1952 ప్రాంతం లో రేడియో ఆడిషన్ కి వెళ్ళిన ఆమె చిన్నక్క గా పేరు పొంది తెలుగు నాట ఆమెవాణి మారుమోగింది.ఒక ఎనౌన్సర్ గా కెరీర్ ఆరంభం! ఎనౌన్సర్ కి చాకచక్యంతో పాటు సమయస్ఫూర్తి సర్దుకుపోయే తత్వంతో పాటు గడియారం తో సమంగా అడుగులు వేస్తేనే రాణింపు అని మాటల్లో కాక చేతల్లో చూపిన అమ్మ రతన్ ప్రసాద్! వీణ వైలెన్ గాత్రం నేర్చుకున్న ఆమె ఆడిషన్ కి వెళ్ళారు.విధి దైవసంకల్పం చూడండి! అక్కడ ఆడిషన్ జడ్జీలకు ఆమె గళం నచ్చి ఎనౌన్సర్ గా ఆపై నాటకంలో నటిగా కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క గా విదేశాల్లో కూడా సుపరిచితులు ఐనారు.ఎనౌన్సర్ కి పగలు రాత్రి డ్యూటీలుంటాయి.
సమయం పరిస్థితుల పై అవగాహన చక్కని స్పష్టం గా ఉచ్చారణ ఉంటేనే రాణిస్తారు.ఆనాటి అఖిల భారత సంగీత సమ్మేళనాలకు హేమాహేమీలైన ఎం.ఎస్. బాలమురళి టి.ఆర్ మహాలింగంలాంటి వారి కచేరీలకు పరిచయం చేస్తూ వారు పాడబోయే కీర్తన రాగం తాళం గూర్చి తొట్రుపాటు పడకుండా చెప్పటంలో రతన్ ప్రసాద్ గారు దిట్ట! కార్మికుల పిల్లల స్త్రీ ల కార్యక్రమాలలో రేడియో కి శ్రోతలు రాసే ఉత్తరాలు చదవటంలో తనదైన ముద్ర వేశారామె! వాయిస్ ఆఫ్ హైదరాబాదు స్వరరత్న మొదలైన బిరుదులు ఆమెని వరించాయి.
అమృత లత లైఫ్ ఎఛీవ్మెంట్ అవార్డు పొందిన ఆమె సి.నా.రె.దాశరథి మునిమాణిక్యం స్థానం మొదలైన హేమాహేమీలతో కలిసి పనిచేయటం మరపురాని మధురమైన అనుభూతి అంటారు.భర్త కన్నకుమారుడు శాశ్వతంగా తనను విడిపోయినా తొంభై ఏళ్ల పండువయసులో మనవల దగ్గర ఢిల్లీలో ప్ర శాంతజీవితం గడుపుతున్నారు. అసలుపేరు రత్నావళి! భర్త పేరుతో కలిసి రతన్ ప్రసాద్ గా మారిన అమ్మగా అందరూ పిల్చుకునే ఆమె ఆకాశవాణి కి ఎప్పటికీ రత్నమే!