ఒక ప్రాంతంలో సంస్కృతి సంప్రదాయం ప్రతిఫలించేవి పండగలు,పర్వదినాలూ. అటువంటి సమయాల్లో ప్రత్యేక పద్ధతులు, వంటకాలు, అలంకరణ, పూజలు ఇవన్నీ కూడా విశ్వ జనీనమైన మానవతా భావన
లే. ఇచ్చి పుచ్చుకోవడం,సంస్కృతి ప్రదర్శన, ఈ విశ్వo లో మనగలుగుతున్నందుకు ఆ అదృశ్యశక్తికి కృతజ్ఞతలుగా రూపొందినవే. అటువంటిదే దసరా నవరాత్రుల్లో బొమ్మలకొలువు. ఇది కొన్ని కుటుంబాలకు తరాలుగా వస్తున్న ఆచారములో కూడా ఉంటుంది. వారసులు దానిని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు.ప్రపంచం కుగ్రామంగా మారినా ఎంత ఆధునిక జీవితం ఉన్నా ఈ పద్దతి మాత్రం విదేశాల్లో కూడా కొనసాగుతున్నది. ఇంటివరకు అయినా ఆచరణ చేసుకోవడం అభినందనీయం. సంక్రాంతికి కూడా పెడుతున్నారు కొందరు.
తొమ్మిదిరోజుల రోజుల పాటు పెట్టే బొమ్మలకొలువుకోసం ఇంటిల్లిపాదీ కృషి చేస్తారు.కొత్త బొమ్మలు సేకరణ కోసం అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. ఇది ప్రతిష్టగా భావిస్తారు. ఇంట్లో విశాలమైన చోట
తొమ్మిదిలేక పన్నెండు మెట్లుగా అమర్చిపైన ధవళవస్త్రo పరిచి, చాలా ఓర్పుగా నేర్పుగా సేకరించిన పాత, కొత్త బొమ్మలు ఒక పద్దతి ప్రకారం అమరుస్తారు. వీటిలో ప్రధానముగా పక్షులు,పాడిపశువులు, హరిదాసు, గంగిరెడ్లవారు, రాధాకృష్ణ, గోవులు, కాళీయ మర్ధనం, మసీద్, చర్చి,ఆరామం, విమానాలు, ప్రయాణసాధనాలు,నది, జలపాతం,స్విమ్మింగ్ పూల్ వంటివి కూడా అమర్చుతారు. దేవతలు,పురాణపాత్రలు, వివిధ వృత్తుల వారువాడే పనిముట్లు, హస్తకళలు, ఒకటేమిటి ప్రతివారికీ ఆసక్తికరం ఈ బొమ్మలకొలువు.
వివిధయాత్రా స్థలాల రూపకల్పనకూడా ఇటీవల చేస్తున్నారు. ఇది ఒక గొప్ప సృజనాత్మక కళ ! ఇక అనేక మెట్లతో విడివిడిగా కూడా లెక్కలేనన్ని అంశాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులలో విజ్ఞానమిచ్చేప్రదర్శన ఈ బొమ్మలకొలువు. దేశనాయకులు, ప్రాంతీయ వేషధారణలూ, వివిధరకాల పండ్లు, కూరగాయలు, నివాసాలు ప్రకృతి, వన్య ప్రాణులు, పెంపుడు జంతువులు, వ్యవసాయం గురించి పొలం, చేదబావి,మోట బావులూ, రైతు బొమ్మలు,పల్లెటూరు, తిరగలి, రోలు, రోకలి,కవ్వం వంటి నేటి తరాలకి తెలియని చూడని వస్తువులు అనేకం ఉంటాయి బొమ్మలకొలువులో.వీణా, మద్దెల, హార్మోనియం,పిల్లనగ్రోవి, వయోలిన్, వంటి సంగీతపరికరాలు, ఫుట్ బాల్, క్రికెట్ స్టేడియం సైతం ఉంటాయి. పిల్లలు ఆసక్తిగా చూస్తారు. ప్లాస్టిక్, రాయి, గాజు, మట్టి, కొయ్య, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, లోహం,గవ్వలు, లక్క, మైనం, ఇసుక, కాగితం, అట్ఠ ఇలా అన్నీ వాడిన బొమ్మలు పెడుతున్నారు. వాటికి అదనపు ఆకర్షణ గా చిన్న చిన్న రంగుల విద్యుత్ దీపాల ఏర్పాట్లు మరింత శోభాయమానంగా ఉంటుంది.
ఇది కూడా పర్వదిన పూజలలో ఒక భాగంగా భావించి ప్రతి రోజు ప్రసాదం పెద్ద ఎత్తున తయారుచేసి సందర్శించిన వారికీ ఆకుదొన్నెలు, ప్లాస్టిక్ బౌల్స్ లో ఇస్తారు. మా బాల్యంలో నాన్నగారు బొమ్మలకొలువుకి తీసుకొనివెళ్ళి చూపించేవారు. నెల్లూరు జిల్లా కోవూరులో బజారువీధిలో ఒకరిఇంట్లో యేటా బొమ్మలకొలువు పెట్టి పెద్ద గంగాళాల్లో పులిహోర, గుగ్గిళ్ళు, పొంగలి వంటివి వెళ్ళేటపుడు ఇచ్చినతీపి జ్ఞాపకాలు ఇంకా తాజాగా ఉన్నాయి. సైన్టిఫిక్ అంశాలు, ప్రాజెక్టులూ, రాకెట్ ప్రయోగం వంటివీ ఇప్పుడు ప్రదర్శనలో ఉంటున్నాయి.ముత్తైదువలకు వాయినాలు ఇచ్చిపంపడం కూడా ఉంటుంది. బొమ్మలకొలువు ప్రత్యేక పాటలూ, మంగళ హారతిపాటలుతో బొమ్మలను దైవం అంశగా భావించడం భారతీయ సంస్కృతి. ఇటువంటి కార్యక్రమాలను కూడా ప్రోత్సహించడం అవసరమే!
ఎం. వి. ఉమాదేవి
బాసర