ఇగోల గోల
ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్లడమనేది పూర్వకాలం నుండి వస్తున్నటువంటి మన సనాతన ధర్మం. ఆచారం. మన కల్చర్. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో చిన్న పిల్లలకే వివాహం జరగటం వలన కొత్తగా వచ్చిన కోడలు కి తమ ఇంటి ఆచారవ్యవహారాలు, మర్యాదలు, పని పాటలు నేర్పాల్సినబాధ్యత అత్త వారి మీద ఉండేది. చదువులు ఉద్యోగాలు అంతగా లేని ఆ రోజుల్లో కోడళ్ళు కూడా అత్తగారు చెప్పినవన్నీ భయభక్తులతో, నేర్చుకోవాలనే బాధ్యతతో ఎదురు చెప్పకుండా వినేవారు. నేర్చుకునే వారు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుకున్నవారు. మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు. అయినా అత్త వారి ఇంటికి వెళ్లాక ఈ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉండాలి. వాళ్ళెలా రిసీవ్ చేసుకోవాలి అనే విషయంలో సరైనఅవగాహన లేక ప్రతి కుటుంబంలో ఎక్కడో రెండుమూడు కుటుంబాల్లో తప్ప రోజు రోజుకి ఇద్దరి మధ్య సఖ్యత తగ్గిపోతుంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు మగపిల్లలనటుంచి ఆడపిల్లలకు ఎంత డొనేషన్లైనా కట్టి చదివించి ఇతర దేశాలకు పంపే ప్రయత్నంలో నూటికి 99 మంది ఆదుర్దా పడుతున్నారు. మనదేశంలో ఎంత పెద్ద ఉద్యోగం లో ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్న భర్తనైనా ఆడపిల్ల,ఆమె తల్లిదండ్రులు ఏదో పోగొట్టుకున్నట్టు, వాళ్ల స్వతంత్ర మంతా హరించి పోయినట్టు తల తాకట్టు పెట్టైనా అత్తమామల నుండి దూరం చేస్తున్నారు. సరే. ఇది తప్పు పని మాత్రం కాదేమో. ఈ రోజుల్లో ఏది తప్పు కాదు. తప్పు అనే పదం డిక్ట్షనరీ లో నుండి తీసివేయబడింది. అది అన్న వాళ్ళు అభివృద్ధి నిరోధకులు కూడా.ఎందుకంటే పదిమందిలో ఒక్కరు చేస్తే అది తప్పు. తొమ్మిదిమంది చేస్తే అది ఒప్పు.
మెజార్టీ ఈజ్ లా..
పూర్వకాలంలో ఏ కుటుంబం లోనైనా కొడుకు కోడలు వేరే ఉంటారంటే విచిత్రం. అందరూ వింతగా అనుకునేవారు. మరి ఇప్పుడు దానికి రివర్స్ గా ఒకే సిటీలో ఉన్నా వేరువేరుగా ఉండటం తప్ప ఒకే కుటుంబం లో ఉండటం విచిత్రం. అసలు ముందు అత్తగారే వేరుగా ఉండమని చెప్పేస్తుంది. దానికి కారణం ఆ అమ్మాయి కుటుంబాన్ని అంతా సమర్థించు కో గలదని నమ్మకం కావచ్చు.అప్పుడు అది తప్పు కాదు. ఇప్పుడు ఇది తప్పు కాదు. కాకపోతే కాలం మారింది అని కాలానికి బురద రుద్దకుండా మారింది మనమే. మన ఆలోచనా విధానమే. మన పరిస్థితుల ప్రభావమే అనుకుంటే విజ్ఞత అనిపించు కుంటుంది. కానీ ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రకృతి సిద్ధంగా ఉన్న ఆకలిదప్పులు గాని, ఆరోగ్యం అనారోగ్యాలు గాని, సంతోషాల దుఃఖాలు గాని మానవుడు ఆపాదించుకున్న ఆపేక్షలుగాని మారవు కదా. అలాంటప్పుడు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లి అందరిలో ఉండేది మూడు రోజుల ముచ్చటే కదా. తర్వాత ఏ ఇతర దేశానికో, ఇతర స్టేట్ కో, ఇతర వీధికో భర్తతోపాటు మకాం మార్చేదే కదా. మరి ఏ పండగ కో, పబ్బానికో, పెళ్లి పేరంటాలకో కలుసుకున్నప్పుడు అత్తవారింట్లో ఆడపిల్ల బిహేవియర్ అంటే అహంభావం లేకుండా ఉంటే బాగుంటుందేమో.
