అలసిన గుండెకు ఆలంబనగా, ఆర్తితో ఎదురు చూసే స్త్రీ కి ఏ మాలిన్యం అంటని నిర్మలమైన మనసుతో మేమున్నామని పురుషుడు ధైర్యం చెప్పిన రోజు జరుపుకోవాలి అసలైన మహిళా దినోత్సవం గానీ మాతృ దినోత్సవం గానీ!
గడియారం ముల్లు కంటే వేగంగా పరిగెత్తి ,పరిగెత్తి అందరి అవసరాలను తీర్చి, అలసి, సొలసి విశ్రాంతికి ఉపక్రమిస్తే ,అర్థం చేసుకొని ఒక గ్లాసు నీళ్లు అందించిన రోజు ,ఆత్మీయతను పంచిన రోజు జరుపుకోవాలి అసలైన మహిళా దినోత్సవం.
పేజీలు పేజీలు రాసుకోవటం కాదు, దిక్కులు పిక్కటిల్లేలా స్టేజి ఎక్కి మైకులు పగిలిపోయేలా ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, పరిస్థితులు మారి, మృగాళ్లు మగాళ్లు గా, మనుషులుగా మారిన రోజు ,స్త్రీలను అర్థం చేసుకున్న రోజు జరుపుకోవాలి అసలైన మహిళా దినోత్సవం. అసలైన మాతృ దినోత్సవం.
అమ్మగా ,అక్కగా, ఆలిగా, స్నేహితురాలిగా, ఆపన్న హస్తాన్ని అందిస్తున్న మహిళల మానసిక స్థితిని అర్థం చేసుకొని ,వారికి తోడు నీడ నందించిన రోజు జరుపుకోవాలి మహిళా దినోత్సవం గానీ, మాతృ దినోత్సవం గానీ .
ఆ రోజు కోసం మహిళ ఎదురు చూస్తూనే ఉంటుంది .ఆ రోజంటూ వచ్చిన రోజు ఈ రోజులను జరుపుకోవాల్సిన అవసరమే ఉండదు. అప్పుడు ప్రతి స్త్రీకి ప్రతి రోజు ఒక మహిళా దినోత్సవ మే అవుతుంది.
ఆ రోజంటూ వస్తే ఆమె సంబరం అంబరాన్ని అంటుతుంది. ప్రతి రోజు మాతృ దినోత్సవమే అవుతుంది.
తన సంపాదన పై తనకే హక్కు ఉండడం, తన మాట కు విలువ ఉండడం, తాను తానుగా జీవించడం.
అది అసలైన మహిళా సాధికారత.
ఇంత శాతం అంత శాతం రిజర్వేషన్లు అనడమే గానీ రాజకీయాల్లో స్త్రీ లు ఎందరున్నారు? సమానత్వం అంతటా ఉన్నప్పుడు అది అసలైన సాధికారత !!