ఏ గంధర్వ లోకం నుండి ఈ ఇలపైకి అడుగు పెట్టిందో
ఏ చీకటి తెరలను చీల్చుకుని వెలుగై ప్రసరించిందో
ఏ వేసవి గాలుల వేడిని తరిమి మలయ మారుతమై వీచిందో
వేవేల హృదయాల అందమైన కల అమృత హృదయిని ఈ అల
ఎన్ని నిద్రలేని రాత్రుల ఫలితమో ఈ విజయ శిఖరం
ఎన్ని తలదిండ్లు తడిసిన వ్యవసాయమో ఆ కలల పంట హిమచందనం
ఎన్ని ఆకలి తెలియని పగళ్ళ నెగళ్ల కృషి ఫలితమో ఈనాటి సంపంగి సుమసుగంధం
వాడిపోదు వేడుకోదు ఓడిపోదు ఈ సుమం అది దైవమిచ్చిన వరం
అణచి తొక్కిన ప్రతిసారీ పావన పాతాళ గంగలా పైకి ఉబుకుతుంది
చాచికొట్టిన బంతిని చేస్తే ద్విగుణీకృత వేగంతో వెనక్కు వస్తుంది
విసిరిన రాళ్లను ఏర్చి కూర్చి వినూత్న భవనాన్ని నిర్మిస్తుంది
కొన్నేళ్ల క్రిందటి విసిరివేయబడిన విత్తనం
భూమిని చీల్చుకుని నీటిని పీల్చుకుని మహావృక్షమై ఎదిగింది
పూల పళ్ళ బరువుతో అయినా ….వినయంగా ఒదిగింది
కొండరాళ్ళ మధ్య సన్నని నీటి ఊటలా మొదలైన ఆ జల
సాగినంత మేరా పచ్చదనాన్ని పరిచింది
పూలతీగై పాకినంత మేరా పరిమళాల్ని పంచింది
సహనం భూమికేనా ఆమెకూ ఉంది
విశాలత్వం ఆకాశానికేనా ఆమెకూ ఉంది
గంభీరత్వం సంద్రానికేనా ఆమెకూ ఉంది
ఆగ్రహం అగ్నికేనా ఆమెకూ ఉంది
సత్య సౌందర్యం మిత్ర మాధుర్యం
మానవత్వపు సౌగంధం కలబోసిన వ్యక్తిత్వం
ప్రవహించే నది …ఆశల పునాది .. ఆమె …ఆమే !