శ్రీమతి శారదాశ్రీనివాసన్ గారి”నారేడియో అనుభవాలు జ్ఞాపకాలు “ప్రతిఒక్కరూ చదివి తీరాల్సిన పుస్తకం. ఆనాటి రేడియో మహామనీషులగూర్చి సరళభాషలో మనతో మాట్లాడుతున్నారు అనే భావం కలిగిస్తుంది ఈపుస్తకంలోని ప్రతిపేజీ! ఈపుస్తకంని తన కుమార్తె చిరంజీవి నీరదకు అంకితం ఇవ్వడం ఇంకో విశేషం! ఆచిన్నారి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నాట్యంలో మంచి గుర్తింపు పొందింది.ఒక బిడ్డ తన తల్లినుంచి పొందిన అపురూప కానుక.ఇక ఇందులో ఆమెకి సంబంధించిన సమాచారం క్లుప్తంగా ఇలా తెలియజేస్తాను.
శారద గారు ఆకాశవాణి నాటకాల్లో మకుటం లేని మహారాణిగా వెలిగారు. ఆగాత్రమాధుర్యం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. శ్రీకాంతశర్మగారి మాటల్లో ” అప్పుడే గడివిప్పిన ఉప్పాడ జరీచీర “. భక్తిరంజని కార్మిక కుటుంబ నియంత్రణ వ్యవసాయ స్త్రీల పిల్లల కార్యక్రమాలలో ఆమె వాణి బాణి 40ఏళ్లపాటు రాణించింది.1959లోకుమారి కాజ శారద గా హైదరాబాదు ఆకాశవాణి లో చేరిన ఆమె వేణువిద్వాంసులు శ్రీఎన్.ఎస్.శ్రీనివాసన్ గారిని వివాహం చేసుకున్నారు. 1961లోతిరుపతిలో జరిగింది పెళ్లి.
ఐదుగురు అన్న దమ్ములు నలుగురు అక్క చెల్లెళ్ళున్న పెద్ద కుటుంబం నించి వచ్చారు. విజయవాడ హిందీ కాలేజీలో ప్రవీణ్ ప్రచారక్ పాసైనారు. విజయవాడ ఆకాశవాణి లో హిందీ సంస్కృత తెలుగు నాటకాల్లో లైవ్ లో నటించారు. శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు ప్రోత్సహించారు. బందావారు గంట నాటకాల్లో ఛాన్స్ ఇచ్చారు. శ్రీ ఎం.వి.రమణ మూర్తిగారివద్ద లలిత సంగీతం నేర్చుకున్నారు.శ్రీ మంగళంపల్లి వారి ఆధ్వర్యంలో భక్తిరంజని లో పాడారు.ఆరోజుల్లో జాతీయ నాటకాలు రాత్రి 9.30నించి 11దాకా లైవ్ ప్రసారం! ఖైదీ హోనాజీబాల మంచి పేరు తెచ్చాయి. అక్కడే వింజమూరి లక్ష్మి శ్రీ రంగంగోపాలరత్నం గార్లతో పరిచయం కలిసి సినిమాలకు వెళ్లటం అందమైన అనుభవం! వీణగాత్రం పక్కాగా నేర్చుకున్నా నాటకాల్లో నటించి సినిమా నటికున్న క్రేజ్ ని కేవలం తన గాత్రం తో నవరసాలు ఒలికేలా పలికించిన పలుకు తేనెలతల్లి ఆమె!1961లో రవీంద్ర భారతి కట్టడం ఠాగూర్ శతజయంతి కి మద్రాసు విజయవాడ హైదరాబాద్ హేమాహేమీ గాయనీగాయకులతో కలిసి పాడారు.శ్రీ పి.బి.శ్రీనివాస్ గారు కూడా పాల్గొన్నారు. 1962లోచైనా దాడిటైంలోచైనా మిత్రద్రోహం వెల్లడయ్యేలా దేశభక్తి రగిలే పాటలు పొద్దుట ఇల్లు వదిలితే రాత్రి ఇల్లుచేరటం ఆనాటి వారి నిబద్ధతకి దర్పణం. ఇక న్యాయపతి కామేశ్వరి అక్కయ్యగారి ప్రోత్సాహంతో ఎన్నో ప్రోగ్రాములు చేశారు. కొన్ని డ్రామాలకు దర్శకత్వం వహించారు. శ్రీ చిరంజీవి గారితో ఎన్నో ప్రయోగాత్మక నాటకాలు చేసిన ఆమెకొద్ది నెలల క్రితం శ్రీ పోరంకి వారి ముత్యాల పందిరి సీరియల్ ప్రతిఆదివారం చదివారు.”బంగారు కలలు”సినిమా కి వహీదారహమాన్ కి డబ్బింగ్ బిర్లా ప్లానిటోరియంలో వ్యాఖ్యా నం చిరస్థాయిగా నిలిచాయి.ఈపుస్తకంని చదివితే ఆనాటి రేడియో కవులు కళాకారులగూర్చి అవగాహన ఏర్పడుతుంది.