ఈ మధ్య లోన్ అప్స్ వల్ల జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనం వింటూనే ఉన్నాము. అవసరం వల్ల కొంత అవగాహన లోపం వల్ల కొంత ఇలాంటి అప్స్ కి బలి అవ్వడం జరుగుతోంది . అలాగే అదే పనిగా డబ్బులు ఇస్తాము అని వెంటపడితే ఏదో క్షణంలో డబ్బెవరికి చేదు అని అలాంటి అప్స్ కి పచ్చ జెండా ఊపడం సహజం . అనేక రకాల సైబర్ నేరాల్లో ఇదీ ఒకటి . అన్ని అప్స్ ఇలా మోసాల కోవలోకే రాకపోయినా , అసలే మాత్రం ప్రామాణికత లేని అప్స్ జోలికి వెళ్లి సమస్యలు తెచ్చుకోవడం మంచిది కాదు . అప్పు తీసుకున్న వారే కాదు అసలు ఆ అప్పు తో ఏమాత్రం సంబంధం లేని వారు కూడా బాధింపడం చూస్తున్నాము .
అసలు ఈ లోన్ అప్స్ ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి ?
వ్యక్తుల ఆర్ధిక అవసరాలని, ఆవశ్యకత ని అలాగే బలహీనత ని లక్ష్యo గా చేసుకొని ఇలాంటి అప్స్ స్మార్ట్ ఫోన్స్ లో అందుబాటులోకి రావడం జరుగుతోంది. అన్ని లోన్ అప్స్ మోసపూరితమైనవే అని చెప్పలేము . కొన్ని చట్టరీత్య అనుమతులు తీసుకొని చట్టాలకు లోబడి పని చేస్తున్న సంస్థలు లేక పోలేదు . అయితే వాటి వ్యత్యాసం తెలుసుకొని మెలుకువగా మసలు కోవడం వినియోగదారుని చేతిలోనే ఉంది. కారణం భారత దేశంలో వీటికి సంబంధించి బలమైన పట్టిష్టమైన చట్టాలు , క్రమబద్దీకరణ చేసే వ్యవస్థ ఇంకా పూర్తిగా అందుబాటులోకి లేకపోవడం వల్ల వినియోగదారులే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది .
కొన్ని వందల లోన్ అప్స్ మీ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లేదా iosస్టోర్ లలో చాలా సులువుగా డౌన్లోడ్ చేసుకోడానికి అందుబాటులో ఉంటాయి. అనేక రకాల ఆకర్షణ లతో అవి వినియోగదారులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఎక్కువ అప్పు మొత్తం, తక్కువ వడ్డీ , ముందస్తు చెల్లింపులకు యేవో ఆఫర్లు , రిజిస్ట్రేషన్ రుసుము లాంటివి లేవని ,తాకట్టుకి పత్రాలు అవసరం లేదని , రెండే రెండు గంటలు లేదా రోజులు ఇలా అనేక రకాల రాయితీల వల్ల వినియోగదారులు తమకి తెలీకుండానే వాటి వలలో పడడం జరుగుతోంది .
అయితే వీటిని డౌన్లోడ్ చేసుకునే వినియోగదారుడికి అవి చట్టరీత్యా అనుమతులు పొందిన అప్లికేషన్స్ ఆ లేక అనుమతులు లేని అన్ రెజిస్టర్డ్ అప్స్ అన్న విషయం తెలియకపోవడం కూడా ఇలాంటి నేరాలు పెరగడానికి కారణం. ఈ అప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్లలో ఉండే అనేక అప్లికేషన్స్ కు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్స్ చిరునామాలు అంటే కాంటాక్ట్స్ ని , మీ కెమెరా ని , మీ లొకేషన్ యాక్సిస్ కి మరియు ఇతర అప్లికేషన్స్ కి అనుమతులు అడగడం జరుగుతుంది. అవన్నీ ఇస్తే కానీ అది డౌన్లోడ్ అవ్వడం , అందుబాటులోకి రావడం జరగదు. ఎప్పుడైతే మీరు మీ కాంటాక్ట్స్, చిత్రాలు వంటివాటికి ఈ అనుమతులు ఇస్తారో , ఆ అప్స్ మీ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో సమాచారాన్ని మొత్తాన్ని తీసుకోవడం ,హాక్ చేయడం , మీ ఫోన్ ని తమ నియంత్రణ లోకి తీసుకోవడం జరుగుతుంది.
