వ్యాపకాల కాల హరణం లో కుటుంబం మునిగిపోతే
అమ్మమాత్రం వంటింటిగరిటగా
మారిపోతుంది
అమ్మకు పార్టీలు లేవు
పెళ్లిళ్ల ఆటోటోపాలు లేవు
అమ్మకు ఆదివారం లేదు
సెలవుల నెత్తావులూ లేవు
దినదిన ప్రశ్నల సరళి కి ఆమె
ప్రతిరోజు ఒక జవాబే
ఇంటి గుమ్మంలో ముగ్గుపెట్టి
సూర్యోదయానికి ఆహ్వానం
పలుకుతుంది
ఊడ్చి,తూడ్చి
ఇంటికి పరిశుభ్రతా
రంగు లద్దుతుంది
పొద్దున్నే
అమ్మ చేతిస్పర్శతో
వంటశాలలోని వస్తువులు
పాక యజ్ఞంలో
భాగమౌతాయి
వండివార్చి వడ్డించి
తోమి కడిగే
దినసరి పనుల జాబుకు
అమ్మ చిరునామా
వంటింటి గుభాళింపుగా
మారక తప్పడం లేదు
నడుము వాల్చే
తీరిక అటకెక్కింది
పోటీ ప్రపంచంలో
ఆలోచన వ్యక్తిత్వం తో
నిలబడే సమయం ఎక్కడిది
ఇంటిపని,వంటపని
అడవాళ్ళ కంటి చూపులంటే ఎలా
మనసు చూపులనడగండి చెబుతాయి
మారుతున్న జీవనగమనంలో నాటుకుపోయిన అనాది అనవసరపు ఆచారాలను
పితృస్వామ్య మూలాలను చెరిపి
ఆడ మగ హద్దులఅంతరాలను తుడిచే ఉద్యమాలమై
నిర్బంధ రేఖలను దాటి
గృహ హింసకు
చరమ గీతం పాడుదాం రండి
అమ్మను ఇoటిచాకిరి నుండి
విముక్తి చేద్దాం రండి.