పెళ్ళంటే…

పెళ్లంటే ఏడడుగుల, మూడుముళ్ల ఒక పవిత్ర బంధం గా తరతరాల నుండి మనలో ఇమిడిపోయిన సాంప్రదాయం. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల కలయిక అనేకంటే ఇద్దరిఆత్మ ల కలయిక అంటే సరిపోతుంది. ఉదాహరణకి రామాయణంలో సీతారాములిద్దరిదీ ఒకటే ఆత్మ. లేనిదే అతడు చెప్పినవన్నీ అంటే అడవికి వెళ్లమన్నా, అగ్నిలో దూకమన్నా దానిలోని అంతరార్థాన్ని అర్థం చేసుకొని చేసిందే తప్ప మనం అనుకుంటున్నట్టు ఆమె ఒక అమాయకురాలో, అసమర్థురాలో అవ్వడం వల్ల కాదు. అంతేకాక రాముడికి సీత పట్ల ప్రేమ లేక కాదు. రాముడు మనసేమిటో ఆమెకు తెలుసు. అతడి ధర్మాన్ని, నీతిని భార్యగా కాపాడవలసిన బాధ్యత తనకుందని కర్తవ్య పాలన చేసింది. అలా చేసినందుకు జనకమహారాజు సీతాదేవికి విడాకులు ఇప్పించి పుట్టింటికి తీసుకెళ్లలేదు. అసలు రామాయణంలో శివధనస్సు విరిచిన ప్రయోజకుడికి, బలవంతుడి కి తన కూతురు రు జానకిని ఇచ్చి వివాహం చెయ్యాలని ఒక తండ్రిగా అనుకున్నాడే తప్ప వివాహం అయ్యాక ప్రతి నిమిషం ఆమె కుటుంబాన్ని చిందరవందర చేయలేదు.అందుకే ఈనాడైనా ఏనాడైనా మానవునికి కలిగే సంఘర్షణ లకి , సమస్యలకి పురాణాలే సమాధానం చెబుతాయి. ఆ ధర్మాన్నీ పాటించినంత కాలం మానవులు విలువలతో, వివాహ బంధంతో గౌరవంగా జీవితాలను కొనసాగించారు.
పెళ్లంటే ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధమే కాక రెండు కుటుంబాల కలయిక.
కానీ ఈనాడు పెళ్లంటే తప్పెట్ల మోత, క్యాటరింగ్ పేరుతో అనేక రకాల తినుబండారాల అంగడి, ఆర్టిఫిషియల్ అలంకారాలు, అర్థం కాని పలకరింపులు. ప్రదర్శనలు.
అన్నింటి వలె వివాహ తంతు లో కూడా అనేక మార్పులు కాలానుగుణంగా రావడం సహజం. మా చిన్నప్పుడు ఎవరింట్లో పెళ్లి జరిగినా దగ్గరబంధువులంతా వాళ్లంతలోవాళ్ళేబాధ్యత తీసుకొని ఆర్థికంగా, నైతికంగా ప్రేమపూర్వకంగా, శ్రమ పూర్వకంగా సహాయపడేవారు. రాను రాను ‘మా అమ్మాయి లేదా అబ్బాయి కి పెళ్లి కుదిరింది. నాకు సహాయపడగల రా’ అని అడిగే దాకా ఇంకా రాను రాను ‘పెళ్ళికి రండి అని పిలిస్తే అవునా ఆ రోజు ఆ పని, ఈ పని. రావడానికి ప్లాన్ చేస్తా. ప్రయత్నం చేస్తా.’ లాంటిమాటలు వింటూనే ఉన్నాం. సమయానికి జడివానలా గా కురిసే బంధువులంతా ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ వేదికలెక్కి అక్షింతలు వేయడం.
అక్షింతలు వేస్తున్న వధూవరులను కనీసం మనసులో నైనా దీవించడానికి వీలులేకుండా పెద్ద పెద్దగా డిజీ సౌండ్. కర్ణ కఠోరమైన పాటలు. పెద్ద చిన్న లేకుండా డాన్స్లు. వాళ్ల చుట్టూ రా ఫోటోలు తీస్తూ ఆ డాన్సర్ల భర్తలు పేరెంట్సు,. పాపం వేదికమీద వధూవరులిద్దరే.
