విమర్శించేముందు…
ఇతరులను విమర్శించడం అన్నది కొందరిలో ఉన్న దురలవాటు. ఈ విమర్శ అన్నది కొంతమంది వ్యక్తులలో ఎదుటివారి ఉన్నతిని చూసి ఓర్వలేనితనలోంచి జనిస్తుంది. ఎదుటివారు తమకన్నా ఉన్నతస్థితిలో ఉన్నా, ఏ రంగంలో నైనా బాగా రాణిస్తున్నా వారిపట్ల అసూయను పెంచుకుంటారు. దాని మూలానా వారిని ఏదో విధంగా విమర్శించి వారి మనస్సును నొప్పించి తాము ఒక విధమైన పైశాచికానందాన్ని పొందుతారు. ఈ అలవాటు ఉన్నవారు అయినదానికీ కానిదానికీ ఇతరులను విమర్శిస్తూ ఎగతాళిగా మాట్లాడటం ఇతరుల ముందు ఆ విమర్శింపబడేవారిని అపహాస్యం చేయడం చేస్తూ ఉంటారు. ఇది ఒక రకఁగా చెప్పాలంటే విమర్శించేవారిలోని ఆత్మన్యూనతాభావానికి నిదర్శనం.
అందుకే అటువంటి కువిమర్శలు ఎదురైనప్పుడు మనం యుక్తిగా వారికి తగిన సమాధానం చెప్పగలగాలి. అప్పుడుగానీ అటువంటి వారు ఇతరులని విమర్శించడం మానరు.
మరో కోవకు చెందినవారు ఉంటారు. వారు తమకు నచ్చనివారి సమక్షంలో కాక పరోక్షంలో వారి గురించి ఇతరులు నమ్మేట్లుగా విమర్శించడం చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఇద్దరు వ్యక్తులు స్నేహంగా ఉంటే చూసి సహించలేరు. అందుకని వీరి మీద వారికీ, వారిమీద వీరికీ చాటుగా కల్పనలను జోడించి చెప్పి వారిద్దరి మధ్య ఉన్న స్నేహ బాంధవ్యాన్ని చెడగొట్టటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిజానికి ఇటువంటివారు చాలా ప్రమాదకరమైన వ్యక్తులకు చెప్పాలి. అందుకే మనం మన చాకచక్యంతో ఎదుటివారి అసలు నైజమేమిటో తెలుసుకునిగాని వారితో స్నేహానికి దిగకుండా ఉండటం మంచిది.
ఈ కువిమర్శ చేయడం అనేది మనిషిలో ఒక్కసారిగా వచ్చే అలవాటు కాదు. దీనికి ముఖ్యంగా ఈ విమర్శలు చేసేవారు బాల్యంలో పెరిగిన వాతావరణం, కలసి తిరిగే స్నేహితులు మన చుట్టూ ఉండే బంధువుల మనస్తతా్వలూ మరియు ఆర్థిక, సాంఘిక, మానసిక అసమానతలు కూడా కారణం కావచ్చు.
అందుకే మ్రొక్కై వంగనిది మ్రానై వంగుతుందా అన్నట్లు చిన్నప్పట్నుంచీ ఈ విమర్శించే అలవాటును పిల్లలు అలవర్చుకోకుండా ఉండడానికి పెద్దలు దోహదపడాలి. ఎవరి గురించైనా విమర్శించటం, అత్యవసరం అయినప్పుడు తమ దరిదాపుల్లో పిల్లలు ఉండకుండా చూసుకోవాలి. అట్లాగే పిల్లలు తమ క్లాసు పిల్లల గురించిగానీ లేక ఉపాధ్యాయులు గురించి కానీ కువిమర్శలు చేస్తున్నప్పుడు వాళ్లను అక్కడికక్కడికే ఖండించి ఆ అలవాటు చాలా చెడ్డది అని వారికి హితబోధ చేయాలి. అప్పుడే వారు పెద్దయ్యాక ఉన్నత వ్యక్తిత్వం గలవారుగా మరియు సంస్కారవంతులుగా తయారు అయ్యే అవకాశం ఉంది.
విమర్శలలో మరో వర్గానికి చెందినదే సద్వివిమర్శ. సద్విమర్శ అంటే మంచి విమర్శ అన్న మాట. ముఖ్యంగా కళాకారులు, రచయిత(త్రులు) సద్విమర్శని స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే సద్విమర్శ ఎప్పుడూ మనలోని లోపాలను మనం గమనించి వాటిని అధిగమించి పురోగమించేలా చేస్తుంది. కానీ ఈ సద్విమర్శను గుర్తించటం ఎలా? అదేమీ అంత కష్టమైన పనిగాదు. సద్విమర్శ ఎప్పుడూ సున్నితంగానూ ఎదుటివారి మనస్సు నొచ్చుకునేలా కాకుండా ఉంటుంది. అంతేకాదు సద్విమర్శ చేసేవారు ఎల్లప్పుడూ మన శ్రేయోభిలాషులై ఉంటారు. వారిలో ఎటువంటి స్వార్థమూ ఉండదు. వారి ధ్యాస అంతా ఎదుటివారి మీదే కేంద్రీకరించబడి ఉంటుంది. అంతేకాదు, సద్విమర్శ చేసే వ్యక్తి యొక్క ఉన్నత వ్యక్తిత్వం మనకు తేటతెల్లంగా తెలుస్తూనే ఉంటుంది. అందుకే సద్విమర్శ ఎప్పుడూ ఆమోదయోగ్యమే.
చివరగా చెప్పుకోవలసింది ఆత్మవిమర్శ గురించి, ఒకరిని విమర్శించే ముందు మొదట మనని మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నది పెద్దలు చెప్పిన మాట. ఎదుటివారిలో లోపాలెన్నో ముందర ఒక్కసారి మనలో లోపాలు లేవా అని మనని మనం ప్రశ్నించుకోవటం మంచిది. పెద్దలు చెప్పినట్లు మనం ఎదుటివారివైపు ఒకవేలు చూపిస్తే మనవైపు వేళ్ళు ఉంటాయన్నది మరువరాదు. అందుకే ఎదుటివారిని విమర్శించేముందు మనలో లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడం ఎంతైనా అవసరం.