అదేవిధంగా పెద్దవాళ్లు కూడా ఎక్కడోవున్న పరాయి పిల్ల మన ఇంటికి వచ్చేసింది కదా అని కూతురు లాగా చూడగలిగితే బాగుంటుంది. సమస్య రాదు. కానీ ఇద్దరిలో అవగాహన ఉండదు. ఆలోచనా విధానం కరెక్ట్ గా ఉండదు. దానికి కారణం ఇగోయిజం. అసలే ఇప్పుడు ఇగోల కాలం. చిన్న చిన్న విషయాలలో ప్రతి చోట ఇదే రాజ్యమేలుతోంది. ఉదాహరణకి బంగారం షాప్ కి వెళ్ళినా, పట్టు చీర కొందామని బట్టల షాప్ కి వెళ్ళినా, ఉల్లిగడ్డ కొందామని కూరగాయల మార్కెట్ కెళ్ళినా, ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా ప్రతి చోట ఇగో క్లాష్. ఏదో ఘర్షణ లేకుండా ఏదీ జరగడం లేదు.
అలాగే ఇంట్లో కూడా అంతే. నలుగురు మనుషులు కలసి ఉండలేక పోతున్నారు. ఉదాహరణకి కరోనా కాలంలో వేరే ఉండే పెద్ద వాళ్లంతా ఏ నిమిషం ఏం జరుగుతుందోనని భయంతో చిన్న వాళ్ల దగ్గరికి వచ్చి ఉండడం, ఆ సమయంలో ఒక్కొక్క ఇంటిలో జరిగిన రామ రావణ యుద్ధం రామాయణంలో కూడా జరగలేదు. దానికి కారణం ఒక్కటే. ఎవరికి వారే ఇండివిడ్యువల్ ఇగోయిజంని పెంచుకుంటున్నారు. మనిషి మనిషికీ వేరు వేరు సైకాలజీ ఉంటుంది. అది జనరల్ సైకాలజీ. సహజం. అంతమాత్రాన తమ మాట నెగ్గ లేదని ప్రతి చిన్న, పెద్ద విషయాలకు అభిప్రాయభేదాలతో గోరంతను కొండంత చేసే బదులు ఎవరో ఒకరు ఎడ్జస్ట్ అయితే సరిపోతుంది. అంతేకాకుండా ఎవరికి వారు నాదే కరెక్ట్ అనుకునే బదులు ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవిస్తే నష్టం ఏమీ జరగదు. ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసుకున్న వాళ్లమవుతాం. ఉదాహరణకి అత్తగారు కోడలితో ‘ఇది మన ఆచారం కాదు. పద్ధతి కాదు. ఇదిగో ఇలా ఉండాలి’ అని చెప్పినప్పుడు ‘లేదు. మా ఇంట్లో ఇలానే ఉండే దాన్ని. నేనెప్పుడూ అంతే. ఎవరి కోసం మారను.’ అని పిడుగులు కురిపించే బదులు ‘అలాగా. సరేనండి. ఇకముందు మీరు చెప్పినట్టు చేస్తాననో, చేయడానికి ప్రయత్నిస్తాననో’సౌమ్యంగా చెప్పినప్పుడు ముందు ముందు చేసినా చేయకపోయినా గౌరవంగా మాట్లాడినప్పుడు ఆ పెద్ద మనసు సంతోషిస్తుంది. అదేవిధంగా అత్తవారు కూడా కూతురికి చెప్పినట్టు అనునయంగా చెప్తే ( పెడ మూర్ఖులు తప్ప) ఆ అమ్మాయి వినే అవకాశం ఉంటుంది. కాంప్రమైజ్ అవసరం లేదు. పరిస్థితిని బట్టి సర్దుకుపోతే చాలు.
