. నీకు జాబు లేకపోతే యేం. దొరికేనాడే దొరుకుతుంది. ఆరోగ్యం పాడైపోతుంది. అని ఎన్ని విధాల చెప్పినా అర్థం చేసుకోవటం లేదమ్మా. నాకు ఇప్పుడు అదే బాధ. గది నుండి బయటికి వెళ్లదు.’ అని ఆ పెద్దావిడ వేదనతో చెప్తుంటే చాలా కష్టమనిపించింది. చేసేదేమీలేక నిట్టూరుస్తూ వస్తానంటూ చెప్పి బయటి కి కదిలాను.బస్ లో కూర్చున్నంత సేపూ ఆ పెద్దావిడ మాటలు చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇది పడరాని కష్టం కాదు కదా. ఇంకా పిల్లలు కూడా కలగని ఈ వయసులో ఈ విధమైన డిప్రెషన్కు వెళ్లిపోతే ఇంకా ముందున్న చాలా జీవితాన్ని ఎలా గడపగలదు.
నా దృష్టిలో ఇది సమస్యనే కాదు. ఎందుకంటే ఇంతకంటే భయంకరమైన సమస్యలతో పోరాడుతూ విజయం పొందిన వారిని కొంతమందిని చూశాను. ఇప్పుడే మీకు ఒక విషయం చెప్పాలి. మా వీధిలో రెండేళ్ల క్రితం ఒక ఫ్యామిలీ అద్దెకు దిగింది. భర్త పచ్చి తాగుబోతు. సంపాదన లేకపోగా ఈమె సంపాదించిన కొద్దో గొప్పో డబ్బును రోజూ కొట్టిీ, తిట్టి లాక్కెళ్లి తాగి వస్తాడు. పిల్లల గురించి గానీ, ఇంటి గురించి గానీ ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. ఆమె ఎంతో కష్టపడి పోగేసిన డబ్బును ఏ సమయంలోనో కాజేసిన రోజున ఇంకా తాగుతూ నానా హింసలు పెడ్తాడు. ఆమె కడుపునిండా తింటుందో తినదో, నిద్ర పోతుందో లేదో కానీ తెల్లవారితే ఏమీ జరగనట్టే మళ్ళీ తన పనికి తాను వెళ్తుంది. ఆమె ఏం పని చేస్తుందో ఎవరికీ తెలియదు. మా వీధిలో వాళ్ళందరూ ఆమెను ఆశ్చర్యంతో చూడటమే కాక తమ ఇండ్లలో ఉన్న చిన్న చిన్న బాధలను ఆమె కొండంత బాధతో పోల్చి గోరంత గా భావిస్తారు.
ఒకసారి నేను వెళ్తున్న దారిలో ఆమె కలవడం చాలాసేపు ఆమెతో నడవడం జరిగింది. ఇదే సమయం అనుకుని ‘మీరు అనుభవించే చిత్రవధ మాకందరికీ తెలుసునండీ. మీకు ఏ రకమైన సహాయమైనా చేయడానికి ఈ వీధి లోని వాళ్లందరము సిద్ధమే. ఇలా అంటున్నందుకు మీరు ఏమి అనుకోవద్దు’ అన్నాను.
‘అనుకోవడానికి ఏముందండీ. కానీ ఏదో ఒక రోజు ఒక అవసరానికి సహాయ పడతారు. కానీ ప్ర..తి.రోజు” ఆమె నవ్వుతూ అంది. ఆ నవ్వులో ఏ విధమైన నిరాశ లేదు. చాలా సహజంగా ఉంది.
ఇది జరిగాక ఆమెతో పరిచయం పెంచుకోవాలి అనిపించింది. అలా ఒకసారి ఆ ఇంటికే నేరుగా వెళ్ళాను. ఆమె ఇంట్లో విలువైన వస్తువులు లేనందుకు గాని, ఖరీదైన వాతావరణం లేనందుకుగాని ఆమె మొహంలో ఏ తొట్రు పాటు కనిపించలేదు. మాటల్లో వినిపించలేదు. ఆమెకున్న దాంట్లో చేసిన అతిధి మర్యాదకు లోటు రానివ్వలేదు.
‘మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందండి.!’ ఆపుకోలేక అన్నాను. దానికి ఆమె నవ్వుతూ మీరు అన్నీ తెలిసిన వాళ్ళు. చదువుకున్న వాళ్ళు. అవి నాకు లేకున్నా నా జీవితమే నాకు ఎలా బతకాలనే చదువు చెప్పింది. మన ముందున్న మురికి గుంట ఉన్న పరిధిని బట్టి మన అడుగు ఉండాలని. మనకు కలిగిన ఇబ్బంది పెట్టే బాధకంటేఎత్తుగా మనం ఎదగాలని. ఒక్కొక్క కష్టం మనిషి మనసు ను ఇంకా బలిష్టంగా చేయాలని. మరి జీవితం ఇంకా ముందు ఎంతో ఉంది కదా. పిల్లల్ని బతికించుకోవాలి కదా. వాళ్లకు కష్టం విలువ తెలుపుకోవాలి కదా.” అంది నిత్య సత్యాలను.
