నాలోని భావాలకు నీవు ఇచ్చిన భాష్యాలకు
సుమధుర శ్రుతి నీరాజనాల సంకీర్తనలకు
సంధ్యారాగాల సుస్వర ఆలాపనల కు
అజరామరానంత తేజో ఓంకారాలకు
షడ్జమమో మధ్యమమో నేనెరుగని గమకాలకు
మంద్ర స్థాయో మధ్యమ స్థాయో
నేనైతే తారాస్థాయి వరకూ నీ పేరే ఎత్తాను
సామగాన ప్రియ సంగీత సాహిత్యాల
రసోవైసః అభిలాష నయ్యాను
నీ నాదం చేరిన నీ భావం చేరిన
ఒకానొక కవిత నయ్యాను
కళార్పితమైన నీ కాహళి
గళార్చితమైన నీ కృతి
భ్రుకుటి పై శాంతావర్తనం అయినప్పుడే తెలిసింది
మీరా నీ ప్రేమ వారాశి
తరతరాల ప్రవాహి
ఈ అధునాతన జగత్తులోనూ
నిన్ను స్మరించే అనువర్తన గానలహరి
_ డా. కొండపల్లి నీహారిణి
తరుణి పత్రికఎడిటర్ డా. కొండపల్లి నీహౕరిణి గారి చిత్రవ్యాఖ్యానాత్మక కవిత చిత్ర సందర్భానుకూల ఆరాధనకు అక్షరపట్టం కట్టింది. చిత్రకారిణి కృషి చరితార్థం. నీహౕరిణి గారి ప్రతిభ అభినందనీయం. ఇద్దరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు.
-గురిజాల రామశేషయ్య : రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ : హైదరాబాద్–44