అలాగే వివరాలు నమోదు చేసేప్పుడు ఆధార్ , పాన్ , చిరునామా , మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ లాంటివి ఇస్తారో ఇక మీ గురించి తెలుసుకోవడానికి మిగిలేదంటూ ఏమి ఉండదు .
ప్రతి వ్యక్తికి వారి స్మార్ట్ ఫోన్ ఒక ఇల్లు లాంటిదే . ఇంట్లోనైనా దొరకనివి ఉంటాయేమో కానీ స్మార్ట్ ఫోన్ తెరిస్తే మనిషి మనసు రెండూ తెలుసుకున్నట్టే. అటువంటి ఫోన్ లో ఇలాంటి అప్స్ కి అనుమతులు ఇవ్వడం అంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే . దొంగ చేయని హాని కూడా ఈ అప్స్ చేసేస్తాయి .
మీకు అనుకున్న మొత్తం పూర్తిగానో లేక చాలా మట్టుకు మీ అకౌంట్ లో పడటం చూస్తారు. ఎప్పుడైతే మీరు వడ్డీ కట్టడం మొదలు అవుతుందో అపుడు కానీ మీకు అసలు మీరు ఎక్కడ ఇరుక్కుపోయారో తెలియదు . రికవరీ ఏజెంట్ అని ఎవరెవరో ఫోన్ చేయడం , మిమ్మల్ని బెదిరించడం ఎన్ని వాయిదాలు కట్టిన మీ అప్పు తరగకపోవడం లాంటివి మీ అనుభవంలోకి వస్తాయి. మీ కాంటాక్ట్స్ లో ఉన్నవారికి కూడా ఫోన్లు చేయడం వారికి మీ గురించి చెడుగా చెప్పడం లేదా మీ బదులు వారిని అప్పు తీర్చమనడం , వారితో కూడా అసభ్యంగా మాట్లాడం వంటివి చేస్తారు. అక్కడితో వదలక ఫోన్ లోని మీ చిత్రాలని మీకు సంబంధించిన వారి చిత్రాలని అసభ్యంగా చిత్రీకరించడం వాటిని అందరికి పంపడం , అసభ్యకర వెబ్సైటులో ఆ చిత్రాలని ఉంచడం … ఆ నేరాలని చెప్పడానికే సభ్యత అడ్డు వస్తుంది.
అటువంటి నేరాలు చేసేవారు మాములు ఫోన్ లు కాక వాట్సాప్ లాంటి అప్ ల ద్వారానో లేక లాప్టాప్ ల ద్వారా IP అడ్రస్ దొరకుండా చేస్తారు . అటువంటి నేరగాళ్ళని పట్టుకోవడంలో కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికే సైబర్ పోలీసులు వారిని పట్టుకోవడం జరుగుతోంది.
ఆ సంస్థలు వాటి సమాచారం కూడా యదార్ధమైన సంస్థల లాగే కనపడటం వల్ల కూడా వినియోగదారులు వాటి మాయలో పడటానికి ఒక కారణం. అవసరం ఒక్కోసారి ఆలోచనని చంపి వేస్తుంది. ఏదైనా సులువుగా దొరుకుతోంది అంటే ఎందుకు అని ప్రశ్నించుకోవాలి . సులువుకి , ఉచితాలకి అలవాటు పడ్డ మనిషి మరియు సమాజం పురోగమించదు. మన అవసరం ముందుకి తీసుకు వెళ్లి మనల్ని ఎక్కడ నిలబెడుతోందో ముందే ఆలోచించాలి . ప్రాణం పోతే తిరిగి రాదు. తెలుసో తెలియకో అటువంటి వారి చేతిలో పడితే ప్రాణాలు తీసుకోక ధైర్యంగా పోరాడాలి . ఆశ లేక దురాశ మరియు పరువు, పిరికితనం ఇవే ఆ నేరస్థుల ఆయుధాలు. ఆశకి లొంగినా పిరికిగా నిర్ణయాలు తీసుకోక , మనలా ఇంకెవరూ బాధింప పడకూడదు అనుకోని పరిష్కారం దిశగా ముందడుగు వేయాలి.
మనకి తెలిసిన మనిషి కి మనం తోడుగా నిలబడితే ఇలాంటి ముక్కూ మొహం తెలియని మోసగాళ్లు సృష్టించే జీవంలేని అప్స్ వల్ల ఏ మనిషి జీవంలేని వారు అవ్వరు .