గుడిసె బయటవాడు
గుక్కపెట్టి ఏడుస్తుంటే
గుడిసె లోపల ఆమె
పాలకోసం పాపం చేస్తుంది
బిడ్డకోసం ఏదైనా చేసేస్తది
అవును ఆమె అమ్మ…..!
గడప లోపల కనబడని హింసని
కొంగులో దోపుకుని
ఇల్లాలి సంతకం చేసేసి
పిల్లల కోసం భరించేస్తది
అవును ఆమె అమ్మ ….!
బాసు రంకెలేసి
బేజారు చేస్తుంటే
లంచ్బాక్సు బ్యాగులో
మూలుగుతుంటే
ఆరైందని ఉరికి ఉరికి
ఇల్లు చేరి వంటింట్లో దూరి
పిల్లలకు వండివార్చి
తానొక మెతుకైనా గతక లేక
యాదిమరిచి పోతది
అవును ఆమె అమ్మ …!
మాట వినని బిడ్డకు
బుద్ధి చెప్పమని
నాన్నకు ఫిర్యాదు చేసి
తీరా అయ్య కొడితే
ఓర్వలేక వెక్కి వెక్కిఏడుస్తది
అవును ఆమె అమ్మ ….!
గిన్నె ఖాళీఅయి
చికెనంత అయిపోతే
కడుపు మంచిగ లేదని
సల్ల పోసుకుని సర్దుకు తింటది
అవును ఆమె అమ్మ ….!
తాగి తందనాలాడి
తల్లిదండ్రులను తరిమికొట్టినా
నానా బాధలుపెట్టినా
నా కొడుకు బంగారం
ఎవరో చెడగొట్టిన్రు అని
మందిని ఆడిపోసుకుంటది
అవును ఆమె అమ్మ ….!
కట్టుకున్నోడు కనికరం మరిచినా
దేశాలు పట్టుకుపోయినా
వాడి దారివాడు చూసుకున్నా
కూడుగుడ్డలేక అల్లాడితే
సాకలేక దిగాలైపోతే
పిల్లలను బాయిలోవేసి
తాను కూడా దూకుతది
పిల్లలను ఆడ కూడా ఇడవది
అవును ఆమె అమ్మ ….!