సంతృప్తిని మించిన ఔషధం లేదు
మనిషికి సంతృప్తి సగం బలాన్నిస్తుందనడం అతిశయోక్తికాదు. సంతృప్తికి మించిన తీయటి వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కాని మనలో చాలామంది తమనీ, తమ ఆర్థిక పరిస్థితినీ తమ కన్నా సంపన్నులతో పోల్చి చూసుకుంటూ అసంతృప్తికి గురవుతుంటారు. అందుకే మనమెప్పుడూ కూడా మన కన్నా ఉన్నత స్థానంలో ఉన్నవారితో కాక మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారితో పోల్చుకుని వాళ్ల కన్నా మనమెంతో మెరుగ్గా ఉన్నామని సంతోషించాలని పెద్దలు చెప్పారు. మనలో చాలామందికి ఒక విధమైన పోటీ మనస్థత్వం ఉంటుంది. స్త్రీలుకాని పురుషులు కాని ఇందుకు మినహాయింపు కాదు. కొంతమంది ఆఫీసులో తమ కన్నా తక్కువైన జూనియర్ కి ప్రమోషన్ వచ్చిందనో లేక తమకు రావాల్సిన ప్రమోషన్ ఇంకొకరికి వచ్చిందనో తెగ ఫీలయిపోతూ అందుకు గానూ చేయవలసిన కృషి చేయకుండా పక్కదార్ల ద్వారా అంటే బాసను కాకా పట్టడం లాంటివి చేస్తూ ప్రమోషన్ పొందాలని చూస్తుంటారు. తమ ప్రయత్నాలు విఫలమయితే కృంగిపోతుంటారు. అంతేకాదు తమకు స్కూటర్, పక్కవాడికి కారు ఉంటే చిన్నతనంగా ఫీలయ్ పోయి ఎలాగైనా లోన్ తీసుకుని ఆ ఫలానా కారు కొంటారు. కొంతమంది భార్యలు కూడా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన స్తువులను కొనమని వారి వారి భర్తలను వేధిస్తుంటారు. ఇలా ఇంట్లో అర్థాంగి భరించలేక ఆ భర్తలు అప్పులు చేసి ఆ వస్తువులను కొనుగోలు చేసి ఆ అప్పును తీర్చలేక నానా అవస్థలు పడడం చూస్తూనే ఉంటాం. పక్కింటి మీనాక్షమ్మను చూశారా ! అనే సినిమా పాట కూడా ఇటువంటి వారిని చూసే కట్టారనిపిస్తుంది.
ఇకపోతే తమ స్తోమతని మించిన కోరికల విష వలయంలో చిక్కుకుని, వాటిని సంపాదించేందుకు అవినీతి మార్గాన్ని ఎన్నుకొనే పురుషులు కొందరైతే భార్య గొంతెమ్మ కోరికలను తీర్చటం కోసం అవినీతి మార్గంలో పయనించి జైలు పాలయ్యే పురుషులు మరికొందరు.
అందుకే ఇటువంటి గొంతెమ్మ కోరికలను పెంచి పోషించడం అతి ప్రమాదకరం అని తెలుసుకోవాలి. మనకున్న దానిలో సంతృప్తి బతకటం కూడా ఒక కళే.
దాన్ని మనమందరం పెంపొందించుకోవాలి. అసలు నిజానకి ఈ కోరికలకు అంతనేది లేదు. మనం ఆ కోరికల్ని తీర్చుకున్న కొద్దీ కొత్త కోరికలు ఇంకా ఇంకా కొత్త కోరికలు పుడ్తూనే ఉంటాయి. సముద్రం మీద ఎగిసిపడే కెరటాల వంటివి ఈ కోరికలు. ఇక ఈ కెరటం తీరం చేరింది కదా అనుకుంటే మరో కెరటం దాని వెన్నంటే ఉంటుంది ఎగుసి పడటానికి సిద్ధంగా!
అందుకే మహానుభావుడైన శ్రీ రామకృష్ణ పరమహంస. నీవు నీ చిల్లర కోరికలను తీర్చుకుని పెద్ద పెద్ద కోరికలు నీ తాహతుకు మించిన వాటిని వైరాగ్యంతో వదిలివేయి అని తన భక్తులకు చెప్పారు. ఆయన అన్న మాటలు అక్షరాల పాటించదగినవి. కోరికలకు కళ్లెం వేయడానికి అంతకన్నా వేరే మారం లేదు.
మరొక విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినదేమిటంటే తీరని కోరికల వల్ల ఉద్భవించే అసంతృప్తి మనిషిని మానసికంగా కృంగదీయటమేకాదు, శారీరకంగా కూడా అనారోగ్యానికి గురిచేస్తుంది. అందుకే మనం మానసికంగానూ, ఆ శారీరకంగానూ ఆరోగ్యంగా ఉండాలంటే అసంతృప్తిని దరిచేరనివ్వకూడదు. ఈ 10 రోజులలో ఎవరిని చూసినా బి.పి.లూ, షుగర్లతో బాధపడుతున్న వారే కనపడుతున్నారు. వీటినన్నిటికీ సంతృప్తిని మించిన ఔషధం లేదు. సంతృప్తితో ఈ జీవించేవారికి ఏ రోగాలు దరిచేరవు.