తరుణీయం

నేనే నేనే!

  వేముగంటి శుక్తిమతి

ఈ పోటీ ప్రపంచంలో మగవాళ్లకు సాటిగా స్త్రీలు అన్ని రంగాలలో పరుగు పందేలతో ముందుకు పోవడం హర్షదాయకం. ఆర్థిక స్వాతంత్రం కోసం ఉద్యోగాలు చేయడం, ఇంటా బయటా మేమే పని చేయాలా అనే ఆలోచన రాగానే తన తో సమానంగా భర్తను కూడా ఇంటి పనులలో సహాయ పడమని అడగడంలో తప్పులేదు. ఎందుకంటే అది కూడా వాళ్ల బాధ్యత కాబట్టి. కాలాలు మారిపోయి ఆడవాళ్లు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి..మీ అమ్మానాన్నలకు సేవ చేయడానికి నేను బానిసను కాను అంటూ వాళ్లను వేరే ఇంట్లో కో లేక ఆశ్రమానికి పంపడం అంతటితో ఊరుకోక తమ అమ్మానాన్నలను ఇంటికి తెచ్చుకోవడం ఎక్కువ మాట్లాడితే నేను కూడా సంపాదిస్తున్నాను కదా అని భర్త నోరు మూయించడం,ఇవన్నీ అంచెలంచెలుగా జరుగుతున్న మహిళాభ్యుదయ వికాసం అనుకుంటూ ఆనందిస్తున్నాం. లక్షలసంపాదన కావాలి. ఇక్కడి ఉద్యోగాలు డాలర్లలో ఉండవు కాబట్టి ఫారెన్ లోనే ఉద్యోగం తో పాటు సెటిల్మెంట్ కూడా ఉండాలి. పది పన్నెండేళ్ల కాపురం చేసి ఇద్దరు ,ముగ్గురు పిల్లలున్నా చెప్పిన ప్రతీ మాట వింటూ ఎప్పుడో ఒకటి విననప్పుడు డైవర్స్ తీసుకుంటాననో, లేదంటే సూసైడ్ చేసుకుంటాననో బెదిరింపులు ఇవన్నీ కూడా స్త్రీ స్వేచ్చ అనుకొనే కాంప్రమైజ్ అవుతున్నాం.
కాంప్రమైజ్ అనేకంటే అలవాటైపోయింది అంటే బాగుంటుందేమో. శరీరానికి బురద అంటితే వెంటనే దాన్ని కడుక్కోకపోతే అది శరీరం లో ఇమిడిపోయి అదీ శరీరమే అనుకుంటాం. అదేవిధంగా అజ్ఞానం, అతితెలివి అనే మాలిన్యాలు కూడా అంతే సహజం అనుకుని అలవాటు పడిపోతున్నాం.
ఆనందిస్తున్నాం.కానీ ‘రాతియుగం నుండి రాకెట్ యుగము దాకా ఆడవాళ్లు మాత్రమే బిడ్డకు జన్మ నివ్వాలనేది మాత్రం మారడం లేదు. గర్భం దాల్చి, బిడ్డను కని, ఓ రెండు మూడు నెలలు బయటి ప్రపంచం లేక ఇంట్లోనే ఉండాలా, ఇంటికే పరిమితం అవ్వలా ‘అనే మాటను ఒక యంగ్ ఉమెన్ ఆవేశంగా అంటూ ‘ఇన్ని నెలలు ఉద్యోగం మానేసి ఇంటికే, వంటింటికే, పిల్లలకే పరిమితం కావాలా నా జీవితమంతా ఇంతేనా’ అనే మాటను విని నిర్ఘాంత పోయాను.ఈఆలోచన మానవ సృష్టికే విఘాతమేమో. ఎందుకంటే అభివృద్ధి పేరుమీద దానికంటే ఎక్కువగా విఘాతాన్నే చూస్తూనేవున్నాం. కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, మానవ సంబంధాలు, అన్నీ ఒకటొకటిగా ఆర్థిక సంబంధాలనే కటింగ్ ప్లేయర్ తో కట్ చేయబడ్డాయి.
నిజం చెప్పాలంటే వ్యక్తిగతంగా స్త్రీఅధైర్య పడే బలహీనురాలు కాదు. నాతో సమానంగా నువ్వన్నీ చేయాలంటే పురుషుడు చేస్తాడేమో కానీ బిడ్డను ప్రసవించి ప్రపంచానికి అందించలేడు. బైలాజికల్ గా ఉన్నవాటిని ఎవరూ తొలగించలేరు.
ఇంటికే పరిమితం. కుటుంబ సభ్యుల కోసం ఏదో త్యాగంచేస్తున్నాననే పదం మహిళా లోకం మనసులో నుండి తొలగించుకుంటే మంచిది. ఇంటికి పరిమితం కావటం తప్పుకాదు. దోషం కాదు. ఆఫీసులో ఉదయం నుండి సాయంకాలం వరకు చేసే పని కన్నా వంట చేయడం తక్కువ పని కాదు. అది ఒక గౌరవనీయమైన బాధ్యతతో కూడిన గొప్ప పని. ‘నేనే’ ‘నేనే’ నేనే చేస్తున్న అనే ఫీలింగ్ స్వార్థాన్ని ఎక్కువ చేస్తూ మానవ సంబంధాలని దూరం చేస్తుంది. ఆడవాళ్ళు హౌస్ వైఫ్ గా ఉన్న కుటుంబాల్లో మగవాడు సంపాదించి కుటుంబాన్ని పోషించడం తన బాధ్యత అనుక అనుకోవాలి తప్ప నేనే తిండి పెట్టి నిన్ను బతికిస్తున్నాననే అహం ఎప్పుడూ ఉండకూడదు.. మనం చేసే పని ఇతరుల కోసమే అని ఎందుకు చేయాలని? ఆలోచన ఉంటే ఆ పని ఎంత సులభమైనదైనా దానిపై ఆసక్తి పోయి అలసట పొందుతాం. అందుకే ప్రతి పనినీ ఇష్టంగా చేయాలి. ఇష్టం లేకపోతే ఇష్టంగా మలచుకోవాలి. చేస్తున్న పనిని బాధ్యతగా స్వీకరిస్తే దానిని తప్పకుండా ప్రేమించగలం. సెల్ఫి టీ మానేసి మనను మనం ప్రేమించుకుంటూ మనం చేస్తున్న పనిని ప్రేమిస్తూ ‘మానవ జీవితం అందమైన సముదాయం’. అనుకుంటూ రోజురోజుకు యాంత్రికంగా మారిపోతున్న మనం మానవ సంబంధాలను మెరుగు పరుచుకుంటూ నిజమైన ఆనందాన్ని అనుభవిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సమయ నియంత్రణ

ఉషోదయం