అసలా పెళ్లి పెట్టిన ముహూర్తానికి జరిగిందో లేదో కూడా ఎవరికీ తెలియదు. అక్కడ ఫోటోగ్రాఫర్లు, కెమెరా వాళ్ళు, ఈ పెళ్లి తతంగమంతా యూట్యూబ్ లో పెట్టడానికి వేరే కెమెరా ఇంతమందిలో ఒక్కడైన బ్రాహ్మణుడు బిక్కుబిక్కుమంటూ గబగబా
నాలుగు మంత్రాలు చదివేసి ఆనాలుగు మంత్రాలకు మంత్రానికి పదివెయిల చొప్పున నలభై వేలు పంచెలో దోపుకుని బతికి పోయిన దేవుడా అంటూ బయట పడతాడు.
అక్షింతలు వేస్తూ వధూవరులను మనసారా దీవించేకంటే ఫోటోలో సరిగా పడతామో లేదో అనే తాపత్రయం కొందరిదైతే, లంచ్ లేదా డిన్నర్ చల్లారు తుందో లేదా అయిపోతుందో అనేది ఇంకొందరిది. ఏదైనా పెళ్లికి వెళ్లి వచ్చామంటే ఏదో పద్మవ్యూహంలోకి జొరపడ్డట్టే ఆ రాత్రంతా నిద్ర పట్టక కడుపులో కలవరపెట్టే క్యాటరింగ్ ఫుడ్ తో మధురానుభూతి.
పది లక్షలు ఫంక్షన్ హాలుకు.అందులో లక్ష రూపాయల పట్టు చీర, కోటి రూపాయల నగలు ఇరవైలక్షల క్యాటరింగ్ హంగామా చేసిన ఈ పెళ్లి ఎన్ని రోజులు నిలబడుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే కదా. అయినాఈ ఆర్భాటాల వల్ల మధ్య తరగతి కుటుంబాలు చాలా నలిగిపోతున్నాయి. నాదే ఒక అనుభవం చెప్తాను.
ఒక మా దూరపు బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్లాను. ఆ పెళ్లి కొడుకు ఎంతో తెలివి కలవాడైనా తల్లితండ్రుల పేదరికం వల్ల డిగ్రీ తోటి చదువు ఆపేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ, దానికి తోడు గా కొన్ని ట్యూషన్స్ చెబుతూ ఆడపిల్లల పెండ్లి కై ఉన్న కొంచెం భూమిని, ఇంటిని అమ్మి అద్దె ఇంట్లో ఉన్న తల్లి తండ్రిని పోషిస్తూ జీవితం గడుపుతున్నాడు. ఆ తల్లిదండ్రులు, అబ్బాయి తో సహా చాలా మంచివాళ్ళు. ఉన్నదానితో గడుపుకునే నిరాడంబరులు. మగపిల్లవాని పెళ్లి అనగానే ప్యాకేజీ ఎంత అని అడిగే ఈ రోజుల్లోఆ అబ్బాయికి పెళ్లి కుదరటం కష్టమైపోయింది. ఎన్నోసార్లు వాళ్ళ అమ్మ ,నాన్నలు కొడుకు పెళ్లి కుదరటంలేదని, అమ్మాయి ఉంటే చెప్పమని అనడం నాకు తెలుసు. అలాంటి పెళ్లి కుదిరిందని చాలా సంతోషించాను. తప్పకుండా వెళ్లాలని కూడానిశ్చయించుకొని వెళ్లాను.
