సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి

జననం 16 సెప్టెంబర్ 19 16
మరణం 11 డిసెంబర్ 2004

ఈ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం వారు ఎవరంటే.. ఒకరు మా అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా’ అన్నారు భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ ఏపిజె అబ్దులు కలామ్.
ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రేమికులందరి ఆదరాభిమానాలు అందుకున్న కర్ణాటక సంగీత విద్యాంసురాలు, గాయని మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి( ఎం.ఎస్. Ji సుబ్బులక్ష్మి)
సంగీత విభాగంలో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న ప్రథమ సంగీత కళాకారిణిగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఆసియా నోబెల్ ప్రైజ్ గా భావించే రామన్ మెగసెసే పురస్కారం అందుకున్న మొట్టమొదటి సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్ సుబ్బు లక్ష్మి

సుబ్బు లక్ష్మి తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో లలిత కళలకు విలువనిచ్చే కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సుబ్రహ్మణ్య అయ్యార్. తల్లి వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్. అమ్మ ఒడిలోనే ఆమె సరిగమపదనిసలు నేర్చుకున్నారు. అమ్మ పాడే రాగాలు వింటూ గారాలు పట్టిగా పెరిగారు. పదేళ్ళ వయసులోనే ఆమె సంగీత సాధన ప్రారంభించారు. ప్రముఖ సంగీత విద్యాంసులు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద శిక్షణ పొందారు. 1926 లో పదేళ్ళ వయసులో తన తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు. తన మృదుమధుర స్వరంతో గీతాలాపన చేస్తూ సంగీత ప్రేమికులను మంత్రముగ్దులను చేసేవారు.
సుబ్బులక్ష్మి గళంలోని మాధుర్యాన్ని, సంగీతం పై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన తల్లి చెన్నైకి
ఆమెను తీసుకుని వచ్చారు. దాంతో సుబ్బు లక్ష్మి జీవితంలో కీలకమలుపు సాధ్యమైంది. మద్రాస్ సంగీత అకాడెమీలో చేరిన ఆమె మొట్ట మొదటి సంగీత కచేరీ ఇచ్చారు. ఆ తర్వాత సంగీత ప్రపంచంలో ఆమె ముందడుగు వేస్తూ.. ఎన్నో అవకాశాలను అందుకున్నారు. 1938లో సేవాసదనం సినిమా ద్వారా సినీ సంగీత ప్రపంచంలోకి సుబ్బులక్ష్మి అడుగుపెట్టారు. నటిగా ఆమె ప్రస్థానం ప్రారంభించారు. 1945లో వచ్చిన ‘మీరా’ విజయవంతం కావడంతో సుబ్బులక్ష్మి గాయనిగా, నటిగా ప్రజల్లో విశేషమైన గుర్తింపు పొందారు. ‘మీరా’ సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అయితే మీరా తర్వాత సుబ్బు లక్ష్మి నటనకు స్వస్తి పలికి గాయనిగా తన పేరు సుస్థిరం చేసుకున్నారు.
చేతిలో తంబూర పట్టుకొని భక్తి పారవశ్యంతో ఆమె గానం చేస్తుంటే శ్రోతలు సంగీత సాగరంలో మునిగిపోయేవారు. కేవలం కర్ణాటక భాషలోనే కాకుండా పదికి పైగా భాషల్లో ఆమె గానం చేశారు. ఆమె గళం నుంచి ఎన్నో కృతులు, కీర్తనలు, భజన పాటలు, దేశభక్తి గేయాలు, జానపదాలు సైతం ఆమె ఆలపించారు. భాష ఏదైనా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత.. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రాసిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. దేశవిదేశాల్లో ఎన్నో వేదికలపై గానం చేస్తూ శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన ఆమె ఐక్య రాజ్య సమితి వేదికపై తన సంగీతాన్ని వినిపించారు. లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణి చేత ప్రశంసలు అందుకున్నారు.
సంగీతంపై ఆసక్తి ఉన్నవారందరి ఇళ్లలో ఇప్పటికీ, ఎప్పటికీ సుబ్బులక్ష్మి గానం వినిపిస్తూనే ఉంటుంది.

Written by vanga Yashoda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పెళ్ళంటే…

నిన్నటి సంగతి మనకేల..