అందరి పాదాలకు రక్షణ కవచమై నిలుస్తూ
అలరించబడే ఓ పాదరక్షా! నిన్ను అవసరార్థం
ధరించేవారు కొందరైతే దర్పంగా భావించేవారు
ఇంకెందరో కదా! కరకు పాదాలకింద కర్కశంగా నలిగినా
సున్నిత పాదాలకు అందమైన అలంకారంగా బాసిల్లినా
తర తమ భేదాలెరుగక అందరి కాలిలో పొందికగా
ఒదిగుండే ఓ పాదరక్షా! రంగుల కలయికతో భిన్న ఆకృతులలో
అందంగా మలచి నీ కొక విలక్షణ స్థానమిచ్చిన ఆ చర్మకారుడెంత
కళాహృదయుడో కదా! ఆపద్భాంధవుడైన ఆ దాశరథి పాద పద్మాలలో
వినయంగా ఒదిగిన నీకు పట్టంగట్టి ప్రాభవం ఒసగిన ఆ భరతుడెంత
ధర్మాత్ముడో కదా! అరుదైన గౌరవంతో అలరారిన నీ జన్మ చరితార్థమాయె కదా