అందనీ కొమ్మల్లా అందాల జానా
మా అందరీ గుండెల్లో కొలువైన దానా
ఆకు పాఛ్చా ఇంట్లో విరబూయు దాన
నిల్లువెల్ల పసుపులు పూసేటిదాన
పసుపు సౌభాగ్యమిచ్చు
తంగేడు తల్లిగా నిను కొలుచు కుంటాం
అడవి పొదల్లో పూచి
అలకలూ పోయేటి
చిన్నబోవు కర్మ నీకెటి తల్లి
రంగు వాసన లేని వైరాగ్య మూర్తివి
భోగినుల సిగ సాకులు తావివ్వ కుంటేనేం
దేవుళ్ళ గుడి వాకిళ్ళు రానివ్వ కుంటేనేం
గునుగు పువ్వు లేని బతుకమ్మ గుడ్డి బతుకమ్మని
మొదటి వరుస లోనే
నిను పేర్చు కుంటాం
కంటకాలకు నెలవై
కంచె కల్లుకొని
కాపాలాయే పనిగా
కట్లెపువ్వులయి
కంటి కింపైన
హరివిల్లు రంగులై
విలసిల్లు మిమ్ములను
సొంపుగా పేర్చు కుంటాం
చంద్రోదయాన పూచేటి మీరు
చంద్ర కాంతల పేర పిలువ బడతారు
ఎన్నెన్నో రంగుల సొగసున్న మీరు
రుద్రాక్ష పూలని పిలువ బడతారు
శికరమ్ము వరుసలో మెరిసి పోయేరు
కాంతలు మిము చూసి
మురిసి పోయేరు
రాలు రెక్కల సిరుల వరమున్న మీరు
గోరంట పూలై విరబూసినారు
గుంపు పేరంటాళ్ల ముత్తైదువులై
బతుకమ్మలో గుమిగూడి ఇమిడిపోయేరు
మూణ్నాళ్ల బతుకున్న
ముదితలు మీరై
గౌరమ్మలో జేరి గౌరవము పొందేరు
డా ఆరుట్ల శ్రీదేవి
నిజామాబాద్