ఒక్క ఇంట్లో కాదు బయట ఎక్కడైనా అంతే. కొన్ని కొన్ని అవాంఛనీయమైన పరిస్థితులలో సర్దుకుపోవడం కూడా మంచిది కాదేమో. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ కూడదో అర్థం చేసుకుంటే చాలు. పెద్ద వాళ్ళు ఏమైనా అన్నప్పుడు అదికరెక్ట్ కాకపోయినా పెడసరంగా సమాధానం చెప్పే బదులు మౌనంగా ఉండడం మంచిది. పెద్దవాళ్లు కూడా చీటికి మాటికి ఎవరెవరితోనో, లేక తన కూతురు తో పోలుస్తూ కోడలిని మాటలతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదేమో. ఎలాగూ కోడలు కూతురు కాదు. అత్త తల్లి కాదు. కానీ కోడలు నేమైనా ఇబ్బంది పెట్టినప్పుడు అత్తవారింట్లో ఉన్న తన కూతురును గుర్తు తెచ్చుకోవడం , కోడలు అత్త ను ఇబ్బంది పెట్టినప్పుడు ఆమె తన తల్లిని తలచుకోవడం కొంతమేరకు ఇద్దరి మధ్య దూరం తగ్గిస్తుందేమో. దానికి ఓర్పు కావాలి. ఎవరి పాత్ర వాళ్లు కరెక్ట్ గా పోషించుకునే సమర్థత కావాలి. తన కుటుంబం, తన కుటుంబ పరిస్థితి మాత్రమే అవగాహన చేసుకుంటూ ఇతర కుటుంబాలతో పోల్చుకో కపోవడం అన్నింటికంటే శ్రేయస్కరం. దీనివల్ల మనలో egoism కూడా మెల్ల మెల్లగా సప్రెస్ అవుతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో తప్ప ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం వల్ల ఒకరికొకరు దగ్గరవుతారు. దీనివల్ల ఇంట్లో ఉన్న మగవాళ్ళు, పిల్లలు డిస్ట్రబ్ కాకుండా ఉంటారు.
ఉదాహరణకి కోడలు బయటకు వెళ్తున్నప్పుడు ‘నేను బయటికి వెళ్లి వస్తాను అత్తమ్మా ‘అని చెప్తే చాలా సంతోషిస్తుంది అంతమాత్రాన ఆ పిల్ల ప్రిస్టేజ్ తగ్గదు. ‘వీల్లేదు. పోవద్దు’, అని ఈ కాలంలో ఏ అత్త అనదు. అలా అనేవారి విషయం వేరే. అదేవిధంగా అత్తగారు కూడా తను ఎక్కడికి వెళ్ళినా కోడలికి చెప్తే ఇంటి బాధ్యత కూడా తీసుకుంటుంది. ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాల్లోనే చిలికి చిలికి గాలివాన అవుతుంది. దానికి కారణం మళ్లీ మళ్లీ అహంభావమే.
అరణ్య వాసానికి వెళుతున్న సీత తనను వదిలి భరించలేనని విలపిస్తున్న అత్తగారిని ఓదార్చి వెళ్తుంది. అంతేకాకుండా ‘మీ కొడుకు ను శ్రద్ధగా చూసుకొని మళ్లీ మీకు యధావిధిగా అప్పగిస్తానని’ అత్త మనసును అర్థం చేసుకొని ఓదారుస్తుంది. పాత కథలెందుకు అనుకుంటున్నారా? పాతనుండి కొత్త పాఠాలు కావాలి .మరి ఇప్పుడు పెళ్లి తర్వాత కొడుకు అమ్మ పక్కన కూర్చోకూడదు. ఎక్కువ మాట్లాడకూడదు. మరిఇది టెక్నాలజీ కాదు కదా.ఈ అభివృద్ధి కోసం ఏ మేధావులు ప్రయత్నించలేదు కదా. ఈ కుసంస్కారాన్ని కూడా స్త్రీ వాదం అని సమర్దించ లేము కదా తల్లి కొడుకుల ది పేగుబంధం. అది కాదనే హక్కు సృష్టికే లేదు. వెనకాముందు అమ్మ పదవి అందరికీ వస్తుంది. మరి ఇదే వరస ముందు కూడా జరుగుతుంది కదా. అందుకే ఇలాంటి పవిత్ర బంధాలన్నీ కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.
అందుకే అన్నదమ్ముల అనుబంధం, తండ్రి కొడుకుల బంధం, ప్రజా రాజుల సంబంధం మాత్రమే కాకుండా అత్తా కోడళ్ళ సంబంధం ఎలా ఉండాలో కూడా రామాయణం చెబుతుంది. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మార్పులను పొందుతూ మన జీవితంలో ప్రతి నిమిషం ప్రశాంతత లేకుండా అడ్డుపడే ఈ ‘ఇగోల గోల’ లేకుండా చేసుకుంటూ ఏ గోల లేకుండా ఆనందంగా జీవించే ప్రయత్నం చేద్దాం.
____***____