“మీరు నా కోసం ఇంతగా బాధ పడుతున్నందుకు కృతజ్ఞతలు.” అని జోడించిన రెండు చేతులను నేనుగట్టిగా పట్టుకొని “నిజం చెప్తున్నాను. నేను ఇప్పటివరకు చదువుకున్న చదువులేవీ నన్నింతగా కదిలించలేదు. మీ మాటలు విన్నంతసేపు ఆగిపోకు. ముందుకు సాగిపో’ అని ప్రోత్సహిస్తున్నాయి. మీకే నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అని అంటుంటే
ఆమె చెప్పడం మొదలు పెట్టింది.” నేను కూడా చదువుకున్నాను. ఉద్యోగం కూడా దొరికింది. కానీ నా భర్త వట్టి అనుమానస్తుడు. ఇంటికి రాగానే నరకం చూపేవాడు. అందుకని మానేశాను. ఆయనకు ముందు నుండి ఉన్న తాగుడు అలవాటు నా కారణంగానే అంటూ నెపం వేశాడు. చూసిన వాళ్లందరికీ అబద్ధాన్ని నిజంగా పదే పదే చెప్పాడు. అది కాదు పోదు అని నేను చెప్పలేదు. దానికి కారణం అతని వాళ్ళు నేను ఏది చెప్పినా నమ్మరు. అందుకని ఇతనితో పాటు వాళ్లు కూడా నన్ను నిందించటం మొదలుపెట్టారు. నేను పడే నరకాన్ని వాళ్లు చిన్నదిగా చూస్తూ అతనిని ఎత్తు పై ఉంచారు. దానికి నేనేమీ చెప్పక పోవడమే నన్ను అంతకంటే ఎత్తుపై నిలబెట్ట గలిగింది.” నీవల్లే ఉద్యోగం చేయలేదంటూ’ తాగడం , తిరగడం
మొదలుపెట్టాడు. అది రోజు రోజుకు శృతి మించింది. అయినా నా ఉద్యోగం పోయిందనో, అతడు తాగుబోతు అయ్యా డనో, ఏమీ సంపాదించటం లేదనో బాధపడుతూ కూర్చుంటూ మరేదైనా సంపాదించు కోకపోతే ఇల్లు గడవడం కష్టం. అందుకే ధైర్యంగా ముందడుగు వేశాను. ఆ ఉద్యోగం మంచిది. ఇది తక్కువది అని ఆలోచించే సమయం లేదు. దాని వల్ల లాభం కూడా లేదు.
ఇవన్నీ నా జీవితంలో వచ్చిన రకరకాల మార్పులు. ఆ మార్పులన్నింటిని స్వాగతించాను. కొంచెం ఆలోచిస్తే అన్నీ పాఠాలు ప్రకృతే అందించింది. శిశిర ఋతువులో ఆకులు రాలుతాయి. వసంత రుతువులో మళ్లీ కొత్త చిగురులు వేస్తాయి. చెట్టు ఎండి పోయింది మళ్లీ చిగురించడానికే. గద్ద జీవితం మనకు తెలియనిది కాదు. దాని ఆయుః ప్రమాణం డెభైయ్యేళ్ళు. కానీ నలభై ఏళ్లకు దాని ముక్కు గట్టిపడి, రెక్కలు బరువెక్కిపోయి ఉంటాయి. అప్పుడది ఏ పర్వతం మీదకో వెళ్లి ముక్కును బండ మీద రాసి రాసి విరిగేలాచేసుకుంటుంది. అప్పుడు మళ్ళీ కొత్తగా ముక్కు వస్తుంది. దాన్ని పదును చేసుకొని రెక్కలన్నింటిని గోర్లతో
పీకేసుకుంటుంది. మళ్లీ కొత్త రెక్కలు వచ్చేస్తాయి. ఈ మార్పులన్నీ జరిగే వరకు ఓర్చు కుంటుంది ఎందుకంటే ఇంకా ముందు 30 ఏళ్ల జీవితం ఉంది కనుక. మరి ఆ పక్షి కి ఏపత్రికలో, యూట్యూబ్ ఛానల్సో, మోటివేటర్సో చెప్పలేదు కదా. అది ప్రకృతి పాఠమే. ఆ పాఠాలే నెమరు వేసుకుంటూ నా జీవితాన్ని ముందుకు నడుపు కోవాలి. ఎందుకంటే నాక్కూడా కొంత జీవితం ముందుంది. ఆమె నింపాదిగా చెప్తున్నా నా కళ్ళ వెంట నాకు తెలియకుండానే నీళ్లు కారిపోయాయి. జీవితమంటే అది. మనిషంటే ఆమే. ఆమె ఆత్మస్థైర్యం, ఆలోచనా విధానం, గంభీరత్వం ముందు నా డిగ్రీలు, హోదా, డబ్బు అన్నీ వెలవెల పోయాయి.
ఆమెను చూసిన మొదట్లోఆమె పట్ల నాకు కలిగిన సానుభూతి, జాలి స్థానంలో క్రమక్రమంగా ఆమె పట్ల గౌరవం, నాలో ధైర్యం, ప్రకృతి పట్ల అవగాహన, జీవితం పట్ల మాధుర్యం అన్ని చోటుచేసుకున్నాయి. నాకే కాదనుకుంటా. ఆ వీధిలోని వారందరికీ. ఆమెను చూసిన వాళ్లెందరికో.
__**__