ఫంక్షన్ హాల్ ఏదో అడగడం గుర్తు లేకపోయింది. నేరుగా ఇంటికి వెళ్ళాను. ఇంటి ముందు పందిరి,. కొంతమంది బంధువులు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. నన్ను చూడగానే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంతో ఎదురొచ్చి నన్ను ఓ కుర్చీలో ఆసీనురాలిని చేశారు. ‘హాల్ దొరకలేదా’అని, “పెళ్లి ఇక్కడేనా’ అని ఏవో ప్రశ్నలు వేయబోయి ఆమె ఏదో చెబుతుంటే ఆగిపోయా. “అమ్మా. మా ఇంటి ఓనరమ్మ చాలా మంచిదమ్మా. ఇంటి ముందే పందిరేసి పెళ్లి చేయండి. నా పెళ్లి తర్వాత ఈ ఇంటి ముందు పందిరి లేదు. శుభ కార్యం లేదు. అని మాకు సహాయపడింది. పిల్లకు తల్లి తండ్రి లేరు. పేదరికం. అనాధా శ్రమం నుండి తీసుకొచ్చి చేస్తున్నాము. అంటూ లోపలికెళ్లి పసుపు చీర తో, పెళ్లి బొట్టుతో, కాళ్ల పారాణి తో, పాపిట కుంకుమతో, తలనిండ పూలతో మహాలక్ష్మి లా ఉన్నఆ పెళ్లి కూతుర్ని వెంట తీసుకొచ్చి నా పక్క కుర్చీలో కూర్చో పెట్టింది.ఎంతో సంతోషం అనిపించింది. ఆ వచ్చిన నలుగురు చుట్టాలు, ఒకరు పెళ్లి పీటలు పందిట్లో వేస్తుంటే , ఇంకొకరు తలంబ్రాలు కలుపుతున్నారు. మరొకరు ముత్తయిదువ లందరికీ కాళ్ళకు పసుపు రాస్తుంటే మరొకామె గంధం, బొట్టు ఇస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు ఆ ఇంటి పక్క పందిరి వేసిన సందులో వంటలు చేస్తున్నారు. ఇంకొకరిద్దరు వధూవరులను అలంకరిస్తున్నారు. అక్కడ కుర్చీ మీద కూర్చున్న ప్రేక్షకురాల్ని నేనొక్కదాన్నే అనిపించింది. ఏదో తెలియని ఆనందం. నా బాల్యంలో ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన పెళ్లిళ్ల ను చూసిన అనుభూతి. బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినంత సంతోషం. ఎవరు చేసే పని మీద వాళ్లే ఏ హడావిడి లేకుండా, విసుగు పడకుండా, మేమేదో ఉచితంగా చేస్తున్నామని ఫీలింగ్ లేకుండా చేయడం ఈ రోజుల్లో ఎంత గొప్ప తనం.
పిల్లవాడి తల్లి నాకు కంపెనీ ఇవ్వడానికి కాబోలు నా పక్కన కూర్చుని ఇంకా ఏవేవో చెప్తుంది. “అమ్మా.. పిల్లని ఇవ్వమని అడగరాని వాళ్లను అడిగాం. ఒకళ్ళు నీకు జీతం తక్కువ అని, అమ్మానాన్నలను నువ్వే సాదాలి కదా అని, నువ్వు వేరే ఉంటే మా పిల్లనిస్తామని, యాడాది తేడా ఉంటే తప్పమా పిల్లనివ్వమని తలాఒక రకంగా మాట్లాడారమ్మా. మా పేదరికం వల్ల నా కొడుక్కు ఇన్ని కష్టాలు. వాడు బంగారుకొండ తల్లీ. నీకు తెలియనిది ఏముంది. ఆమె గొంతు జీరపోయింది. అన్నన్ని షరతులతోటి చేసుకున్న పెళ్లిళ్లు నిలబడతాయంటావా అమ్మా.”అంది. ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డాను. ఇప్పటి పెళ్లిళ్లు నిలబడక పోవటానికి ఈ షరతులు కూడా ఒక కారణమా? ఏదో ప్రశ్నకు సమాధానం దొరికినట్టు అనిపించింది.
విరివిగాసంపాదించడం, విచ్చలవిడిగా ఖర్చు పెట్టటం, కుటుంబ విలువలు తగ్గిపోయి నాలుగు రోజులకే పెళ్లి పెటాకులై విడాకులైపోవడం ఇవన్నీ దినచర్యలంత మామూలుగా అయిపోవడం విచారకరం. సిగ్గుచేటు. మనుషుల మార్పిడి వస్తువు మార్పిడంత తేలిక కావడం మంచిది కాదు. కొంతలో కొంతై నా మన సనాతన ఆచార వ్యవహారాలను, కుటుంబ విలువలను, నైతిక విలువలు కాపాడుకోవడం మనందరి కర్తవ్యం.
పెళ్లి, మాంగల్యం, కుటుంబం, సనాతన ఆచారవ్యవహారాలు వీటన్నింటి విలువలను కాపాడడం, ముందు తరాలకు అందించడం మన కర్తవ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రజాస్వామ్యం

సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి